నిర్మాతగా మారిన రెహమాన్.. ఇప్పుడు ప్రపంచానికి చెప్పాల్సిన కథ

ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ నో ల్యాండ్స్ మ్యాన్ సినిమా కోసం సహ నిర్మాతగానూ, స్వరకర్తగా కూడా మారారు. బంగ్లాదేశ్ చిత్రనిర్మాత మోస్టోఫా సర్వార్ ఫారూకీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆస్ట్రేలియా థియేటర్ ఆర్టిస్ట్ మేగాన్ మిచెల్ మరియు బంగ్లాదేశ్ సంగీతకారుడు-నటుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్ నటించారు.
ఇది అమెరికా-ఇండియా-బంగ్లాదేశ్ సినిమా. జాతిపరంగా విభజించబడిన ఈ ప్రపంచంలోని హానికర వ్యక్తులపై ఫోకస్ చేస్తూ సాగే సినిమా ఇది. ఈ సినిమా నిర్మించాలనుకోవడానికి గల ముఖ్య కారణం గురించి రెహమాన్ చెబుతూ.. ‘‘కొత్త ప్రపంచంలో ఎప్పుడూ కొత్త సవాళ్లు ఉంటాయి. అందుకని కొత్త కథలు చెప్పడానికి కుదురుతుంది. ఈ చిత్రకథ అలాంటిదే. ఇప్పటి ప్రపంచానికి చెప్పాల్సిన కథ, ఇప్పటి సమయానికి తగ్గ కథ’’ అని అన్నారు.
నవాజుద్దిన్ సిద్ధిఖీ మాట్లాడుతూ – ‘‘“ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ అనుభవం సవాలుగా మారింది. కానీ అది మేం పూర్తి చేశాం.. నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. ఏఆర్ రెహమాన్ ప్రతిభ ‘నో ల్యాండ్స్ మ్యాన్’ని గొప్ప సినిమాగా నిలబెడుతుంది’’ అన్నారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే… అమెరికాలో ఒక ఆస్ట్రేలియన్ మహిళను కలిసిన తరువాత దక్షిణాసియాకు చెందిన వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది అనేదే చిత్ర కథ. ఆసిఫ్ మాండ్వి రాసిన ‘నో ల్యాండ్స్ మ్యాన్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ఉంటుంది.