Night Sleep : రాత్రి నిద్ర పోకుంటే…మధుమేహం వచ్చే అవకాశం

నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది.

Night Sleep : రాత్రి నిద్ర పోకుంటే…మధుమేహం వచ్చే అవకాశం

Night Sleep

Updated On : December 21, 2021 / 11:23 AM IST

Night Sleep : కంటి నిండా కునుకు తీయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నాయి. బిజీ లైఫ్‌లో ఎంతోమందికి కంటి నిండా నిద్ర కరువవుతోంది. రేయింబవళ్లు మొబైల్ ఫోన్లతో గడుపుతూ నిద్రకు దూరమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగానే బావించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

అలా కాకుండా నిద్రకు దూరం అవుతుంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఆరోగ్యసమస్యలు రావటం ఖాయమని గుర్తుంచుకోవాలి. నిద్రలేమి కారణంగా మధుమేహానికి గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని స్టడీలు కూడా స్పష్టం చేశాయి. ఈ వయస్సులో సరైన నిద్రలేకపోతే శరీరం.. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణ సామర్థ్యం కోల్పోతుందట. అంతేగాక రోగ నిరోధక సమస్యలు ఏర్పడి వివిధ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

గాఢనిద్ర లేకుండా, తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహానికి నిద్ర నాణ్యతకూ మధ్య సంబంధాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యుక్తవయస్కుల్లో గాఢనిద్ర తగ్గితే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే శక్తి తగ్గటం వల్ల టైప్‌-2 మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం మూడు రోజులపాటు ఇలా గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఇన్సులిన్‌ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించటానికి ఎక్కువ మోతాదుల్లో ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతంగా భావించవచ్చు.

నిద్ర గంటలు తగ్గినకొద్దీ మధుమేహం ముప్పు పెరుగుతుందని గత ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రస్తుత తాజా అధ్యయనంలో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని సూచిస్తోంది. గాఢనిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతుంటుందనీ, ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందనీ పరిశోధకులు అంటున్నారు.

నిద్రలేమి వల్ల ఆకలి పుట్టించే గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే కడుపు నిండిందనే భావన కలిగించే లెప్టిన్ హార్మోన్ చాలా తక్కువగా విడుదల అవుతుంది. ఫలితంగా ఆకలి పెరిగి ఎక్కువ ఆహారాన్ని తినేస్తారట. అతిగా ఆహారాన్ని తినడం వల్ల ఊబకాయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం వేళల్లో చురుగ్గా ఉంటుందని, కానీ.. రాత్రి వేళ విశ్రాంతి లేకుండా చేసి.. ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వడం వల్ల ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి వల్ల శరీరంలో ఎంతో సున్నితంగా ఉండే మెదడుపై ఈ ప్రభావం రెండింతలు అధికంగా ఉంటుంది. శరీరంలోని అన్ని క్రియలు సక్రమంగా జరిగేలా మానిటర్ చేసేది మెదడే. అందుకే, రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. కాబట్టి రాత్రి నిద్రకు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించటం ఉత్తమం. దీని వల్ల ఆరోగ్యం సాఫీగా ఉంటుంది.