46 ఏళ్ల నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 09:20 PM IST
46 ఏళ్ల నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం..

Updated On : August 29, 2020 / 9:27 PM IST

NBK Completes 46 years in TFI: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినబడితే తెలుగు ప్రేక్షకులకు ఓ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరో గుర్తొస్తాడు. బాలయ్య అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. వెండితెరపై బాలయ్య తన నటనతో జీవం పోసిన ఎన్నో పాత్రలు కళ్ళముందు కదలాడతాయి. బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి 46 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నటసింహం నట ప్రస్థానం గురించిన విశేషాలు..

తన 14 ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చారు బాలకృష్ణుడు.. 1974 ఆగస్టు 30 న ఈ చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే ‘నందమూరి నట వారసత్వాన్ని నిలబెడతాడు.. నటన ఇతని రక్తంలోనే ఉంది’ అని అందరూ బాలయ్యను ప్రశంసించారు. ఎన్టీఆర్ వారసుడిగా అరంగేట్రం చేసినా.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు చేశారు.. పోషించే పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చెయ్యడం అన్నది తండ్రి దగ్గర నుండి అలవర్చుకున్నారు బాలయ్య. తండ్రి తర్వాతి జెనరేషన్‌లో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస, సైన్స్ ఫిక్షన్, సాంఘిక చిత్రాలు చేసిన ఈతరం ఏకైక కధానాయకుడు బాలయ్య మాత్రమే.

‘అన్నదమ్ముల అనుబంధం’, ‘దాన వీర శూర కర్ణ’, ‘అక్బర్ సలీం అనార్కలి’ వంటి సినిమాల తర్వాత ‘మంగమ్మగారి మనవడు’ బాలయ్యకు సోలో హీరోగా బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదు.. ‘కథానాయకుడు, రాము, బాబాయ్ అబ్బాయి, ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, ఆదిత్య 369, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలిసింహం, ముద్దుల మొగుడు, పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్’.. ఇలా 46 ఏళ్ళ ఆయన నట జీవితంలో ఎన్నో మరచిపోలేని మధురమైన చిత్రాలు, ఆయన తప్ప మరెవరూ చెయ్యలేని పాత్రలు మనకి కనబడతాయి.

కేవలం నటుడిగానే కాకుండా తండ్రిలా రాజకీయాల్లోనూ ప్రవేశించి రెండవసారి కూడా ఎమ్మేల్యేగా గెలిచి ప్రజాసేవ చేస్తూ, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు బాలయ్య. ఇప్పటికీ తన సినిమాల ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని, చరిత్రను ప్రేక్షకులకు తెలియచెయ్యాలని, తన అభిమానులను అలరించాలని, వారిని గొప్ప వారిగా చూడాలని ఉబలాట పడుతుంటారాయన.. మనిషి పైకి కాస్త గంభీరంగా కనిపించినా ఆయన మనసు మాత్రం వెన్నపూస.. కల్మషం తెలియని భోళాశంకరుడు బాలయ్య.. తండ్రి తదనంతరం గత నాలుగు దశాభ్దాలుగా నందమూరి నటవారసత్వాన్ని కాపాడుకొస్తుంది ఒక్క బాలయ్య మాత్రమే..

యువ కిశోరం, యుగాస్టార్, గోల్డెన్ స్టార్, యువరత్న, నటసింహం.. ఇలా తన పేరు ముందు ఎన్ని బిరుదులు తగిలించినా.. బాల, బాలయ్య అని పిలిస్తేనే ఆయనకి ఆనందం.. అలా పిలవడమే అభిమానులకు ఇష్టం..
మరిన్ని మంచి సినిమాలతో, అద్భుతమై పాత్రలతో ప్రేక్షకాభిమానులను అలరించాలని కోరుకుంటూ.. 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.