Sleep Well : పరీక్షల సమయంలో కంటి నిండా నిద్ర ముఖ్యమే!

ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీపట్టటం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది.

Sleep Well : పరీక్షల సమయంలో కంటి నిండా నిద్ర ముఖ్యమే!

Sleep Well During Exams (1)

Updated On : April 23, 2022 / 2:37 PM IST

Sleep Well : అధిక మార్కులే లక్ష్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలను రాత్రింబవళ్లు చదివిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఒత్తిడి.. ఆందోళన పెరిగి నిద్రకు దూరమవుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు. పరీక్షలకు ముందు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల అభిరుచిని తల్లిదండ్రులు పట్టించుకోకుండా మంచి మార్కుల లక్ష్యంతో విద్యార్థులను అధిక ఒత్తిడి గురిచేస్తున్నారు. దీంతో వారు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. రాత్రంతా మేల్కొని చదవటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా మార్కులు సాధించటంలో విఫలం కావటం, చదివింది సరిగా గుర్తుండకపోవటం వంటివి చోటు చేసుకుంటాయి.

ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేవడం మళ్లీ హడావుడి.. దీంతో పిల్లలకు విశ్రాంతి కొరవడుతుంది. ప్రత్యేక తరగతులు, పరీక్షల పేరుతో ఒత్తిడి పెరుగుతుంది. నిద్రకు మూడు నాలుగు గంటలు మించి కేటాయించకపోవటం వల్ల శారీరకంగా, మానసికంగా అలిసిపోయి చదివింది కూడా గుర్తుండని పరిస్ధితి ఉత్పన్నం అవుతుంది. ఎన్నిసార్లు చదివినా కొద్దిసేపటికే మరిచిపోవటం ఇటీవలికాలంలో పిల్లలను వేధిస్తున్న సమస్యల్లో ఒకటిగా మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు పాటించాలని మానసిక నిపుణులు. సూచిస్తున్నారు.

ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీపట్టటం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది. రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవడం, రాత్రంతా మేల్కొని చదవడం అసలు చేయరాదు. మధ్య మధ్యలో విరామమిచ్చి, విశ్రాంతి పొందాలి. అప్పుడప్పుడు ఒత్తిడినుంచి ఉపశమనం పొందాలి. పిల్లల మనోభావాలు దెబ్బతినేలా తల్లిదండ్రులు వ్యవహరించకూడదు. అదే పనిగా చదువుకోవాలని ఒత్తిడి చేయకూడదు. చక్కటి వ్యాయామం, సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఉపశమన మార్గాలను ఆచరించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.