INDIAలో ఫస్ట్: నో క్యాస్ట్-నో రిలీజియన్ సర్టిఫికేట్ పొందిన మహిళ

భారత్‌లో తొలిసారి మహిళ నో క్యాస్ట్.. నో రిలీజియన్(మతం) సర్టిఫికేట్ పొంది చరిత్ర సృష్టించింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు పక్షపాతం చూపించే భారతావనిలో ఈ వ్యవస్థలపై చిరాకుతో చాలామంది అవసరమైన చోట కూడా కులాలు, మతాల స్థానంలో ఖాళీగా వదిలేస్తుంటారు. కానీ, ఈమె అంతటితో సరిపెట్టుకోలేదు. కులం లేదు, మతం లేదు అంటూ సర్టిఫికేట్ అందుకుంది తమిళనాడులోని తిరుపత్తూరుకు చెందిన 35ఏళ్ల స్నేహ తహసీల్దార్ సత్యమూర్తి చేతుల మీదుగా ఈసర్టిఫికేట్ పొందింది.
చిన్ననాటి నుంచే కులాలు, మతాలు ప్రతిబింబించని కుటుంబంలో పుట్టిన స్నేహ.. విద్యావకాశాలు కానీ, విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ, చివరికి వాటి అవసరమున్న చోట కూడా ఖాళీగానే ఉంచేవారట. ‘నా బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్‌లన్నింటిలోనూ కులం, మతం రాయాల్సిన స్థానాల్లో ఖాళీగానే ఉంచేదాన్ని. అలా చేయడం వల్ల వారు దానికి కూడా కమ్యూనిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మని అడుగుతుండేవారు. ఆ సమస్యకు పరిష్కారం కోసమే నో కాస్ట్ నో రిలీజియన్ కోసం అప్లై చేశాను’ అని చెప్పుకొచ్చారు.
‘కులాలు, మతాలు అని నమ్మేవాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వగలిగినప్పుడు మాలాంటి వాళ్లకు సర్టిఫికేట్‌లు ఎందుకివ్వరు. నేను ఈ సర్టిఫికేట్ పొందడానికి 2010నుంచి అప్లై చేస్తున్నాను. కానీ, ఎవ్వరూ స్పందించకపోగా, కొందరైతే తిరస్కరించేవారు. ఇలా భారతదేశంలో ఎవరూ లేరంటూ తోసిపుచ్చేవారు. 2017లో దీనిపై సీరియస్‌గా పోరాటం జరిపా. నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రిజర్వేషన్ అవసర్లేదని ఎలాంటి స్కీముల గురించి తాపత్రయపడట్లేదని కరాఖండిగా చెప్పేశా’
తిరుపత్తూరు సబ్ కలెక్టర్ బి. ప్రియాంక పంకజం నో క్యాస్ట్-నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ‘తాను ఏ కులానికి, మతానికి చెందినది కాదనే సర్టిఫికేట్ కావాలని అడిగింది. తన స్కూల్ దశ నుంచి అన్ని సర్టిఫికేట్స్‌ను పరిశీలించాం. వాటిలో ఎక్కడా వాటి ప్రస్తావన లేదు. ఒకవేళ ఇలా ఇవ్వడం వల్ల ఎవరి అవకాశాలకు ఆటంకం రాదు. ఎటువంటి ప్రభావం చూపదు. అందుకే ఈ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డాం’ అని సబ్-కలెక్టర్ తెలిపారు.
స్నేహ భర్త, కే ప్రతిభా రాజా తమిళ్ ప్రొఫెసర్.. మాట్లాడుతూ వారి ముగ్గురు కూతుళ్ల చదువులకు కూడా ఏ రకమైన కుల, మతాల పేర్లు వాడుకోలేదని వారి పేర్లు కూడా రెండు మతాలు ప్రతిబింబించేలా పెట్టామని పేర్కొన్నారు. వారి పేర్లు ఆదిరై నస్రీన్, ఆదిలా ఐరెనె, ఆరిఫా జెస్సీలు.