Bharadwaja Thammareddy: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ నిజమేనా? తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..
వారికి మార్కెట్ ఉన్నంత కాలం వాళ్లే రాజులు. మార్కెట్ పోయిందంటే ఏం చేసినా వాళ్లని పైకి తీసుకురాలేం. మార్కెట్ ఉన్న వాళ్లు ఎటువంటి వాళ్లు అయినా వాళ్లని ఆపలేము.
Bharadwaja Thammareddy
- కాస్టింగ్ కౌచ్ అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉంది
- అవకాశాల కోసం రెడీ ఫర్ కమిట్మెంట్ అంటున్నారు
- సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ తొక్కేయలేరు
Bharadwaja Thammareddy: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అవకాశం కావాలంటే కమిట్ మెంట్ అడుగుతారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువగా ఉందని, కమిట్ మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి అవకాశాలు రావనే వాదనలూ ఉన్నాయి. టాలెంట్ ఉన్నా కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమని, అది లేకుండా అవకాశాలు రావడం దాదాపు అసాధ్యమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఏమీ లేదనే వారూ లేకపోలేదు. సినీ పరిశ్రమలో అలాంటిదేమీ లేదని, కొత్త టాలెంట్ కు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందనే వాదిస్తున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతే లేదని, నటీనటులు క్రమశిక్షణతో ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరని కచ్చితంగా చెబుతున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై 10టీవీ పాడ్ కాస్ట్ లో ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్.. అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ లేదు అని కచ్చితంగా చెప్పలేము అని వ్యాఖ్యానించారు. అవకాశాల కోసం వారంతట వారే కమిట్ మెంట్ ఇచ్చే వారు కూడా ఉన్నారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
క్యాస్టింగ్ కౌచ్.. దేనికీ సాక్ష్యాలు లేవు..
‘క్యాస్టింగ్ కౌచ్ లో అన్ని రకాలు ఉంటాయి. మేము అన్నింటికి సిద్ధం మీరు మాకు వేషం ఇవ్వండి అనే వాళ్లు ఉన్నారు. ఓపెన్ ఆఫర్ ఇచ్చే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇంగ్లీష్ లో చెప్పి వాళ్లే వచ్చేస్తున్నారు. రెడీ ఫర్ కమిట్ మెంట్ అనే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇది ఒకరినే అనడం కాదు. కమిట్ మెంట్ తీసుకునే వాడే దరిద్రుడు అంటే.. ఇష్టానికి తయారైన వాళ్లను ఏమనాలి? అయితే, దేనికీ సాక్ష్యాలు లేవు.
వాళ్లు చెప్పింది నిజం అనలేము, వీళ్లు చెప్పింది నిజం అనలేము. తెలిసినా తెలియనట్లు ఉండాలి. ఏదీ మనం చూడలేదు కాబట్టి. ఒక్కోసారి ఆరోపణ కూడా అవ్వొచ్చు. దాని మీద ఏం మాట్లాడతాం. వాళ్లకున్న స్టేటస్ కి వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకుంటారు. ఒక స్టేటస్ లో ఉన్న వాళ్లను మనం ఏమీ చేసే పరిస్థితి ఉండదు. సినిమా ఇండస్ట్రీలో వాడిని తొక్కేశారు, వీడిని తొక్కేశారు అంటారు.. కానీ ఎవరు ఎవరినీ తొక్కేయలేరు.
వారికి మార్కెట్ ఉన్నంత కాలం వాళ్లే రాజులు. మార్కెట్ పోయిందంటే ఏం చేసినా వాళ్లని పైకి తీసుకురాలేం. మార్కెట్ ఉన్న వాళ్లు ఎటువంటి వాళ్లు అయినా వాళ్లని ఆపలేము. కాస్టింగ్ ఇప్పుడూ ఉంది. అప్పుడూ ఉంది. ఇప్పుడు లేదు అని నేను అనటం లేదు. 100శాతం ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడు తగ్గింది. ఆ రోజుల్లో శీలం అనేది చాలా ముఖ్యం. ఇవాళ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. రేపు పొద్దున బ్రేకౌట్ అవుతున్నారు. మళ్లీ ఇంకో రిలేషన్ షిప్ లోకి వస్తున్నారు. ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. ఆల్రెడీ మనం ముగ్గురిని నలుగురినో మార్చేసి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఏంటి అనుకుని ఇచ్చే వాళ్లూ ఉన్నారు” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
Also Read: అది 100% తప్పే..! ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యల వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ హాట్ కామెంట్స్
