‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ.. ఈ సారి ఏకంగా అయిదు దయ్యాలతో..
'గీతాంజలి' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' పర్ఫెక్ట్ హారర్ కామెడీగా ప్రేక్షకులని కచ్చితంగా మెప్పిస్తుంది.

Anjali 50th movie Geethanjali Malli Vachindhi Review and Rating
Geethanjali Malli Vachindhi Movie Review : పదేళ్ల క్రితం అంజలి(Anjali) డ్యూయల్ రోల్ లో వచ్చిన హారర్ కామెడీ ‘గీతాంజలి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే సినిమాతో వచ్చారు. నేడు ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది. పార్ట్ 1లో నటించిన శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్.. మిగిలిన కొన్ని పాత్రలు ఈ సీక్వెల్ లో కూడా కంటిన్యూ అయ్యాయి. వీళ్ళతో పాటు అలీ, సత్య, రాహుల్ మహాదేవ్, సునీల్, రవిశంకర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం.
కథ విషయానికొస్తే..
పార్ట్ 1 చివర్లో గీతాంజలి(అంజలి) దయ్యంగా వచ్చి తనని చంపిన రమేష్(రమేష్ రావు) ని చంపేస్తుంది. ఈ సీక్వెల్ లో గీతాంజలి దయ్యం నుంచే కథని మొదలుపెట్టారు. ఓ ఆఫీస్ లో అమ్మాయితో మిస్ బిహేవ్ చేసిన ఓ వ్యక్తిని గీతాంజలి చంపేస్తుంది. దీంతో కొంతమంది అఘోరాలని పిలిపించి ఆ గీతాంజలి ఆత్మని ఓ బొమ్మలో బంధించి ఊరి చివర పాతిపెడతారు. కొన్నాళ్ళకు అక్కడ ప్లాట్స్ వెల్వడంతో రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే అమ్మాయికి ఆ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మని వెంకట్రావు(అలీ) కొనుక్కొని ఊటీ వెళ్తాడు.
ఇక పార్ట్ 1లో సినిమా తీసి హిట్ కొట్టిన శ్రీను(శ్రీనివాస్ రెడ్డి) మూడు ఫ్లాప్స్ తీయడంతో మళ్ళీ సినిమా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. వైజాగ్ లో ఉన్న తన ఫ్రెండ్ అయాన్(సత్య)ని మోసం చేసి హీరో చేస్తానంటూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయాన్ హైదరాబాద్ కి రావడంతో ఈ మోసం తెలుస్తుంది. అదే సమయంలో శ్రీనుకి ఊటీలో ఓ డబ్బున్న వ్యక్తి విష్ణు(రాహుల్ మాధవ్) మేనేజర్ నుంచి సినిమా తీద్దామని, ఊటీకి రమ్మని ఫోన్ రావడంతో అందరూ ఊటీకి వెళ్తారు. పార్ట్ 1లో గీతాంజలి చెల్లి అంజలి(అంజలి డ్యూయల్ రోల్) ఇక్కడే ఊటీలో కాఫీ షాప్ నడిపిస్తుంది. విష్ణు వీరికి సినిమా ఛాన్స్ ఇచ్చి, అక్కడ ఉన్న భూత్ బంగ్లా సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా పెట్టాలని కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో మూడు దయ్యాలు ఉంటాయి. శాస్త్రి(రవిశంకర్), ఆయన భార్య(ప్రియా), ఆయన కూతురు ఉంటారు. రిసార్ట్ గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమ జంటలని ఈ దయ్యాలు చంపేస్తుండటంతో అది బూత్ బంగ్లాగా మారుతుంది.
అసలు సంగీత్ మహల్ కథేంటి? ఆ ముగ్గురు దయ్యాలుగా ఎందుకు మారారు? ప్రేమించుకునే వాళ్ళని ఎందుకు ఆ దయ్యాలు చంపుతున్నాయి? విష్ణు ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనుకి ఎందుకు సినిమా ఛాన్స్ ఇచ్చాడు? అంజలినే హీరోయిన్ గా పెట్టాలని, బూత్ బంగ్లాలోనే షూట్ చేయాలని ఎందుకు కండిషన్ పెట్టాడు? ఆ దయ్యాల మధ్యలో వీళ్ళు సినిమా తీసారా? బొమ్మతో వెంకట్రావు పడిన పాట్లు ఏంటి? బొమ్మలో ఉన్న గీతాంజలి ఆత్మ బయటకి వచ్చిందా? పార్ట్ 1లో చనిపోయిన రమేష్ కి విష్ణుకి సంబంధం ఏంటి? రమేష్ ఎందుకు ఆత్మగా తిరిగి వస్తాడు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : ‘లవ్ గురు’ మూవీ రివ్యూ.. పెళ్లి ఇష్టం లేని భార్యతో ప్రేమగా ఎలా దగ్గరవ్వాలి..
సినిమా విశ్లేషణ..
హారర్ కామెడీ అన్నప్పుడు హారర్, కామెడీ ఈ రెండు అంశాలని పర్ఫెక్ట్ గా సెట్ చేయాలి. పార్ట్ 1లో అది కరెక్ట్ గా ఉండటంతో సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా రెండు అంశాలని చక్కగా బ్యాలెన్స్ చేయాలనుకున్నా కామెడీ ఎక్కువై హారర్ తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా శ్రీను అండ్ వాళ్ళ బ్యాచ్ సినిమా కష్టాలు, సినిమా ఛాన్స్ రావడం, అక్కడ దయ్యాలు ఉన్నాయని తెలియడం, ఆ దయ్యాల కథ చూపించి ఇంటర్వెల్ కి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఆ బూత్ బంగ్లాలో దయ్యాలతో సినిమా షూటింగ్ అంటూ హిలేరియస్ గా నవ్వించారు. క్లైమాక్స్ కూడా కొంచెం ఆసక్తికరంగా నడిపించినా క్లైమాక్స్ లో లో కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కూడా కొంచెం తేలిపోతాయి. మొదటి పార్ట్ కి, ఈ సినిమాకి మాత్రం మంచి కనెక్షన్ ఇచ్చారు. పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. గీతాంజలి పార్ట్ 3 అనౌన్స్ చేయకపోయినా క్లైమాక్స్ వల్ల పార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని అర్ధమవుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
తెలుగమ్మాయి అంజలి ఇప్పటికే 49 సినిమాలతో మెప్పించి ఇప్పుడు 50వ సినిమాగా గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో అదరగొట్టింది. అంజలిగా, గీతాంజలి ఆత్మగా రెండు పాత్రల్లోనూ మరోసారి మెప్పించింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అవినాష్, పవిత్ర.. వీళ్లంతా తమ కామెడీతో ఫుల్ గా నవ్విస్తారు. రవిశంకర్, ప్రియా దయ్యాల పాత్రల్లో ఒదిగిపోయారు. విలన్ గా రాహుల్ మాధవ్ ఓకే అనిపించాడు. ఇక పార్ట్ 1లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన దిల్ రాజు ఈ సినిమాలో కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దిల్ రాజుతో పాటు BVS రవి, సురేష్ కొండేటి కూడా ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇచ్చారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. సినిమా చాలా వరకు ఊటీలోనే జరుగుతుంది. అక్కడి ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. డైలాగ్స్ ఫుల్ గా నవ్విస్తాయి. కథ కథనం కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ కాకుండా ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే మెప్పించాడు. గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ పర్ఫెక్ట్ హారర్ కామెడీగా ప్రేక్షకులని కచ్చితంగా మెప్పిస్తుంది. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.