సుందరం మాస్టర్ రివ్యూ.. వైవా హర్ష హీరోగా మొదటి సినిమా మెప్పించాడా?

వైవా హర్ష హీరోగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుందరం మాస్టర్ రివ్యూ ఏంటి..? హీరోగా మొదటి సినిమా మెప్పించాడా..?

సుందరం మాస్టర్ రివ్యూ.. వైవా హర్ష హీరోగా మొదటి సినిమా మెప్పించాడా?

Harsha Chemudu Divya Sripada Sundaram Master movie Review

Sundaram Master Review : వైవా షార్ట్ ఫిలింతో పేరు తెచ్చుకొని ఆ తర్వాత కమెడియన్ గా బిజీ అయినా హర్ష మొదటిసారి మెయిన్ లీడ్ లో చేసిన సినిమా సుందరం మాస్టర్. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజయింది. సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే..
సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తూ ఎక్కువ కట్నంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే(హర్ష వర్ధన్) స్కూల్‌కి వచ్చి అందరు టీచర్స్‌ని చూసి సుందరాన్ని సెలెక్ట్ చేసుకొంటాడు. గత 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న మిరియాల మెట్ట అనే ఊరికి ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్తే DEOగా ప్రమోషన్ ఇప్పిస్తానని సుందరానికి చెబుతాడు. మిరియాల మెట్టలో విలువైనదో ఉందని, దాన్ని 6 నెలల్లో కనుక్కుని చెబితే DEO అయిపోతావని ఎమ్మెల్యే ఊరిస్తాడు. DEO అయితే కట్నం ఎక్కువ వస్తుందన్న ఆశతో సుందరం ఓకే అంటాడు.

అడవుల్లో ఉన్న మిరియాల మెట్ట అనే ఆ చిన్న ఊరికి వెళతాడు సుందరం . అక్కడ A B C Dలు చెప్తుంటే ఆ ఊళ్ళో వాళ్లంతా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు. సరే అని పదాలు కరెక్ట్ గా చెప్పినా స్పెల్లింగ్స్ తప్పు అని ఆ ఊరి వాళ్లంతా ఇతను టీచర్ కాదు, ఇంగ్లీష్ రాదు అని ఇంగ్లీష్ లో తిట్టి 15 రోజులు టైం ఇచ్చి తర్వాత నీకు పరీక్ష పెడతాము పాస్ అయితే ఓకే, లేకపోతే ఉరి వేసి చంపేస్తాం అంటారు ఊరిపెద్ద(బాలకృష్ణ నీలకంఠాపురర్). ఆ ఊర్లోనే ఓజా అనే ఓ వ్యక్తి సుందరంకి హెల్ప్ చేస్తా అని ఆ ఊరి గురించి.. 1920లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా దగ్గర దొరికే మిరియాల కోసం మమ్మల్ని బానిసలుగా చేసుకుంటే ఓ దొర వచ్చి బ్రిటిష్ వాళ్ళని పంపించేసి అతను ఇక్కడే సెటిల్ అయి మాకు ఇంగ్లీష్ నేర్పించాడు. అతని కొడుకు కొన్ని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ చెప్పాడు, అతను చనిపోవడంతో మాకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశామని, బయట వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయకూడదని మా ఊరు దారులన్నీ తీసేసాం అంటూ ఆ ఊరి గురించి అన్ని విషయాలు చెప్తాడు.

సుందరం ఎలాగోలా ఓజా సహాయంతో ఆ ఊరివాళ్ళు పెట్టె పరీక్ష పాస్ అయి ఆ ఊర్లో దొరికే విలువైన దాని గురించి వెతుకుతుంటే కొంతమంది ఆ ఊరి గ్రామ దేవత విగ్రహం అని చెప్పడంతో చూడటానికి వెళ్తే అక్కడ ఆ విగ్రహం ఉండదు. అసలు ఆ విగ్రహం ఏమైంది? నిజంగానే విగ్రహం విలువైందా? సుందరం మాస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాడా? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? వాళ్ళకి నలుపు రంగు అంటే ఎందుకిష్టం? ఆ ఊరి నుంచి సుందరం మాస్టర్ ఎప్పుడు బయటకి వచ్చాడు.. అనేవి తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
కొన్ని తెగల వాళ్ళు ప్రపంచానికి సంబంధం లేకుండా బతకడం, వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయడం లాంటివి రియల్ లైఫ్ లో వార్తలు చూసాము. అలాగే మిరియాల మెట్ట అనే ఊరిని తీసుకొని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ ని రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం.. లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది. ఆ ఊరి వాళ్లకి స్వతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవడం, గాంధీ ఎలా ఉంటారు అని తెలియకపోవడం, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవడం, క్రికెట్, ఇప్పుడు ఉన్న డబ్బుల గురించి తెలియకపోవడం, గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవడం.. లాంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవే సీన్స్ లో కొన్ని మాత్రం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్లు నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో వాడుకొని కథ చెప్పడం గమనార్హం.

Also read : Anupama Parameswaran : టాలీవుడ్ వెబ్‌సైట్‌కి అనుపమ చురకలు.. వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్..

నటీనటుల విషయానికొస్తే..
కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు.

సాంకేతిక విషయాలు..
సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. అడవులు, జలపాతం, మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న ఊరు.. వంటి సినిమాటిక్ విజువల్స్  అద్భుతంగా చూపించారు. ఆ ఊరిని ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా కట్టింది. నిజంగా ప్రపంచానికి దూరంగా ఓ పల్లెటూరు ఉంటె అలాగే ఉంటుందేమో అనిపించేలా కట్టారు. కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ నిజమో, కలో తెలియకుండా ఉండేలా రాసిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ సాధారణ ఆడియన్స్‌ని కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు కానీ సినిమా చూస్తే అతని పర్సనల్ ఒపీనియన్స్ ఎక్కువగా సినిమాలో జొప్పించినట్టు అనిపిస్తుంది. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది.

మొత్తంగా ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్న ఓ ఊరికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న పాఠాలు ఏంటనే కథని మంచి ఎమోషన్స్ తో నడిపించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.