Game On : ‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్‌తో ఆడే సైకాలజీ గేమ్ థ్రిల్లర్‌..

ఓ వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకునే సైకాలజీ గేమ్ థ్రిల్లర్ కథకి అమ్మ సెంటిమెంట్ జోడించిన సినిమా గేమ్ ఆన్.

Game On : ‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్‌తో ఆడే సైకాలజీ గేమ్ థ్రిల్లర్‌..

Geethanand Neha Solanki Game On Movie Review and Rating

Game On Movie Review : దయానంద్‌ దర్శకత్వంలో సైకలాజికల్ గేమ్ కథతో తెరకెక్కిన సినిమా ‘గేమ్‌ఆన్’. గీతానంద్‌, నేహా సోలంకి(Neha Solanki) జంటగా సీనియర్ నటి మధుబాల(Madhubala), ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాకర్, కిరీటి, వాసంతి కృష్ణన్ కీలక పాత్రల్లో ఈ సినిమాని క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించారు.

కథ విషయానికొస్తే.. సినిమా ఓపెనింగ్ సూర్యనారాయణ(శుభలేఖ సుధాకర్) ఓ 12 ఏళ్ళ క్రితం హత్య చేసినట్టు చూపించి ప్రస్తుత కథలోకి వస్తారు. గౌతమ్ (గీతానంద్) ఒక గేమింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అయితే తన టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడంతో బాస్ తిడతాడు. అదే సమయంలో కంపెనీకి తాను తేవాలన్న ఆఫర్ ని తన బెస్ట్ ఫ్రెండ్(కిరీటి) మోసం చేసి తీసేసుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి సెక్సీ(వాసంతి) కూడా తనని చీట్ చేసి తన ఫ్రెండ్ తో కలిసి మోసం చేసి వెళ్ళిపోతుంది. జాబ్ కూడా పోతుంది. ఇలా అన్ని వైపులా ఫెయిల్యూర్స్ ఉండటంతో గౌతమ్ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు.

అలాంటి సమయంలో ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చి మీరు గేమ్ లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చి చేస్తే లక్ష రూపాయలు ఇస్తాం అంటారు. గౌతమ్ చేయడంతో డబ్బులు అకౌంట్ లో పడతాయి. దాంతో చనిపోదాం అనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ గేమ్ లో ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఒక రోజు గేమ్ ఆడించే మదన్ మోహన్(ఆదిత్య మీనన్) కాల్ చేసి ఇక నుంచి డేంజర్ గేమ్స్ ఉంటాయి చావడం లేదా గెలవడం మాత్రమే అని చెప్పడంతో ఓకే అని మరింత ముందుకి వెళ్తాడు. అదే సమయంలో తనకి తార(నేహా సోలంకి) పరిచయం అయి ప్రేమ అంటూ తిరుగుతారు. అదే సమయంలో తన తల్లిని ఎంత ద్వేషిస్తున్నది చూపిస్తారు. ఒక టాస్క్ లో ఓ వ్యక్తిని చంపాల్సి వస్తే నో చెప్పడంతో వేరే వాళ్ళు ఇతనిపై అటాక్ చేస్తారు. దీంతో ఆ గేమ్ లోంచి బయటకి వచ్చి దూరంగా నేహాతో కలిసి వెళ్తాడు. అయినా గౌతమ్ ని చంపడానికి మనుషులు వస్తారు. గౌతమ్ ని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? అసలు ఈ గేమ్ ఎవరు ఎందుకు ఆడిస్తున్నారు? నేహా గౌతమ్ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? గౌతమ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? గౌతమ్ వాళ్ళ అమ్మని ఎందుకు ద్వేషిస్తున్నాడు? సూర్యనారాయణ ఎవరిని చంపారు? ఎందుకు చంపారు? తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సినిమా ఓపెనింగ్ ఓ 12 ఏళ్ళ క్రితం హత్య చూపించి ప్రస్తుత కథలోకి వస్తారు. దీంతో అసలు ఆ హత్య ఎందుకు చేసారు అని ఎదురుచూస్తాం. ఇక ఫస్ట్ హాఫ్ హీరో ఫెయిల్యూర్స్ తో సాగి గేమ్ లోకి ప్రవేశించడం, టాస్క్ లు చేయడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి నేహాతో ప్రేమలో పడటం, ఒక మనిషిని చంపే టాస్క్ చేయను అని చెప్పడంతో అతనిపై అటాక్ తో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ లో హీరో మీద అటాక్, హీరో ఫ్లాష్ బ్యాక్, అమ్మ సెంటిమెంట్ తో నడిపిస్తారు. చివర్లో ఓ రెండు ట్విస్టులు రివీల్ చేసి ఆసక్తి కలిపిస్తారు. క్లైమాక్స్ యాక్షన్ లో వచ్చే మధుబాల యాక్టింగ్ మాత్రం కొంత సిల్లీగా అనిపిస్తుంది. హీరో గతం గురించి ఇచ్చిన ఎలివేషన్ కి, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ కి అంతగా కనెక్టివిటీ ఉండదు. గేమ్ లో ఇచ్చే టాస్కులు ఎమోషన్స్ తో ఆడుకునేలా కనెక్ట్ చేయడం బాగుంటుంది. హీరో – హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. యాక్షన్ తో పాటు రొమాన్స్ కి కూడా బాగా స్పేస్ ఉంది సినిమాలో.

Also Read : Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రివ్యూ.. బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగానే వినిపిస్తుంది..

నటీనటులు.. గీతానంద్ గతంలోనే రథం అని ఓ సినిమాతో మెప్పించాడు. ఇందులో కూడా మొదట ఎమోషనల్, అమాయకంగా కనిపించి ఆ తర్వాత యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఒక్క డ్యాన్స్ మాత్రం ఇంకొంచెం నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. నేహా సోలంకి రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకుంది.చివర్లో నటనకు కొంచెం స్కోప్ దొరికింది. సైక్రియాటిస్టు గా, గేమ్ ఆడించే వ్యక్తిగా ఆదిత్య మీనన్ మెప్పిస్తారు. మధుబాల అమ్మ సెంటిమెంట్ కోసం తెచ్చినా అంతగా కనెక్ట్ అవ్వలేదు. శుభలేఖ సుధాకర్ కనపడేది కాసేపైనా మెప్పించారు. బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న వాసంతి కూడా మోడరన్ అమ్మాయిగా అదరగొట్టింది.

సాంకేంతిక విషయాలు.. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. యాక్షన్ సన్నివేశాల్లో, టాస్క్ లు ఆడే సన్నివేశాల్లో సంగీత దర్శకుడు అభిషేక్ ఏ ఆర్ అదరగొట్టాడు అని చెప్పొచ్చు. అర‌వింద్ విశ్వనాథ‌న్‌ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త షాట్స్ చాలానే ట్రై చేశారు. విజువల్స్ లో చాలా క్లారిటీ, క్వాలిటీ ఉంటుంది. యాక్షన్ సీన్స్ అన్ని బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎడిటింగ్ కూడా బాగా కట్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా న్యాచురల్ గా కనిపించేలా సెట్ చేశారు అన్ని. ఇక దర్శకుడు దయానంద్ కి ఇది మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా అలా అనిపించదు. కథ బాగున్నా కథనంపై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండు అనిపిస్తుంది. దర్శకుడిగా మాత్రం దయానంద్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాత కూడా కొత్తవాడైనా బాగానే ఖర్చు పెట్టాడు. సినిమా అంతా రిచ్ క్వాలిటీగానే కనిపిస్తుంది.

మొత్తంగా ఓ వ్యక్తి ఎమోషన్స్ తో ఆడుకునే సైకాలజీ గేమ్ థ్రిల్లర్ కథకి అమ్మ సెంటిమెంట్ జోడించిన సినిమా గేమ్ ఆన్. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. గేమ్ ఆన్ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.