White Hair : తెల్లజుట్టు సమస్య…ఆయుర్వేద పరిష్కారాలు

కామంచి గింజలు నల్ల నువ్వులు సమానంగా తీసుకుని గానుగ లో వేసి తైలాన్ని తీయాల. దీనిని రోజువారిగా తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.

White Hair : తెల్లజుట్టు సమస్య…ఆయుర్వేద పరిష్కారాలు

White Gray Hairs

Updated On : December 11, 2021 / 2:14 PM IST

White Hair : తెల్ల జుట్టు అనారోగ్యానికి సూచన కాకపోయినప్పటికీ ఆందోళనను మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో తెల్లజుట్టు వస్తుంటే అనేకమంది డీలా పడిపోతారు. అయితే సరైన అవగాహన కలిగి ఉంటే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. మన తల మీద పెరిగే ప్రతి వెంట్రుక కు నల్లని రూపంలో ఉన్న కాండం ఉంటుంది. అలాగే వెంట్రుకలను స్థిరంగా ఉంచడం కోసం అడుగున ఒక మూలం ఉంటుంది. ఈ మూలం లో ఉండే గ్రంధులు నల్ల రంగు కు కారణమైన మెలనిన్ అనే ఒక వర్ణ విశేషాన్ని విడుదల చేస్తుంటాయి. ఎక్కువ మంది భారతీయులు జుట్టు రంగు నలుపు లో ఉంటే కొంతమందికి రాగి రంగులో ఉంటుంది. వెంట్రుకల్లో ని వర్ణవశేషాల సాంద్రతల్లో తేడాల వలన రంగులో మార్పులు కనిపిస్తుంటాయి.

వెంట్రుకల అడుగు భాగంలో ఉండే సెబేసియస్ అనే గ్రంధులు సెబం అనే ఒక నూనె లాంటి పదార్థాన్ని వెంట్రుకల కుదుళ్ల లోనికి విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా , మెరుస్తూ ఉంటాయి.ఈ గ్రంథుల పనితీరు లోపం ఏర్పడితే వెంట్రుకలు బిరుసుగా పొడిగా మారుతాయి. వయసు మీదపడుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం సహజం. దీనికి కారణం వెంట్రుకల కణజాలాలు లోనికి గాలి చేరడమే. అలాగే వెంట్రుకల రంగుకు కారణమైన మెలనోసైట్స్ కణజాలాలు క్రమంగా అంతరించడం వల్ల మెలనిన్ సరిగా విడుదల కాకపోవడంతో జుట్టు తెల్లబడుతుంది. అయితే యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటే మాత్రం దాని గురించి ఆలోచించ వలసి ఉంటుంది.

యుక్త వయసులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం జన్యుపరమైన మార్పులు అయినప్పటికీ ఇతర శారీరక రుగ్మతలను ఆహారపరమైన సమస్యలను విస్మరించకూడదు. బి విటమిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, రక్తాల్పత, ధూమపానం ఇలాంటివన్నీ జుట్టును త్వరగా తెల్లబడేలా చేస్తాయి. కాబట్టితెల్లజుట్టు సమస్యను కాస్మొటిక్ సమస్యగా కాకుండా వైద్యపరంగా కూడా చూడవలసి ఉంటుంది.

ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ;

ఒక రాత్రి అంతా కొన్ని ఉసిరికాయలను నీళ్లలో నానేసి నీళ్లను సిద్ధం చేసుకోవాలి .అలాగే మండూరి భస్మం, ఉసిరికాయ, మందార పువ్వు వీటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా రుబ్బి పేస్టులాగా చేయాలి .దీనిని తలకు పట్టించి గాలికి ఆరనివ్వాలి. జుట్టు బాగా ఆరిన తర్వాత ఉసిరి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉసిరికాయ రెండు భాగాలు ,తానికాయ ఒక భాగం ,కరక్కాయ రెండు భాగాలు, కా వి రాయి ఐదు భాగాలు, మండూర ము అనగా భూమిలో పాతి ఏసిన ఇనుమును చూర్నించగ వచ్చేది ,వీటిని మెత్తని పొడిగా దంచాలి. ఉసిరికాయలను నానేసిన నీళ్లలో ఈ పొడిని కలిపి ఒక ఇనుప పాత్రలో ఒక రాత్రంతా ఉంచాలి. దీనిని ఉదయాన్నే తలకు పట్టించాలి .కొంతసేపయిన తర్వాత శుభ్రంగా కడిగి వేయాలి. ప్రతిరోజు నీలి భృంగా ది తైలమును తలకు రాసుకోవాలి. అలాగే ఏలాది తైలం అనే మందు నూనెతో తలకు మర్దన చేయించుకోవాలి.

కామంచి గింజలు నల్ల నువ్వులు సమానంగా తీసుకుని గానుగ లో వేసి తైలాన్ని తీయాల. దీనిని రోజువారిగా తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అంతే కాకుండా అన్ని రకాల తలనొప్పులు తగ్గిపోతాయి. 1,2 గ్రాముల కరక్కాయ చూర్ణం లో తేనెను కలిపి ప్రతిరోజూ తింటుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.

కరక్కాయ, తానికాయ ,ఉసిరికాయలను గింజలు తీసి వేసి ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని, మామిడి జీడి కూడా కలిపి చూర్ణం లాగా దంచాలి. దీనికి పావు కిలో నువ్వుల నూనెను కలిపి ఒక ఇనుప మూకుడు లో ఉంచి మూత పెట్టి వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి. దీనిని వడపోసుకుని తల నూనెగా వాడుకోవాలి. ఇలా చేసినా తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.

ఊడుగ పువ్వు, గుంటగలగరాకు, కలువ దుంపలు సమాన భాగాలుగా తీసుకుని మెత్తగాముద్దగా నూరాలి. ఈ ముద్దకు నాలుగు భాగాలు నువ్వుల నూనెను కలిపి నూనెకు 16 రెట్లు మంచి నీళ్లను చేర్చి, నీరంతా ఇంకిపోయి అంతవరకు చిన్నమంటమీద కాచి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని తలకు మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.