Hair Oil : పొడవైన, ఒత్తైన జుట్టుకోసం…ఈ నూనె వాడిచూడండి!…

జుట్టు రాలకుండా ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి ఇంటిలోనే ఆముదం, కొబ్బరి నూనెలు కలగలిపిన నూనెను తయారు చేసుకుంటే అది ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Hair Oil : పొడవైన, ఒత్తైన జుట్టుకోసం…ఈ నూనె వాడిచూడండి!…

Hair Care

Updated On : March 13, 2022 / 1:03 PM IST

Hair Oil : శిరోజాల సంరక్షణకు చాలా మంది వివిధ రకాల నూనెలు ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది తలకు నూనె రాయటమే మర్చిపోయారు. దీని వల్ల జుట్టు రాలిపోవటం, తెల్లబడటం, బలహీనంగా మారటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాతరోజుల్లో తలకు ఆముదం నూనె, నువ్వుల నూనె ఎక్కువగా వాడే వారు. మారిన జీవనశైలి నేపధ్యంలో కొబ్బరి నూనెతో పాటు వివిధ రకాల తలనూనెలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో వివిధ రకాల వనమూలికలతో తయారైన తల నూనెలు ఉన్నాయి.

తలకు రాసుకునే నూనెల్లో ఆముదం, కొబ్బరి నూనెలకు ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆముదం తలకు రాయటం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగటానికి ఉపకరిస్తుంది. జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. ఒమేగా 9 ఎసెన్సియల్ ఫాటీ యాసిడ్స్ , జెర్మీసైడల్ గుణాలు ఆముదంలో ఉండటం వల్ల వెంట్రుకలను మైక్రోబియల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

అదే విధంగా కొబ్బరినూనెలో సైతం యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. శిరోజాలకు వచ్చే ఇన్ ఫెక్షన్ల నుండి కొబ్బరి నూనె రక్షిస్తుంది. కుదుళ్ళకు కొబ్బరినూనె పోషకాలను అందిస్తుంది. అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, కాలుష్యం వల్ల జుట్టు రాలిపోయే సమస్యలతో బాధపడుతున్న వారు తలకు కొబ్బరి నూనె వాడటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. జుట్టు కుదుళ్ళు బలంగా చేయటంతోపాటు, జట్టును చిట్లిపోవటాన్ని , ఊడిపోవటాన్ని నివారిస్తుంది. ఈ క్రమంలోనే కొబ్బరి నూనె, ఆముదంతో రెండు కలిపి ఇంట్లోనే జుట్టుకు ఉపకరించే ఓ నూనె తయారీని తెలుసుకుందాం…

నూనె తయారీ;

జుట్టు రాలకుండా ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి ఇంటిలోనే ఆముదం, కొబ్బరి నూనెలు కలగలిపిన నూనెను తయారు చేసుకుంటే అది ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ నూనెను తయారు చేసుకోవటానికి 200గ్రాముల కొబ్బరి నూనె, 100 గ్రాముల ఆముదం తీసుకోవాలి. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి వీటిని పోయాలి.

కాస్త వేడి అయ్యాక పది ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు వేప ఆకులను వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కలోంజి గింజలు, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తలకు రాసినసందర్భంలో 5నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. రాత్రి సమయంలో నూనె రాసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటమే కాకుండా జూటూ కుదుళ్లను బలంగా చేస్తుంది. ఈ నూనె చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.