Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ రియాక్షన్.. నారా లోకేశ్‌తో భేటీ..

మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఏ పార్టీలోకి?

Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీపై మంచు మనోజ్ రియాక్షన్.. నారా లోకేశ్‌తో భేటీ..

Updated On : February 17, 2025 / 7:25 PM IST

సినీ హీరో మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్న చాలా కాలంగా ఉంది. ఆయన టీడీపీలో చేరతారని, జనసేన తీర్థం పుచ్చుకుంటారని చాలా కాలంగా ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌తోనూ భేటీ కావడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో మంచు మనోజ్‌ ఎక్కడికి వెళ్లినా రాజకీయాలపై ఎంట్రీపైనే ఆయనను మీడియా ప్రశ్నిస్తోంది.

తాజాగా, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో పశువుల పండుగకు హాజరైన మంచు మనోజ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం చెబుతూ.. “రాజకీయాలే కాదు ఏమీ మన చేతుల్లో లేదు.. అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది” అని అన్నారు. ఆయన రాజకీయాల్లో వస్తున్నానన్న ప్రచారాన్ని కొట్టేయకుండా, కన్ఫామ్‌ చేయకుండా మాట్లాడడం గమనార్హం.

Also Read: మీ కోసం ట్రాయ్ గేమ్ ఛేంజర్ నిర్ణయం.. ఇక స్పామ్ కాల్స్ బాధ వదిలిపోతుంది పో..

ఈ సందర్భంగా మంచు మనోజ్‌ చంద్రబాబు నాయుడి పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రగిరి చుట్టుపక్కల ఎన్నో సౌకర్యాలు కల్పించారన్నారు. “చంద్రగిరి నుంచి బయటకు వెళ్లి పనిచేసేవారూ ఉన్నారు.. తన ప్రాంతాన్ని వదలకుండా ఇక్కడే ఉండి పనిచేసుకుంటున్న వారూ ఉన్నారు. వారికి మరిన్ని మంచి సౌకర్యాలు త్వరలోనే వస్తున్నాయి. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది” అని చెప్పారు.

కాగా, మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెడతారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆళ్లగడ్డలో భూమా శోభానాగిరెడ్డి జయంతి వేళ మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, దీనిపై ఆయన ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.

నారా లోకేష్ ఇవాళ కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. లోకేశ్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకి చేరుకున్న విషయం తెలిసి, మంచు మనోజ్ అక్కడకు వెళ్లారు. లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.