Suresh Gopi : కేరళలో విరిసిన కమలం.. స్టార్ నటుడు ఘన విజయం
తొలిసారి కేరళ లోక్‌సభ నుంచి బీజేపీ గెలుపొందింది.

Suresh Gopi
దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తొలిసారి కేరళ లోక్‌సభ నుంచి బీజేపీ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి, మలయాళ నటుడు సురేశ్ గోపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్ పై దాదాపు 73వేలకు పైగా ఓట్ల మెజార్టీగాతో గెలుపొందారు.
అధిక శాతం విద్యావంతులు ఉన్న కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. అయితే.. తొలి సారి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
శతాబ్దాల హిందువుల కల అయోధ్య రామమందిరం.. కల నెరవేరినా బీజేపీకి మాత్రం..
నటుడైన సురేశ్ గోపి రాజకీయ ప్రయాణం 2016లో మొదలైంది. ప్రముఖ పౌరుల కేటగిరీలో భారత రాష్ట్రపతి ఆయన్ను రాజసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో బీజేపీలో ఆయన చేరారు. పార్లమెంటు ఎగువ సభలో గోపి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, పౌర విమానయాన సంప్రదింపుల కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆపై 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. అంతకు ముందు కేరళ లోక్‌సభ ఎన్నికల్లో 2,93,822 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.