కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. రౌడీషీటర్‌ అరెస్ట్

  • Published By: vamsi ,Published On : March 10, 2019 / 06:14 AM IST
కేజీఎఫ్ హీరో హత్యకు కుట్ర.. రౌడీషీటర్‌ అరెస్ట్

Updated On : March 10, 2019 / 6:14 AM IST

సోషల్‌ మీడియా ప్రపంచంలో ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఫేక్ వార్తలకు కొందరు తమ క్రియేటివిటీని ఉపయోగించి ప్రచారం చేస్తుండడంతో కొందరు అగ్రనటులు మీడియా సమావేశాలు పెట్టి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కన్నడ రాక్‌స్టార్, కేజీఎఫ్ హీరో యాష్‌ను హత్య చేయటానికి సుపారీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన యాష్.. తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేయటం మానుకోవాలని, తనను హత్య చేసే అవసరం ఎవరికీ లేదని, తనపై ఎవరికి ద్వేషం లేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ యాష్ స్పష్టం చేశారు.

అసలు నిజం ఏమిటంటే.. కర్ణాటకలో ఎన్నికల ముందు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొనే డ్రైవ్‌లను నిర్వహించారు. ఈ నేపథ్యంలో భరత్ అనే రౌడీషీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. యష్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు.. అందుకు భారీగా సుపారీ ఇచ్చారనే క్రమంలో భరత్‌ను అరెస్ట్ చేశారంటూ వార్త సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక్కసారిగా బ్రేకింగ్స్ పడ్డాయి.

అయితే అదంతా వట్టి అబద్దం అని తేలింది. యాష్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు వ్యూహ రచన అనడానికి ఆస్కారం లేదని, కన్నడ ఇండస్ట్రీలో మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వ్యక్తులు కన్నడ సినీ పరిశ్రమలో లేరని చెప్పారు. ఇక కన్నడనాటే కాక తెలుగులో కూడా యాష్ నటించిన కేజీఎఫ్ భారీ విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.