Kesari Chapter 2 : ‘కేసరి – చాప్టర్ 2’ మూవీ రివ్యూ.. జలియన్ వాలాబాగ్ కేసు.. ఇండియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా..

జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత దానికి సంబంధించిన కేసు, ఆ కేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.

Kesari Chapter 2 : ‘కేసరి – చాప్టర్ 2’ మూవీ రివ్యూ.. జలియన్ వాలాబాగ్ కేసు.. ఇండియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా..

Akshay Kumar Madhavan Ananya Panday Kesari Chapter 2 Movie Review

Updated On : May 22, 2025 / 5:31 PM IST

Kesari Chapter 2 Movie Review : అక్షయ్ కుమార్, అనన్య పాండే, మాధవన్, రెజీనా, సైమన్ పైస్లీ, అమిత్ సియల్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా ‘కేసరి – చాప్టర్ 2’. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, లియో మీడియా కలెక్టివ్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా.. పలువురి నిర్మాణంలో కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో ఏప్రిల్‌ 18న రిలీజయి భారీ విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమా మే 23న రిలీజ్ కానుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత దానికి సంబంధించిన కేసు, ఆ కేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.

కథ విషయానికొస్తే.. అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో 13 ఏప్రిల్ 1919 న సాయంత్రం రౌలత్ యాక్ట్ కి వ్యతిరేకంగా వేలమంది ఇండియన్స్ అక్కడ శాంతియుత నిరసనలు చేస్తుండగా బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ డయ్యర్(సైమన్ పైస్లీ) వారందరి మీద విచక్షణంగా కాల్పులు జరపడంతో అక్కడున్న వాళ్లంతా చనిపోతారు. అప్పుడు ఉన్నది బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి ఈ వార్త బయటకి రాకుండా, అక్కడ టెర్రరిస్ట్ లు ఉన్నారని, వాళ్ళు దాడులు చేయబోతే కాల్చి చంపారని ప్రచారం చేసారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పంజాబ్ గవర్నమెంట్ ఓ కమిషన్ వేయగా అందులో అందరు బ్రిటిష్ వాళ్ళు, ఒక్క ఇండియన్ శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) అనే లాయర్ ఉంటారు.

అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళ కోసం కేసులు వాదించిన శంకరన్ నాయర్ జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని తెలుసుకొని చలించిపోతాడు. ఈ వార్తని అందరికి చెప్పాలని, న్యాయం చేయాలని ఆ ఉదంతంలో బతికిన ఓ యువకుడు మౌన పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు. దాంతో ఇది తప్పే అని శంకర్ నాయర్ చెప్పినా బ్రిటిష్ గవర్నమెంట్ పట్టించుకోదు. ఏమి చేయలేని పరిస్థితుల్లో వెళ్లిపోతుంటే దిల్రీత్ గిల్(అనన్య పాండే) లాయర్ వచ్చి మీరే వీళ్ళకు న్యాయం చేయాలి, డయ్యర్ కి శిక్ష పడాలి అని మోటివేట్ చేయడంతో కోర్టులో కేసు వేస్తారు.

కోర్టులో శంకరన్ నాయర్ డయ్యర్ కి వ్యతిరేకంగా వాదనలు చేస్తుండటంతో డయ్యర్, మరికొంతమంది కేసు గెలవడానికి అనేక కుట్రలు పన్నుతారు. ఈ క్రమంలో శంకరన్ నాయర్ కి ధీటుగా బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ గా వాదించే లాయర్, శంకరన్ నాయర్ ఫ్రెండ్ నివ్లే మెకిన్లీ(మాధవన్) ని తీసుకొస్తారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రలకు, మెకిన్లీ వాదనలకు డయ్యర్ ఎలాంటి తప్పు చేయలేదని, జలియన్ వాలా బాగ్ ఉదంతం తప్పు కాదని తీర్పు ఇస్తారు. మరి శంకరన్ నాయర్ ఆ తీర్పుని సవాలు చేసి ఏం చేసాడు? ఎలాంటి ఆధారాలు తీసుకొచ్చాడు? తీర్పు చెప్పేసాక కూడా బ్రిటిష్ వాళ్లకు ఎలా కౌంటర్ ఇచ్చాడు? ఆ కేసు ఎలా గెలిచారు? డయ్యర్ కి ఏం పనిషమెంట్ ఇచ్చారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Deepika Padukone : ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకోన్ ని తప్పించిన సందీప్ వంగ..? కారణాలు ఇవేనా?

సినిమా విశ్లేషణ.. జలియన్ వాలా బాగ్ ఉదంతం అందరికి తెలిసిందే. చిన్నపుడు మన పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. ఓ కరుడుగట్టిన బ్రిటిష్ ఆఫీసర్ ఎంతోమంది ఇండియన్స్ ని అన్యాయంగా ఎలా చంపారు అని చదువుకున్నాం. అయితే అది జరిగిన తర్వాత ఏం జరగనట్టు బ్రిటిష్ వాళ్ళు ఉండటం, పేపర్స్ లో కూడా ఆ వార్త రాకుండా చేయడంతో ఓ లాయర్ కేసు వేసి ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేసాడు? కేసు ఎలా గెలిచాడు అనే కథాంశంతో కోర్టు రూమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.

జలియన్ వాలాబాగ్ ఉదంతంతో సినిమా మొదలయి శంకర్ నాయర్ పాత్రతో సినిమా నడుస్తుంది. శంకర్ నాయర్ ఆ కేసు తీసుకునేవరకు సినిమా కాస్త నిదానంగా సాగుతుంది. శంకర్ నాయర్ జలియన్ వాలాబాగ్ కేసు తీసుకోవడంతో కథలో వేగం పెరిగి ఆసక్తి నెలకొంటుంది. అప్పుడు జరిగిన ఉదంతం, కేసు విచారణ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పటి పాత్రలు, వారి స్వభావాలు, స్వాతంత్ర పోరాటం అన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. ఈ సినిమా లాయర్ శంకరన్ నాయర్ బయోపిక్ గా కూడా అనుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేసే లాయర్ శంకరన్ నాయర్ ఇండియన్స్ కోసం పోరాడే ముందు ఎలా మారాడు అని వచ్చే ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. జలియన్ వాలాబాగ్ ఉదంతం కన్నీళ్లు పెట్టిస్తుంది.

కోర్ట్ రూమ్ డ్రామాని ఎక్కడా లాజిక్స్ మిస్ అవ్వకుండా వాదనలు – ప్రతివాదనలు చాలా బాగా రాసుకున్నారు. దేశభక్తి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. ఇలాంటి కథలు, అప్పట్లో ఇండియన్స్ కోసం పోరాడిన శంకరన్ నాయర్ లాంటి వారి గురించి, అప్పటి చరిత్రలను, పోరాటాలను ఈ జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఈ సినిమా కచ్చితంగా ప్రతి ఇండియన్ చూడాలి. కేసరి అనే టైటిల్ తో భారతీయ సిక్కుల కథలను చెప్తున్నారు. కేసరి సినిమాలో కొంతమంది సిక్కు వీరుల గురించి చెప్పారు. కేసరి చాప్టర్ 2 లో సిక్కులపై జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి చూపించారు. కేసరి చాప్టర్ 3 కూడా ప్రకటించారు. మరి అందులో ఎవరి కథ చెప్తారో చూడాలి.

Kesari 2

నటీనటుల పర్ఫార్మెన్స్.. లాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ వాదనలతో అదరగొడుతూనే ఎమోషన్ తో మెప్పించారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మొదటిసారి ఓ మంచి పాత్రలో లాయర్ గా తన నటనతో మెప్పించింది. శంకరన్ నాయర్ భార్య పాత్రలో రెజీనా కాసేపే కనిపించి పర్వాలేదనిపిస్తుంది. అక్షయ్ కుమార్ కి వ్యతిరేకంగా లాయర్ పాత్రలో మాధవన్ కూడా అదరగొట్టారు. బ్రిటిష్ పాత్రలు వేసిన సైమన్ పైస్లీ, స్టీవెన్ హార్ట్లీ, అలెక్స్ ఓ నెల్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా అప్పటి పాత్రలకు తగ్గట్టు మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. హిస్టారికల్‌ కథకు తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ని మెచ్చుకోవలసిందే. 1919 కాలానికి తగ్గట్టు వస్తువులు, భవనాలు, కార్లు, దుస్తులు.. అన్ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసారు. తెలుగు డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. డైలాగ్స్ కూడా ఎమోషనల్ గా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ అయినా పాటలు మాత్రం హిందీలోనే ఉంచేశారు. అయినా ఆ పాటలు దేశభక్తిని రగిలించేలా మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు. నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.

Also Read : Ram Charan : ‘పెద్ది’ షూటింగ్ నుంచి ఫొటో షేర్ చేసిన చరణ్.. మీర్జాపూర్ మున్నా భాయ్ తో.. మాస్ లుక్ లో చరణ్ ఏమున్నాడ్రా బాబు..

మొత్తంగా ‘కేసరి – చాప్టర్ 2’ సినిమాని జలియన్ వాలాబాగ్ ఉదంతం, బ్రిటిష్ ఆఫీసర్స్ చేసింది తప్పు అని ఒక ఇండియన్ లాయర్ కేసు వేసి ఎలా వాదించి గెలిచాడు అనే రియల్ కథతో దేశభక్తి స్పూర్తితో తెరకెక్కించారు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.