Karmanye Vadhikaraste Review : ‘కర్మణ్యే వాధికారస్తే’ మూవీ రివ్యూ.. ఇండియాలోని ఓ సీరియస్ ఇష్యూ మీద తీసిన సినిమా..
ఈ సినిమాలో మూడు కథలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఒకేసారి నడుస్తాయి. (Karmanye Vadhikaraste)
 
                            Karmanye Vadhikaraste Review
Karmanye Vadhikaraste Review : బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్ పై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో DSS దుర్గా ప్రసాద్ నిర్మాణంలో అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. కర్మణ్యే వాధికారస్తే సినిమా నేడు అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఈ సినిమా మూడు కథలతో సమాంతరంగా సాగుతుంది. కిరీటి(బ్రహ్మాజీ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. అతని నిజాయితీ నచ్చక పై ఆఫీసర్ చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ వేస్తారు. ఓ రోజు ఆ ప్లేస్ లో రేప్ కి గురయిన ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెకు తెలివి వచ్చేవరకు బయటకు తెలియకూడదు అని తన ఇంట్లోనే ఉంచుతాడు. ఆమె బ్యాగ్ లో గన్స్ కి సంబంధించిన ఫోటోలు, కొన్ని కోడ్స్ కనిపిస్తాయి. దీంతో ఆమె ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు.
మరోవైపు పృథ్వీ(పృథ్వీ) యాక్సిడెంట్ చేయడంతో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ కేసు పోలీసాఫీసర్ అర్జున్(శత్రు) దగ్గరికి వస్తుంది. కానీ ఆ వ్యక్తి ముందే చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల కాదు అని పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. ఆ బాడీ కోసం కూడా ఎవరూ రారు. అలాంటి కేసులు వైజాగ్ లో చాలా ఉన్నాయని తెలిసి అర్జున్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. మరోవైపు జై(మాస్టర్ మహింద్రన్) అమ్మాయిలను ట్రాప్ చేసి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అసలు జై ఎవరు? రేప్ కి గురయిన అమ్మాయి ఎవరు? కిరీటి, అర్జున్ లు వాళ్ళ కేసులని సాల్వ్ చేస్తారా? ఈ ముగ్గురు చేసే పనులకు, వాళ్ళ కేసులకు లింక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ..
ఈ సినిమాలో మూడు కథలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఒకేసారి నడుస్తాయి. అలాగే మధ్యలో కథ ప్రస్తుతానికి, గతానికి వెళ్తుండటంతో స్క్రీన్ ప్లే కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా వేరు వేరు కేసులు అని చెప్పి చూపించి సింపుల్ గా ఇన్వెస్టిగేషన్ తో సాగదీశారు. మధ్యలో అర్జున్ పాత్ర లవ్ స్టోరీ కథలో సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్టులు రివీల్ చేయడం, ఈ కేసులు అన్ని ఒకే చోటికి కనెక్ట్ అవ్వడం, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బాగా రాసుకున్నారు. అయితే దాన్ని ఇంకాస్త క్లారిటీగా చెప్తే బాగుండేది. చివర్లో జై, అర్జున్, కిరీటిలను ముగ్గురిని కలుపుతారేమో అనుకుంటాం కానీ కలపకుండా పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
సినిమాలో హనీ ట్రాప్, మన దేశంలోకి వచ్చే అక్రమ వలసదారులు, వాళ్ళ వల్ల దేశ భద్రతకు కలిగే ముప్పు అనే సీరియస్ ఇష్యూని చూపించారు. SP క్యాడర్ ఆఫీసర్ పిలిచి కిరీటికి డైరెక్ట్ SPG గ్రూప్ పోస్టింగ్ ఇవ్వడం, ఉగ్రవాదులతో డైరెక్ట్ వెళ్లి ఫైట్ చేయడం లాంటి కొన్ని సీన్స్ మాత్రం మరీ సిల్లీగా అనిపిస్తాయి. సినిమా నిడివి రెండు గంటలే అయినా ఇంకాస్త ఎడిటింగ్ లో కట్ చేసి ఉంటె బాగుండు అనిపిస్తుంది. గ్లామర్ షో కూడా బాగానే ఉంది సినిమాలో. ఈ సినిమా రీసెంట్ టైమ్స్ లో తీసింది కాదని, ఎప్పుడో తీసింది పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు రిలీజయిందని సినిమాలో కొంతమంది ఆర్టిస్టులను చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాకు ఇంత పవర్ ఫుల్ టైటిల్ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
బ్రహ్మాజీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా నటించారు. మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శత్రు కూడా బాగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇన్నాళ్లు మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో రెండు షేడ్స్ లో తన నటనతో పర్వాలేదనిపించారు. శ్రీ సుధా – బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్విస్తారు. అయేషా, ఇరా దయానంద్, ప్రసాద్ బెహరా, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం.. పలువురు నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఒక పాటే ఉంది అది కూడా యావరేజ్. ఎడిటింగ్ పరంగా ఇంకా కొన్ని సీన్స్ కట్ చేయాల్సింది. ఒక మంచి సీరియస్ పాయింట్ దర్శకుడు చెప్దామనుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడ్డాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా ఓ సీరియస్ ఇష్యూ ని ప్రస్తావిస్తూ సాగిన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.






