Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5నుండి15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల చిన్నారుల గుండె కవాటాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది.
Rheumatic Fever
Rheumatic Fever : చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరాన్ని సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తేలికగా తీసుకుంటుంటారు. అయితే దీనిని ఏమాత్రం చిన్న సమస్యగా చూడటం మంచిది కాదు. ఈ పరిస్ధితి ముందుగా టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీస్తుంది. ఇది కొందరిలో గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇలాంటి పరిస్ధితుల్లో సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించాలి. సకాలంలో చికిత్స అందించకుండా జాప్యం చేస్తే మాత్రం చివరకు అది రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది.
ముందు జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇది రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అదే క్రమంలో పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువంటి ప్రధాన లక్షణాలు చిన్నారుల్లో గుర్తించవచ్చు. జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.
రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5నుండి15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల చిన్నారుల గుండె కవాటాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. తొలిదశలోనే చికిత్స అందిస్తే యాంటీబయాటిక్స్‌తోనే సమస్య తగ్గుతుంది. చికిత్స అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీస్తుంది. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది. మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ మెడిసిన్స్ జీవితాంతం వాడాల్సి వస్తుంది. పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్య భావించకుండా పిల్లల వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించటం మంచిది.
