లెక్కించడానికే 4 గంటలు : సంచుల్లో రూ.83వేల చిల్లరతో బండి కొన్నాడు

అసలే పండుగ సీజన్. ప్రతిఒక్కరికి కొత్త వాహనం కొనాలని ఉంటుంది. దంతే రష్ సందర్భంగా కొత్త వాహనాలను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందరిలానే మధ్యప్రదేశ్ లోని శాంటా జిల్లాకు చెందిన వ్యక్తి కూడా హోండా యాక్టివాను కొనాలని ముచ్చటపడ్డాడు. అతడి పేరు.. రాకేశ్ గుప్తా.. ఎన్నో ఏళ్లుగా పొగుచేసిన చిల్లరంతా బయటికి తీశాడు. నాలుగు గోనెసంచుల్లో చిల్లరంతా కుక్కేశాడు. నేరుగా షోరూంకు చిల్లరతో వెళ్లాడు. తనకు నచ్చిన హోండా యాక్టివాను సెలెక్ట్ చేసుకున్నాడు. రేటు మాట్లాడుకున్నాడు. చివరికి రూ.83వేలకు రేటు ఫిక్స్ అయింది. ఇంకేముంది డబ్బులు కట్టి బండి తీసుకుపోవడమే మిగిలింది. వెంటనే తన వెంట తెచ్చిన గోనె సంచులను తెరిచాడు. వేలాది రూపాయల నాణేలను షోరూంలో రాశుల్లా పోశాడు.
అందులో రూ.5, రూ.10 నాణేలు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.83వేలు చెల్లించాడు. అంతా చిల్లర నాణేలే కావడంతో షోరూం వాళ్లు కంగుతిన్నారు. తెచ్చిన చిల్లరంతా లెక్క పెట్టడానికి వారికి 4 గంటల సమయం పట్టింది. లెక్క సరిపోవడంతో సంతోషంతో కొత్త హోండా యాక్టివా 125 (BSVI)ను రైడ్ చేసుకుంటూ గుప్తా ఇంటికి వెళ్లాడు. షోరూం మేనేజర్ అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ.. దంతే రష్ సందర్భంగా మా షోరూంకు రాకేశ్ గుప్తా అనే వ్యక్తి గోనె సంచులతో వచ్చాడు. హోండా యాక్టివా 125BSVI వెహికల్ కొనాలని చెప్పాడు. షోరూం యజమాని అశిష్ పూరితో మాట్లాడాను.
ముందుగా గుప్తా తెచ్చిన సంచుల్లోని నాణేలను లెక్కించాం. దంతే రష్ రోజున కస్టమర్లను అసంతృప్తికి గురిచేయరాదనే ఉద్దేశంతో ఆ చిల్లర నాణేలను తీసుకున్నాం’ అని మిశ్రా తెలిపారు. గుప్తా తెచ్చిన చిల్లర నాణేలను లెక్కించడానికి షోరూంలో ముగ్గురు వర్కర్లు నాలుగు గంటల పాటు సమయం పట్టిందన్నారు. హోండా మోటార్ సైకిల్ కంపెనీ ఇటీవల కొత్త యాక్టివా 125ను మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇదో టాప్ ఎండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్. BS-VI కంప్లయింట్ ఉద్గార ప్రమాణాలతో ఈ వేరియంట్ వచ్చింది. దీని ధర (ఎక్స్ -షోరూం) రూ.74వేల 490గా ఉంది.