FIR : షూటింగ్ లో గుర్రం మృతి.. మణిరత్నంపై కేసు నమోదు
దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. చిత్ర షూటింగ్ సమయంలో ఓ గుర్రం మృతికి కారణమైనట్లు అతడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Fir
FIR : సినిమాల్లో జంతువులను విరివిగా వాడుతుంటారు. అయితే షూటింగ్ సమయంలో కానీ, మూవీలో కానీ వీటిని హింసించడం నేరం. అందుకే సినిమా ముందు ఈ చిత్రంలో జంతువులను హింసించలేదనే డిస్క్లైమర్ యాడ్ చేస్తుంటారు. ఇక షూటింగ్ లో జంతువులను వాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి గాయాలు కాకుండా చిత్రీకరించాలి, కష్టపెట్టకూడదు. ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా వరకు జంతువుల సన్నివేశాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో ఓ గుర్రం మరణించింది. దీంతో పెటా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో మణిరత్నంపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే దర్శకుడు మణిరత్నం.. పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అనాజ్ పూర్ లో ఓ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతుంది. భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నగరంలోని 50 గుర్రాలను సెట్ కు తీసుకెళ్లారు. అక్కడ షూటింగ్ జరుగుతున్నసమయంలో డీహైడ్రేషన్ గురై గుర్రం ఆగస్టు 11న మృతి చెందింది.
ఇది బయటకు పొక్కకుండా అక్కడే గొయ్యి తీయించి దానిని పూడ్చిపెట్టారు. ఈ విషయం షూటింగ్ సమయంలో అక్కడ వారిలో కొందరు “పెటా” ప్రతినిధులకు తెలిపారు. దీంతో వారు గత 18న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వకరించిన పోలీసులు, గుర్రాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లి దాని మృతదేహం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ హౌజ్ మేనేజ్‌మెంట్, గుర్రం యజమానిపై సెక్షన్ 429, సెక్షన్ 11 పీసీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా గుర్రం పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.