Kotha Malupu Review : ‘కొత్త మలుపు’ రివ్యూ.. సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..
సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా సర్కారు నౌకరి ఫలితం ఎలా ఉన్నా ఓ కొత్త కథతో మంచి ప్రయత్నం చేసాడని అభినందనలు వచ్చాయి.(Kotha Malupu Review)
Kotha Malupu Review
Kotha Malupu Review : సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా, అస్సాం భామ భైరవి ఆర్థ్యా హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘కొత్త మలుపు’. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్ పై తాటి బాలకృష్ణ నిర్మాణంలో శివ వరప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొత్త మలుపు సినిమా నేడు జూన్ 12న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
కమల్(ఆకాష్) హైదరాబాద్ లో తన ఫ్రెండ్(మహేందర్)తో కలిసి ఉంటాడు. పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. తన మేనమామ కొడుకు పెళ్లికని గోదావరి జిల్లాల్లోని ఓ ఊరికి వెళ్తాడు కమల్. అక్కడ కమల్ తాగి చేసిన హడావిడితో తెలియని అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ఎవరో కనుక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఓ బాబా దగ్గరికి కూడా వెళ్తాడు. తను వెతికేది, తను ప్రేమించేది తన మరదలు వరలక్ష్మి(భైరవి ఆర్థ్యా) అని తెలిసి సంతోషపడతాడు.
కానీ వరలక్ష్మి ఆల్రెడీ ప్రేమలో ఉందని, ఆమె ఎవరితోనో రోజూ మాట్లాడుతుందని బాబా చెపుతాడు. వరలక్ష్మి బావపై ప్రేమని చూపించినా ఆమెని సందేహిస్తాడు. వరలక్ష్మి గురించి నెగిటివ్ గా వింటాడు. మరి కమల్ – వరలక్ష్మి ప్రేమ ఫలిస్తుందా? వరలక్ష్మి వేరేవాళ్లను లవ్ చేస్తుందా? వరలక్ష్మి గురించి కమల్ కి అన్ని నెగిటివ్ గా ఎందుకు తెలుస్తాయి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Governor Review: ‘గవర్నర్’ మూవీ రివ్యూ.. 1991లో RBI గవర్నర్ ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది?
సినిమా విశ్లేషణ..
సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా సర్కారు నౌకరి ఫలితం ఎలా ఉన్నా ఓ కొత్త కథతో మంచి ప్రయత్నం చేసాడని అభినందనలు వచ్చాయి. దాంతో సెకండ్ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే టీజర్, ట్రైలర్స్,సాంగ్స్, టైటిల్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా పోయి ఇదేదో రెగ్యులర్ సినిమానే అనిపించేలా చేసింది.
ఫస్ట్ హాఫ్ అంతా కమల్, అతని ఫ్రెండ్ కామెడీ, కమల్ ఊరికి వచ్చి అక్కడ పెళ్లి హడావిడి, తెలియని అమ్మాయి గురించి వెతకడంతోనే సాగుతుంది. ఇంటర్వెల్ కి కమల్ వెతికేది తన మరదలునే అని సింపుల్ గా చెప్పేసి ఆమెకు లవర్ ఉన్నాడు అనే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో మరదలిని అనుమానించడం, దానికి తగట్టు సంఘటనలు, మధ్యమధ్యలో హీరో ఫ్రెండ్ కామెడీ సీన్స్ తో సాగదీశారు. క్లైమాక్స్ లో.. ఏం లేకపోయినా అమ్మాయిలను తప్పుగా అర్ధం చేసుకుంటారు అనే ఓ మెసేజ్ తో ఎమోషన్ ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు.
సినిమాలో చాలా చోట్ల ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. రొటీన్ కథ, రొటీన్ కథనం, రొటీన్ కామెడీ సీన్స్. అక్కడక్కడా సెకండాఫ్ లో మాత్రం నవ్వుకోవచ్చు. తెలియని అమ్మాయి కోసం హీరో వెతికే ప్రయత్నాలు బాగా సాగదీశారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. ఒక ట్విస్ట్ ఊహించేయొచ్చు. ఇక గోదావరి ఊరు అవ్వడంతో చూపించిన లొకేషన్స్ నే అక్కర్లేకపోయినా రిపీట్ మోడ్ లో చూపించారు. ఓపెనింగ్ టైటిల్ సాంగ్, హీరోయిన్ ఎంట్రీ సాంగ్ అవసరం లేకపోయినా పెట్టారు. టైటిల్ కొత్తమలుపు అని ఎందుకు పెట్టారో, ఈ సినిమాలో ఏం మలుపు ఉందో దర్శకుడికే తెలియాలి. టైటిల్ కోసం ఇంటర్వెల్ లో మలుపు రాబోతుంది అని వేయడం గమనార్హం. ఫస్ట్ హాఫ్ లో ఈ కథ లైన్ చూస్తే పరుగు సినిమా గుర్తొస్తుంది. క్లైమాక్స్ లో యువ హీరో రామ్ నితిన్ గెస్ట్ అప్పీరెన్స్ ఎందుకో దర్శకుడికే తెలియాలి. సింగర్ సునీత ఉండి కూడా కొడుకుతో ఇలాంటి రొటీన్ కథ సినిమాని ఎలా చేయించిందో అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ఫస్ట్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో పర్వాలేదనిపించిన ఆకాష్ ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ కి చాలా కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ అస్సాం భామ కావడంతో చాలా కష్టపడి యాక్టింగ్ చేయించినట్టు ఉంది. కొన్ని డైలాగ్స్ కి ఆమె చేతి కదలికలకు సంబంధం ఉండదు. మేకప్ అయితే కొన్ని సీన్స్ లో అక్కర్లేకపోయినా ఎక్కువగా వేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. సినిమాలో ప్లస్ ఉంది అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మహేందర్. మహేందర్ పలుమార్లు నవ్వించాడు. రఘు బాబు, పృథ్వి కూడా అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. కిట్టయ్య, ప్రభావతి.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. కథకు అక్కర్లేకపోయినా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన రామ్ నితిన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ సాధారణంగానే ఉన్నాయి. గోదావరి పచ్చని పల్లెటూరు అంటే ఫ్రేమ్స్ చాలా అందంగా చూపించొచ్చు కానీ మామూలుగానే ఉంటాయి. సాంగ్స్ యావరేజ్. ఒకసారి విని వదిలేయడమే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. హీరోయిన్ డబ్బింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. రొటీన్ కథ, కథనంతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు. కాకపోతే అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ పరంగా తక్కువ ఖర్చుతోనే ఒక ఊరిలో, ఇంకో రెండు మూడు లొకేషన్స్ లోనే ఈ సినిమాని పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘కొత్త మలుపు’ సినిమా ఓ రొటీన్ రెగ్యులర్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
