Ashwini Dutt : పవన్ కళ్యాణ్ గురించి నేను అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన కల్కి నిర్మాత..
తాజాగా అశ్వినీదత్ తన సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

Kalki Movie Producer Ashwini Dutt gives Clarity on his Comments about Pawan Kalyan
Ashwini Dutt : కల్కి సినిమా నిర్మాత అశ్వినీదత్ సినిమా రిలీజ్ ముందు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్ల పెంపు అడిగి కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. అయితే రిలీజ్ తర్వాత అశ్వినీదత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని కలిసి టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడితే పవన్ సినిమాకు తగ్గట్టు, సినిమా భారీతనానికి తగ్గట్టు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అన్నారని తెలిపారు.
అయితే కొంతమంది అశ్వినీదత్ వ్యాఖ్యలు వక్రీకరించి పవన్ కళ్యాణ్ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెంచుకోవచ్చు అన్నారు, నార్త్ సిటీలలో ఉన్నట్టు ఇక్కడ కూడా పెంచుకోవచ్చు అన్నారని ప్రమోట్ చేసారు. పవన్ కళ్యాణ్ అన్నారని అశ్వినీదత్ చెప్పినట్లు ప్రమోట్ చేసారు. దీంతో పలువురు అశ్వినీదత్ పై విమర్శలు చేసారు. తాజాగా అశ్వినీదత్ తన సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Also Read : Kamal Haasan : కల్కి రిలీజ్ తర్వాత హైదరాబాద్‌కి కమల్ హాసన్.. గ్రాండ్‌గా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..
అశ్వినీదత్ తన సోషల్ మీడియా పోస్ట్ లో.. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారీ ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని, కూలంకుషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవొచ్చు, అది ఒక వారమా? 10 రోజులా? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి CBN గారు, తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు అని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకోండి అనలేదని అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్ తో పలువురు జనసైనికులు, పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ పోస్టులు చేసిన వారిపై విమర్శలు చేస్తున్నారు.
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) July 5, 2024