Stress : యుక్తవయస్సులో ఒత్తిడి…గుండెకు ముప్పే
వేళకు భోజనం చేయటంతోపాటు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలి. వ్యాయాం క్రమం తప్పకుండా చేయాలి.

Stress
Stress : యుక్తవయసు వారిలో చాలా మంది మానసిక ఒత్తిడులకు లోనవుతుంటారు. వృత్తిపరమైన, కుటుంబపరమైన, ఆర్ధిక పరమైన అనేక సమస్యలు వారిని చుట్టుముట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ పరిస్ధితి చాలా మంది యువతలో గుండెజబ్బులకు కారణమవుతుంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల వారిలో 30 శాతానికి పైగా గుండెజబ్బులతో చికిత్సకు వస్తున్న వారి సంఖ్య ఇటీవలికాలంలో బాగా పెరిగింది. ఈ సమస్యకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడికి లోనుకావటమేనన్నిది నిపుణుల వాదన.
దైనందిన జీవితంలో ఒత్తిడి వల్ల తక్కువ వయసులోనూ హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అధిక ఒత్తిడి బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్‌ను పెంచుతుంది. సరిగా నిద్ర పట్టకపోవటం, పగలు గుండె దడ ఉండటం, ఆందోళనగా కనిపించటం, ఏకాగ్రత లోపించటం, చెమట పట్టడం, చేతుల్లో వణుకు రావటం, గుండె భారంగా అనిపించటం, తీవ్ర అలసట, కడుపులో మంట, ఒత్తిడి కారణంగా విరోచనాలవ్వటం ,ఆందోళన వల్ల వచ్చే ఒత్తిడి, గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒత్తిడిని వివిధ పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.
హృద్రోగ కారకాలైన అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగటంతో పాటు మధుమేహం అదుపు తప్పుతోంది. ఫలితంగా యుక్త వయసులోనే హృద్రోగ సమస్యలు వస్తున్నాయి. మానసిక ఒత్తిడితోపాటు హృద్రోగ ముప్పును గుర్తించేందుకు వీలుగా కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్, ఇకో కార్డియోగ్రామ్, యాంజియోగ్రామ్, టీఎంటీ పరీక్షలు చేయించుకోవాలి. యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెజబ్బు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
వేళకు భోజనం చేయటంతోపాటు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలి. వ్యాయాం క్రమం తప్పకుండా చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్‌లైన యోగా, మెడిటేషన్‌లు నిత్యం చేయాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం, ఆత్మీయులతో మాట్లాడటం, కాలాను గుణంగా కొత్త ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లటం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసికవైద్యుల వద్ద కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే దురలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం అలవాటును పూర్తిగా మానుకోవాలి. వేళాపాళా లేకుండా క్రమం తప్పి భోజనం చేయటం మానుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం వల్ల గుండె జబ్బుల నుండి బయటపడవచ్చు.