Cancer : క్యాన్సర్ దరిచేరకుండా కాపాడే ఆహారాలు ఇవే..
గింజల్లో సమృద్ధిగా ఉండే క్యుయెర్సిటిన్, క్యాంఫెరాల్... వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. నట్స్ అన్నీ క్యాన్సర్ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం అత్యధికం.

Cancer Foods (1)
Cancer : ప్రపంచంలో భయంకరమైన వ్యాధిగా క్యాన్సర్ ను చెప్తారు. ముఖ్యంగా కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను కణితి అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ సహస్రాబ్దిలో మనిషిని అత్యధికంగా భయపెడుతోన్న వ్యాధి ఏదైనా ఉందీ అంటే అది నూటికి నూరు శాతం క్యాన్సరే. ఏటా దాదాపు 1.41 కోట్ల మంది దాని బారినపడుతున్నారు. 82 లక్షల మంది మరణిస్తున్నారు. జీవనశైలితోపాటు తీసుకునే ఆహారమూ ఈ వ్యాధికి ప్రధాన కారణమనీ పరిశోధనలు చెబుతున్నాయి.
క్యాన్సర్ మహమ్మారి బారిన పడుకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. ఎందుకంటే మనం ప్రకృతి ప్రసాదించిన సాత్విక ఆహారాన్ని తీసుకుంటే అందులో ఉండే గుణాలు క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను మన దరి చేరకుండా కాపాడతాయి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక వేళ తెలిసినా కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఆధునిక జీవన పోకడలు వారిని పెఢధోరణులవైపు నడిపిస్తూ సాత్విక ఆహారానికి దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే క్యాన్సర్ దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
టొమాటో ; టొమాటోల్లోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడం ద్వారా క్యాన్సర్లను నివారిస్తుంది. వేసవిలో వచ్చే టొమాటోల్లో ఈ లైకోపీన్ శాతం మరీ ఎక్కువ. ఈ లైకోపీన్ నోటి క్యాన్సర్ కణాలను అద్భుతంగా నాశనం చేస్తుందని ఇజ్రాయెల్ పరిశోధకులు నిరూపించారు. ఉడికించిన టొమాటోల్లో విటమిన్-సి శాతం ఎక్కువ. ఇది సాధారణ కణాలు దెబ్బతినకుండానూ క్యాన్సర్ రాకుండానూ నిరోధిస్తుంది. వీటిని తినడంవల్ల రొమ్ము, ప్రొస్టేట్, క్లోమ, మలద్వార క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గింజ ధాన్యాలు ; గింజల్లో సమృద్ధిగా ఉండే క్యుయెర్సిటిన్, క్యాంఫెరాల్… వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాపించకుండా అడ్డుకుంటాయి. నట్స్ అన్నీ క్యాన్సర్ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం అత్యధికం. అందుకే ఇది ప్రొస్టేట్ క్యాన్సర్‌ను చాలావరకూ నిరోధించగలదు. అయితే నట్స్ కొందరిలో అలర్జీలకు కారణమవుతాయి. అలాంటివాళ్లు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మేలు. వాల్‌నట్స్, అవిసెగింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్‌ను సమర్థంగా అడ్డుకుంటాయి. అవిసెలతోబాటు ఇతర ముడిధాన్యంలోని పీచుతో పేగు, మలద్వార క్యాన్సర్లనూ నిరోధించవచ్చు. అవిసెల్లోని లిగ్నన్లు కంతులు పెరగకుండా చూస్తాయి.
వెల్లుల్లి ; వెల్లుల్లిలోని ఎలియం పదార్థాలు క్యాన్సర్‌తో పోరాడే రోగనిరోధక కణాలను ప్రేరేపించడం ద్వారా కంతుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటాయి. క్యాన్సర్ కారక కణాలు ఆరోగ్యకర కణాల్లోకి ప్రవేశించకుండానూ అడ్డుకుంటాయి. డై-ఎలైల్-సల్ఫైడ్ అనే పదార్థం కాలేయంలోని క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి దోహదపడుతుంది. అలాగే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువ. ఇవి పొట్ట, పేగు క్యాన్సర్లనూ నిరోధిస్తాయి.
పసుపు ; పసుపులో సైక్లో-ఆక్సిజినేజ్-2 శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు క్యాన్సర్‌ను సమర్థంగా తిప్పికొడుతుంది. అలాగే ఇందులోని కుర్‌క్యుమిన్ కంతుల పరిమాణాన్ని తగ్గించడంతోబాటు మంటను తగ్గించడం ద్వారా పేగు, రొమ్ము క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందట. అందుకే కప్పు నీళ్లలో టీస్పూను పసుపుతో పావు టీస్పూను మిరియాలపొడి కలిపి రోజూ తాగితే ఫలితం ఉంటుంది. పసుపులో సైక్లో-ఆక్సిజినేజ్-2 శాతం ఎక్కువగా ఉండటంతో అది పేగు క్యాన్సర్‌ను సమర్థంగా తిప్పికొడుతుంది. అలాగే ఇందులోని కుర్‌క్యుమిన్ కంతుల పరిమాణాన్ని తగ్గించడంతోబాటు మంటను
తగ్గించడం ద్వారా పేగు, రొమ్ము క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది.
సిట్రస్ పండ్లు ; సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, కమలా… వంటి వాటిల్లోని మోనోటెర్పీన్లు క్యాన్సర్ కారక కార్సినోజెన్ కణాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. ముఖ్యంగా గ్రేప్‌ఫ్రూట్ రొమ్ముక్యాన్సర్‌ను అద్భుతంగా తగ్గిస్తుందని తేలింది. ఇంకా వీటిల్లోని లిమోనిన్‌లు క్యాన్సర్ కణాలను నాశనం చేసే లింఫోసైట్లనూ ప్రేరేపిస్తాయి.
తేయాకు ; గ్రీన్ టీ, బ్లాక్ టీల్లోని కెటెచిన్లు క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటాయి. అంతేకాదు, ఇవి పొట్ట, పేగు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమ క్యాన్సర్లన్నింటినీ నిరోధించగలవని తేలింది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రోగులకు గ్రీన్ టీ ఎంతో మేలు కలిగిస్తుంది.
తాజా ఆకుకూరలు ; విటమిన్లూ ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ ఎంజైములూ అధికంగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు అన్ని విధాలా మంచివే. క్యాలరీలూ తక్కువ. పాలకూర, కేల్, వాటర్ క్రెస్… వంటి వాటిల్లో క్యాన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. వీటిల్లోని గ్లూకోసైనోలేట్లు అన్నిరకాల క్యాన్సర్ కారక కణాలనూ పనిచేయకుండా చేస్తాయి. దాంతో కంతులు పెరగకుండా ఉంటాయి.
బొప్పాయి ; బొప్పాయిలోని సి- విటమిన్ అద్భుత యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తూ క్యాన్సర్ కారక నైట్రస్‌అమైన్లు శరీరంలోకి శోషణ చెందకుండా చేస్తుంది. అలాగే ఇందులోని ఫొలాసిన్ అనేక క్యాన్సర్లను నిరోధిస్తుంది.అలాగే బెంజాల్డిహైడ్‌కు ప్రధాన నిల్వలైన అత్తిపండ్లు కంతుల్నికుంచించుకుపోయేలా చేస్తాయట. ఇవి జీర్ణాశయ క్యాన్సర్ల నివారణకీ తోడ్పడతాయి. గింజలతోబాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, మాంసాహారం తీసుకుంటే ఎముక క్యాన్సర్ నివారణ సులభమవుతుంది.
మిర్చి ; మిర్చి జాతుల్లోని క్యాప్సైసిన్ సైతం క్యాన్సర్ కారక నైట్రస్ అమైన్లను నిరోధించడం ద్వారా పొట్ట క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. క్యాప్సికమ్‌లోని ఫైటోకెమికల్స్ కూడా జీర్ణాశయ క్యాన్సర్లను కొంతవరకూ నివారిస్తాయి.
పుట్టగొడుగులు ; మంచి పోషకాహారంగా మాత్రమే కాదు, పుట్టగొడుగుల్లోని లెంటినాన్ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. వీటిల్లోని లెక్టిన్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చేస్తుంది.
అవకాడో ; యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో నిరంతరం పోరాడుతూ వాటి పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో మొదటగా చెప్పుకోదగ్గది అవకాడో.
ఇందులో అధికంగా ఉండే గ్లూటాథియోన్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంటు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లనూ నిరోధిస్తుంది. అందుకే ఈ గ్లూటాథియోన్‌ను మాస్టర్ యాంటీ
ఆక్సిడెంట్ గా పిలుస్తారు.
నాన్ రిఫైన్డ్ నూనెలు ; మెదడుతోబాటు నాడీవ్యవస్థలో 60 శాతం కొవ్వు ఆమ్లాలతోనే నిర్మితమై ఉంటుంది. కానీ మనం ఆహారం ద్వారా తీసుకునే నూనెల్లో రిఫైన్డ్ వెజిటబుల్, హైడ్రోజినేటెడ్ నూనెల శాతమే ఎక్కువ. దాంతో అవి కణాలమీద దాడి చేయడంతో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. వాటికి బదులు నాన్‌రిఫైన్డ్ కొబ్బరి, అవిసె, కాడ్ లివర్, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్… వంటి నూనెల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు క్యాన్సర్ వ్యాధుల్నిదరిచేరకుండా చూస్తాయి.