Dilruba : ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ.. సారీలు, థ్యాంక్స్ లు చెప్పొద్దు..
టైటిల్ కి తగ్గట్టే దిల్ రూబా ప్రేమ కథ అయినా సినిమా ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది.

Kiran Abbavaraam Rukshar Dhillon Dilruba Movie Review & Rating
Dilruba Movie Review : కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘దిల్ రూబా’. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్ పై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాణంలో విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. క్యాతీ డేవిసన్, జాన్ విజయ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రూబా సినిమా హోలీ పండుగ సందర్భంగా మార్చ్ 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. సిద్దార్థ్(కిరణ్ అబ్బవరం) చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఫ్రెండ్షిప్ చేసుకొని, ప్రేమించుకున్న మ్యాగీ(క్యాతీ డేవిసన్)తో అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వస్తుంది. అదే సమయంలో సిద్దార్థ్ తండ్రి కూడా చనిపోతాడు. ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మంగళూరు వెళ్లి చదువుకుంటాడు. సిద్దార్థ్ సారీలు, థ్యాంక్స్ లు అనేవి చాలా విలువైన పదాలు అవి ఎలా పడితే అలా వాడకూడదు అనే సిద్ధాంతం నమ్ముతాడు. సిద్దార్థ్ క్యారెక్టర్ నచ్చి కాలేజీలో తన క్లాస్ మేట్ అంజలి(రుక్సర్ థిల్లాన్) ప్రేమిస్తుంది. సిద్దార్థ్ కూడా మ్యాగీని మర్చిపోయి అంజలి ప్రేమలో పడతాడు.
ఆ కాలేజీకి చెందిన విక్కీ(కిల్లి క్రాంతి)తో సిద్దార్థ్ కి గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో ఆ గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి. సిద్దార్థ్ సారీ చెప్పను అనడంతో అనుకోని పరిస్థితుల్లో అంజలి – సిద్దార్థ్ కూడా విడిపోతారు. ఆ తర్వాత పెళ్లి అయి ప్రగ్నెంట్ గా ఉన్న మ్యాగీ మళ్ళీ సిద్దార్థ్ లైఫ్ లోకి వస్తుంది. అసలు సిద్దార్థ్ సారీలు, థ్యాంక్స్ లు ఎందుకు చెప్పడు? సిద్దార్థ్ – మ్యాగీ ఎందుకు విడిపోయారు? సిద్దార్థ్ – అంజలి ఎందుకు విడిపోయారు? సిద్దార్థ్ – అంజలి మళ్ళీ కలిసారా? సిద్దార్థ్ లైఫ్ లోకి మ్యాగీ ఎందుకు వచ్చింది? సిద్దార్థ్ – విక్కీ గొడవలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Officer on Duty : ‘ఆఫీసర్ – ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ.. హత్యలు, ఆత్మహత్యలతో సాగే థ్రిల్లర్ సినిమా..
సినిమా విశ్లేషణ.. టైటిల్ కి తగ్గట్టే దిల్ రూబా ప్రేమ కథ అయినా సినిమా ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది. గతంలో పూరి జగన్నాధ్ సినిమాలు హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిచేవి. ఈ సినిమా చూస్తే మళ్ళీ అదే ఫీల్ కలుగుతుంది. పూరి క్యారెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్స్ తో చూసినట్టు అనిపిస్తుంది దిల్ రుబా చూస్తుంటే.
ఫస్ట్ హాఫ్ లో మ్యాగీ – సిద్దార్థ్ ప్రేమ కథ, అంజలి – సిద్దార్థ్ ప్రేమ కథ, విక్కీతో గొడవలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి సిద్దార్థ్ – అంజలి విడిపోవడంతో ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మ్యాగీ సిద్దార్థ్ లైఫ్ లోకి రావడం, అంజలి – సిద్దార్థ్ ల ప్రేమ ఏమైంది, మళ్ళీ ఇంకో విలన్ రావడం, విక్కీతో కథ ఆసక్తిగానే సాగుతుంది. హీరో పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఒకే క్యారెక్టర్ తో నడిపించాడు. చివర్లో ఓ చోట హీరో క్యారెక్టర్ మారిపోయిందా అనుకునేలోపు క్లైమాక్స్ లో మంచి జస్టిఫికేషన్ ఇస్తారు.
అయితే రెండు లవ్ స్టోరీలతో కథ నడవడంతో అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు ఉంటుంది. హీరోయిన్ హీరో వెంటపడే సీన్స్ కాస్త ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి. విక్కీ పాత్రని కొడుతుంటే మాత్రం ఇంకా కొట్టాలి అనే ఎమోషన్ కి బాగా కనెక్ట్ చేసారు. సినిమా అంతా సీరియస్ గానే సాగుతుంది. అయితే లవ్ స్టోరీ లేదా హీరో అగ్రెషన్ తో సాగుతుంది. అంత సీరియస్ స్టోరీలో సత్య అక్కడక్కడా నవ్వించినా సత్యని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. చాన్నాళ్ల తర్వాత తన రెగ్యులర్ యాక్టింగ్ ని పక్కన పెట్టి కాస్త యాగ్రెసివ్ పాత్రలో కిరణ్ అబ్బవరం కొత్తగా బాగా నటించాడు. ఈ సినిమాలో చాలా సీన్స్ లో కిరణ్ మరింత హ్యాండ్ సమ్ గా కనిపిస్తాడు. రుక్సార్ థిల్లాన్ యాక్టింగ్ మొదట్లో కాస్త ఇరిటేటింగ్ అనిపించినా ఎమోషన్ సీన్స్ లో పర్వాలేదనిపిస్తుంది. ప్రగ్నెంట్ పాత్రలో క్యాతీ డేవిసన్ న్యాచురల్ గా నటించింది.
కిల్లి క్రాంతి, జాన్ విజయ్ లు నెగిటివ్ పాత్రల్లో బాగానే మెప్పించారు. ఆడుకాలం నరేన్ హీరోయిన్ తండ్రి పాత్రలో చక్కగా నటించారు. సత్య అక్కడక్కడా నవ్విస్తాడు. సమీర్, సామ్రాట్, గెటప్ శ్రీను, తులసి, హీరో తండ్రి పాత్ర చేసిన నటుడు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Court : ‘కోర్ట్’ మూవీ రివ్యూ.. పోక్సో చట్టం గురించి.. కచ్చితంగా చూడాల్సిన సినిమా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మంగుళూరు లొకేషన్స్ చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్స్ మాత్రం కాస్త కొత్తగా ఉన్నాయి. ప్రమోషన్స్ లో నిర్మాత చెప్పినట్టు యాక్షన్ సీన్స్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్ యావరేజ్. దర్శకుడు కథ పరంగా కాకుండా హీరో క్యారెక్టరైజేషన్ మీద నడిపించి కథ, కథనంలో కాస్త తడబడ్డాడు. డైలాగ్స్ మాత్రం బాగా రాసుకున్నారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు.
మొత్తంగా ‘దిల్ రూబా’ ఊరికే సారీలు, థ్యాంక్స్ లు చెప్పని హీరో క్యారెక్టర్, అతని లైఫ్ లో ఉన్న ప్రేమ కథలతో సాగుతుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.