Nizamabad Lok Sabha Race Gurralu : బరిలో సీనియర్లు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరి బలం ఎంత?

ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Nizamabad Lok Sabha Race Gurralu : బరిలో సీనియర్లు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరి బలం ఎంత?

Nizamabad Lok Sabha Race Gurralu

Nizamabad Lok Sabha Race Gurralu : ఉత్తర తెలంగాణలోని కీలక నియోజకవర్గం నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. గత ఎన్నికల్లో తొలిసారిగా కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ ఉద్యమానికి వెనుదన్నుగా నిలిచిన ఇందూరులో గులాబీ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఇందూరు గడ్డపై జెండా ఎగరేసేందుకు మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు…? ఏ పార్టీకి జైకొడతారు? ఇందూరులో ఎవరి బలం ఎంత?

బీజేపీ నేత సంచలన విజయం..
ఉత్తర తెలంగాణలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ది ప్రత్యేక స్థానం. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఉన్నాయి.. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి 1989 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండేది. 1991 ఎన్నికలతోపాటు 1998, 1999ల్లో టీడీపీ గెలవగా, 2004, 2009ల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తొలిసారిగా జెండా ఎగరేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపీగా గెలిచి… హస్తం కోటలో పాగా వేయగలిగారు. ఇక గత ఎన్నికల్లో కవితను ఓడించి బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌ సంచలన విజయం సాధించారు.

ముగ్గూరు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినవారే..
ఇక ఈ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేత బాజిరెడ్డి గోవర్దన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారే కావడం విశేషం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో నిజామాబాద్‌ నుంచి పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టాలని జీవన్‌రెడ్డి, ప్రధాని మోదీ చరిష్మా, జాతీయ కోణంలో ఎంపీ అర్వింద్‌, గులాబీదళం అండదండలతో బాజిరెడ్డి మళ్లీ పోటీకి సై అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటూ ఎవరికివారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయం కోసం తీవ్ర పోటీ..
నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మూడు స్థానాలు దక్కగా, బీజేపీ, కాంగ్రెస్‌ చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌, బీజేపీ మధ్య దాదాపు 50 వేల ఓట్లు తేడా ఉండగా, మూడు సీట్లు గెల్చుకున్న బీఆర్‌ఎస్‌కు రెండుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌కు మధ్య కేవలం ఏడు వేల ఓట్ల తేడాయే కనిపిస్తోంది. దీంతో లోక్‌సభ స్థానంలో విజయం కోసం మూడు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 4 లక్షల 17 వేల 315 ఓట్లు పోలైతే… కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు 4 లక్షల 8 వేల 135 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 3 లక్షల 65 వేల 374 ఓట్లు నమోదయ్యాయి.

ముగ్గురూ సీనియర్లే కావడంతో రసవత్తరంగా పోటీ..
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటున్న మూడు పార్టీలు.. లోక్‌సభపై భారీ వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి మున్నూరు కాపు సామాజికవర్గం నేతలు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ అగ్రవర్ణాలకు చెందిన రెడ్డిలకు అవకాశం ఇచ్చింది. ఈ ముగ్గురు నేతలూ రాజకీయాల్లో సీనియర్లే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఇక బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అర్వింద్‌ గత ఐదేళ్లలో నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. దీంతో ముగ్గురు ప్రచారంలో దూసుకుపోతూ… విజయం కోసం సకల అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.

గెలుపుపై జీవన్ రెడ్డి ధీమా..
కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. పదకొండు సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 6సార్లు గెలిచారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈ సారి లోక్‌సభలో అడుగుపెట్టాలని ఉబలాటపడుతున్నారు. సీనియర్‌నేత కావడం వల్ల నియోజకవర్గంలో క్యాడర్‌తో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు జీవన్‌రెడ్డి. తనను గెలిపిస్తే చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని హమీ ఇస్తున్నారు.

ఆ అంశం తమకు కలిసి వస్తుందంటున్న బీఆర్ఎస్..
ఇక గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్టీసి చైర్మన్‌గా వ్యవహరించారు. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన బాజిరెడ్డికి పార్లమెంట్‌ పరిధిలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా బలమైన సామాజిక నేత నేపథ్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాల్కోండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం… బాజిరెడ్డికి కలిసివస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బాజిరెడ్డి.

ఇచ్చిన మాట నిలుబెట్టుకున్నానంటున్న బీజేపీ అభ్యర్థి..
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌పై ఆశలు పెంచుకుంటుంటే.. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ మాత్రం రెండోసారి తనదే విజయమని ధీమా ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా ఐదేళ్లు పనిచేసిన అనుభవంతోపాటు తండ్రి రాజకీయ వారసత్వం తనకు కలిసి వస్తుందని ఆశ పెట్టుకుంటున్నారు అర్వింద్‌. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చిన అర్వింద్‌… ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతోపాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తానిచ్చిన మాట నిలబెట్టుకున్నానని… మరోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ఎంపీ అర్వింద్‌.

ఇందూరులో త్రిముఖ పోటీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అర్వింద్‌…. బీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిపోయారు. కానీ, ఎంపీగా ఆయనే సరైనోడన్న అంచనాతో టికెట్‌ ఇచ్చింది కమలం పార్టీ… గత ఐదేళ్లు ఎంపీగా దూకుడుగా పనిచేసిన అర్వింద్‌… అదే దూకుడుతో ఈ సారి విజయం సాధిస్తానని ధీమా ప్రదర్శిస్తున్నా… కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు సీనియర్లు పోటీ చేస్తుండటంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. మూడు పార్టీలు తగ్గేదే అన్నట్లు పోటీ పడుతుండటంతో ఇందూరులో త్రిముఖపోటీ కనిపిస్తోంది. ఈ పోరులో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నది చూడాలి.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు