నటి హేమ ఇందుకే నాకు నోటీసులు పంపింది.. నేను ఇక ఎక్కడా తగ్గేదే లేదు: కరాటే కల్యాణి
"మీడియాలో ఆమెపై (హేమ) అటెన్షన్ తగ్గిందని అనుకుందేమో.. తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నా పేరును ఎంచుకుని నోటీసులు పంపినట్లుంది" అని కరాటే కల్యాణి అన్నారు.

సినీ నటి హేమ పలు యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులు, కరాటే కల్యాణికి తాజాగా నోటీసులు పంపారు. తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. దీనిపై కరాటే కల్యాణి స్పందిస్తూ ఓ వీడియో రూపంలో మాట్లాడారు.
“ఇవాళ ఉదయం నుంచి నాకు మీడియా వాళ్లు కాల్స్ చేస్తున్నారు. హేమా మీకు నోటీసులు పంపించిందంట కదా అని అడుగుతున్నారు. అవును.. నాకు నోటీసులు అందాయి. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఎక్కడ ఉన్నాను? ఏమిటి అన్న విషయాలపై అన్నీ నిజాలే చెబుతాను.
నేను మా ఊరిలో ఉన్నాను ఇప్పుడు. విజయనగరంలో ఉండడం వల్ల నేను మీ అందరి ఫోన్ కాల్స్‌కి స్పందించలేకపోతున్నాను. నోటీసులు తీసుకుని నా పని మీద నేను వచ్చేశాను. నేను కూడా లీగల్ ఫైట్‌కి సిద్ధంగా ఉన్నాను. ఆవిడకు నేను రిప్లై ఇస్తాను.
ఆవిడకు కూడా నా నుంచి నోటీసులు అందుతాయి. నేను మీడియాలో ప్రచారమైన వాటిపైనే నేను మాట్లాడాను. ఆమెపై వ్యక్తిగతంగా కక్ష ఏమీ లేదు. ఒకవేళ పర్సనల్‌గా నాకు ఆమెపై కోపం ఉంటే మా అసోసియేషన్‌పై ఆమెపై వేసిన సస్పెన్షన్‌ను తీసేయాలని ఓటు వేయను కదా?
సస్పెన్షన్‌ను ఎత్తేయాలని నేను కూడా ఓటు వేశాను. మీడియాలో ఆమె (హేమ) అటెన్షన్ తగ్గిందని అనుకుందేమో.. తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నా పేరును ఎంచుకుని నోటీసులు పంపినట్లుంది. నా మీద రూ.5 కోట్లకు దావా వేస్తున్నట్లుగా ఏదో పంపించారు.
నేను లీగల్ ఫైట్‌కి వెళ్తాను. ఎక్కడా తగ్గేదే లేదు. మీడియా అందరి మీద వేసిన తర్వాత నాపై కేసు వేయాలి. ఆమె భయపడిందేమో. కచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తా. నేను భయపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు.
కాగా, గతంలో హేమ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఒక రేవ్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. దీని గురించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ అంటున్నారు.