Psoriasis : చర్మానికి సోరియాసిస్ ముప్పు..ఎందుకంటే?..
పసుపును సోరియాసిస్ ఉన్న చోట కొబ్బరినూనె కలిపి పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కలపిన ఆయింట్మెంట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి.

Psoriasis
Psoriasis : మన అంతర్గత రోగనిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే దాడి చేయడం వలన కలిగే వ్యాధులను ఆటో ఇమ్యూన్ వ్యాధులుగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యాధులలో సోరియాసిస్ ప్రధానమైనది. కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి వేదన కలిగిస్తాయి. సోరియాసిస్ ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. సోరియాసిస్ వస్తే చర్మ రూపం, దృఢత్వం దెబ్బతిని మృదుత్వం కోల్పోయి రాలిపోతుంది. దీన్నే సోరియాసిస్ అంటారు.
సోరియాసిస్ రావడానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. మన రోగనిరోధక శక్తిలో భాగమైన కణాల నుండి వెలువడే సైటోకైన్లు చర్మ కణాల మీదే దాడి చేయడంతోనే ఈ సమస్య వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో వాపు, చర్మకణాలు వేగంగా పుట్టుకురావటం వంటివి మెదలై సమస్య మొదలవుతుందని చెబుతున్నారు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి.. అంటువ్యాధి కాదు. ఎక్కువగా వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది. దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది. మానసిక వత్తిడి ఒక ముఖ్య కారణం. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కూడా కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం మరోకారణం. డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది.
శరీరంలో ఏప్రాంతంలోనైనా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు, కాళ్లు, మాడు, వీపు, అరచేతులు, అరికాళ్లు, తలలో కూడా వస్తుంది. సోరియాసిస్ లక్షణాల్లో శరీరంలో ఎక్కడైనా లేత గులాబీ, ఎర్రటి రంగులో మచ్చలు, వీటిపై తెల్లని పొలుసులు. చర్మం పొడిబారి పగిలినట్లుగా అయిపోయి రాలిపోవడం. ఎక్కువగా మంట, దురద, నొప్పి పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం. కొన్ని అలవాట్లు, సమస్యలు ఈ వ్యాధి మరింత ముదిరేలా చేస్తాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సోరియాసిస్ జాగ్రత్తలు ;
సోరియాసిస్ బాధితులు చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వల్ల చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు పై పూతగా రాయాలి. సోరియాసిస్ బాధితులు డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారం బదులు.. శాఖాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చేపలు ఆహారంగా తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారులైతే పరిమితంగా తినాలి. క్యారెట్ల రసం, నారింజ రసం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అవిసె గింజలు, ఆక్రోట్స్ బాగా ఉపకరిస్తాయి.
పసుపును సోరియాసిస్ ఉన్న చోట కొబ్బరినూనె కలిపి పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు కలపిన ఆయింట్మెంట్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది. ఉదయం సూర్యుడి కిరణాల్లో విటమిన్-డి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. అధికంగా నీరు తాగాలి. ప్రొటీన్లు కల ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
చల్లని ప్రదేశాల్లో ఉండకూడదు. కాలుష్యానికి దూరంగా ఉండాలి. చర్మంపై క్రీములు వాడాల్సి వస్తే వైద్యుల సలహా మేరకే రాయాలి. సబ్బుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. చర్మాన్ని గోకటం, రక్కటం వంటి పనులు చేయకూడదు. దురుగా ఉందని చర్మాన్ని రుద్దకూడదు. వీలైనంత వరకు ఉన్ని దుస్తులను ధరించాలి. ఇలా చేయటం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.