Overweight Obesity : అధిక బరువు… స్థూలకాయం మధ్య వ్యత్యాసం తెలుసా?
అధిక బరువు, ఊబకాయం సంబంధిత అనారోగ్య వ్యాధులనుండి బయటపడాలంటే చికిత్సపొందటం మంచిది. జీవనశైలిలో మార్పు అవసరం.

Overweight (1)
Overweight Obesity : సాధారణ భాషలో అధిక బరువును ఊబకాయంతో పోల్చి చెప్తారు. అయితే అధిక బరువు, ఊబకాయం మధ్య వ్యత్యాసం శరీరంలోని అధిక కొవ్వులు పేరుకుపోవడంలో ఉంటుంది. అధిక బరువు అనేది ప్రమాద కారకంగా పరిగణిస్తే, ఊబకాయాన్ని ఒక వ్యాధిగా నిర్వచించారు. ఎందుకంటే ఊబకాయం అనేది అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి. బొడ్డు చూట్టూ కొవ్వు అధికంగా చేరడం అన్నది మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచడం వంటి అనేక జీవక్రియ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది దీనిని నిర్ణయిస్తుంది. ఊబకాయం ఆర్థరైటిస్ , ఫ్యాటీ లివర్, స్లీప్ అప్నియా, వంధ్యత్వం, అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక బరువు మరియు ఊబకాయం మధ్య తేడా తెలుసుకోవటం ఎలా?
ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా అధిక బరువు కలిగిఉన్నారా లేక ఊబకాయం కలిగి ఉన్నారో నిర్ణయించబడతాడు. బరువు ,ఎత్తు ఆధారంగా లెక్కించబడే కొలతగా బిఎమ్ ఐ ని చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరణ ఆధారంగా, ఒక వ్యక్తి యొక్క బిఎమ్ఐ 25 కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువు కలిగి ఉన్నట్లు భావించాలి. బిఎమ్ ఐ 30 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయంగా చెప్పవచ్చు. ఆసియా ప్రాంతంలో నివశించే జనాభాకు సంబంధించి అధిక బరువు, ఊబకాయం గురించి నిర్ధారించాలంటే బిఎమ్ఐ ప్రమాణాలను 2.5 పాయింట్లు తగ్గించాలని సూచిస్తున్నారు. మధుమేహం ఇతర జీవక్రియ సమస్యలకు దారితీసే విసెరల్ కొవ్వు ఆసియా ప్రాంత జనాభాలో అధికంగా ఉంటుంది.
ఊబకాయం ఉన్న రోగులు, అధిక బరువు ఉన్న రోగులతో పోలిస్తే, అనారోగ్య సమస్యల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి బెరీయాటిక్ శస్త్రచికిత్స అవసరం కావచ్చు. బిఎమ్ ఐ 40 కంటే ఎక్కువ ఉంటే అది అనారోగ్య స్థూలకాయంగా పరిగణించవచ్చు. ఆ సందర్భంలో బరువు అనేది సాధారణంగా అనారోగ్య సమస్యకు దారి తీస్తుంది. స్థూలకాయంతో అనారోగ్య సమస్యలకులోనైన రోగులు బరువు తగ్గేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కదలలేని పరిస్ధితి వల్ల వ్యాయామాలు చేయటం సాధ్యంకాక కొంత నిరాశకు, మానసికంగా ఇబ్బందులకు గురవుతుంటారు.
అధిక బరువు, ఊబకాయం ప్రధానంగా క్యాలరీ తీసుకోవడం, కేలరీల ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. స్థూలకాయానికి విభిన్నకారణాలు ఉంటాయి కాబట్టి దానిని ఒక వ్యాధిగా చెప్పబడింది. హార్మోన్ల అసమతుల్యతలు, జన్యుశాస్త్రం, సామాజిక-సాంస్కృతిక మరియు పర్యావరణ కారకాలు ఊబకాయానికి దారితీయవచ్చు. జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక కేలరీల ఆహారాలు, శక్తి అధికంగా ఉండే ఆహారాలు ఇందుకు కారణం అవుతాయి. అతిగా తినడం, హైపోథైరాయిడిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కూడా ఇందుకు కారణం కావచ్చు. కార్డియోవాస్కులర్ వ్యాధులు, మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్ క్యాన్సర్లు , మధుమేహం వంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితులు అధిక బరువు , కొవ్వు పేరుకుపోవడం వల్ల ఊబకాయానికి దారీతీయవచ్చు.
అధిక బరువు, ఊబకాయం సంబంధిత అనారోగ్య వ్యాధులనుండి బయటపడాలంటే చికిత్సపొందటం మంచిది. జీవనశైలిలో మార్పు అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు కార్బోహైడ్రేట్లు, కొవ్వులను తగ్గించి, తగినంత ప్రోటీన్, ఫైబర్ నీరు తీసుకోవడం వంటివి చేయాలి. శారీరక శ్రమ, బహిరంగ ఆటలు, క్రీడలు మేలు చేస్తాయి. టెలివిజన్ చూస్తూ ఆహారం తీసుకోవటం మానుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, సహజ ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక బరువును ఊబకాయంగా మారనివ్వకుండా జాగ్రత్త పడవచ్చు.