భీష్మ – రివ్యూ
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ రివ్యూ..

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ రివ్యూ..
‘జయం’ లాంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్.. ఆ తరువాత రెండు మూడు హిట్ సినిమాలు చేసినా.. ఆ తరువాత కథల ఎంపికలో లోపాల వల్ల దాదాపు పది సంవత్సరాలు హిట్‌కు దూరంగానే ఉన్నాడు. ఆ తరువాత తన సొంత బ్యానర్‌లో ‘ఇష్క్’ సినిమాతో సక్సెస్ సాధించి.. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలతో హిట్స్ అందుకుని ‘అఆ’ తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ‘లై’, ‘ఛల్ మోహనరంగా’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాల ఫ్లాప్‌లతో డీలా పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టే లక్ష్యంగా ‘ఛలో’ వంటి హిట్ సినిమా దర్శకుడు వెంకీ కుడుములతో జతకట్టాడు.
దర్శకుడు వెంకీ కుడుముల తను తీసుకునే సబ్జెక్ట్ సీరియస్‌గా ఉన్నా.. దానిచుట్టూ కామెడీతో కథను అల్లుకుని, ‘ఛలో’ సినిమాను సక్సెస్ చేశాడు. మళ్ళీ నితిన్‌తో చేసిన ‘భీష్మ’ కూడా అదే ఫార్మాట్‌తో వెళ్లాడు అనిపించేలా.. టీజర్స్.. ట్రైలర్స్ ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి అన్ కాంప్రమైజ్ ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమా.. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చింది. మరి దాదాపు ఏడాదిన్నార తరువాత వచ్చిన ‘భీష్మ’ సక్సెస్‌ను అందించిందా.. వెంకీ కుడుముల మరో సారి మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా.. అనేది చూద్దాం..
( కథ)
డిగ్రీ కూడా పాస్ అవ్వని భీష్మకు లైఫ్‌లో ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వదు. అలా నడుస్తున్న టైమ్‌లో భీష్మ, ఆర్గానిక్ కంపెనీలో పనిచేసే చైత్రను చూసి ప్రేమిస్తాడు. చైత్ర కూడా భీష్మ బిహేవియర్ నచ్చి ప్రేమిస్తుంది. ఇలా వారి ప్రేమ కొనసాగుతుండగా.. వారి ప్రేమ గురించి తెలుసుకున్న చైత్ర తండ్రి ఏసీపి అయిన దేవా తన కూతురు స్థాయికి భీష్మ ఏ మాత్రం సరిపోడని అతన్ని షూట్ చేయబోతాడు.
ఆ టైమ్‌లో భీష్మకు కూడా తెలియని ఒక నిజాన్ని అతని తండ్రి దేవాకు చెప్తాడు. ఆ తరువాత భీష్మ ఆర్గానిక్ కంపెనీకి సిఈవో అవుతాడు. ఈ నేపథ్యంలో భీష్మ ఆర్గానిక్ కంపెనీకి-గ్రీన్ ఫీల్డ్స్ కంపెనీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో.. హీరో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. మరి ఆర్గానిక్ కంపెనీకి సిఈవో భీష్మ కొనసాగుతాడా.. విలన్‌పై భీష్మ ఎలా విజయం సాధించాడు. చివరకు చైత్రను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..
(సినిమా ఎలా ఉంది)
ఈ సినిమా కథ మొత్తం భీష్మ చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా నడిపించాడు. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో వెంకీ కుడుముల నూటికి నూరు మార్కులు సాదించాడు. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది.
హీరోకు అన్ని సినిమాల్లోలా గ్రాండ్ వెల్కమ్ ఏమీ లేడు. డిఫరెంట్‌గా నితిన్ సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.
(నటీనటుటులు)
నితిన్ తనకు బాగా అలవాటైన జానర్ కాబట్టి చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ చెలరేగిపోయాడు. తన గత సినిమాలతో పోలిస్తే.. ‘భీష్మ’లో చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపించాడు. నటన పరంగా చాలా ఇంప్రూమెంట్ చూపించాడు. తన కామెడీ టైమింగ్స్.. డాన్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఇక రష్మిక తన అందంతో.. అభినయంతో మంచి ఆకట్టుకుంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా పండాయి.. ఇవి ఆడియన్స్‌ను బాగా అలరిస్తాయి.
కన్నడ సీనియర్ యాక్టర్ అనంత నాగ్ తన నట అనుభవాన్ని మరోసారి చూపించారు. ‘అశ్వథ్థామ’లో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నజీషుసేన్ గుప్తా తనదైన నటనతో మెప్పించాడు. వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఎప్పడూ సీరియస్ పాత్రలు పొషించే సంపత్ ఈ సినిమాలో సీరియస్ గానే ఉంటూ.. కామెడీని కూడా పండించాడు. ఇక నితిన్, సంపత్ కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక బ్రహ్మాజీ, నరేష్, రఘుబాబు వంటి మిగతా నటీనటులందరూ.. తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. హెబ్బా పటేల్ అతిధి పాత్రలో మెరిసింది.
( టెక్నీషియన్స్)
తన మొదటి సినిమా ‘ఛలో’తో ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈసారి భీష్మ అనే పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నా.. దానికి సింగిల్ ఫర్ ఎవర్ క్యాప్షన్ పెట్టి ట్రెండీ టచ్ ఇచ్చాడు. సింపుల్ డైలాగ్స్‌తోటి మంచి కామెడీతోటి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. ఒక మామూలు కథను తీసుకుని దానికి ప్రస్తుత తరానికి బాగా అవసరమైన సేంద్రీయ వ్యవసాయం అనే స్ట్రాంగ్ పాయింట్‌ను టచ్ చేస్తూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఒక వైపు కామెడీని పంచడం.. మరోవైపు లవ్ ట్రాక్ నడిపించడం.. ఇంకోవైపు మెసేజ్ ఇవ్వడం.. ఇలా అన్నింటినీ ఒక తాటిపై తీసుకురావడంలో డైరెక్టర్ వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫర్ సాయి శ్రీరామ్ తన ఫ్రేమ్స్‌తో సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు. అందమై లొకేషన్స్‌ను తన కెమెరాతో చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మహతీ స్వర సాగర్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. నవీన్ నూలే ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.
( ఓవరాల్‌గా)
ఏడాదిన్నారగా సినిమా లేని నితిన్ ఎంతో కసితో ఎన్నుకున్న ఈ సబ్జెక్ట్ అలాగే.. ‘ఛలో’తో మ్యాజిక్ క్రియేట్ చేసిన వెంకీ కుడుముల డైరెక్షన్.. పలు హిట్ సినిమాలు అందించిన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ చేసిన ఈ ప్రయత్నం ఆడియన్స్‌ను మెప్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉంది.
Read More>> శివరాత్రి జాగరం – అర్థరాత్రి ఆటల సందడి!