40 ఏళ్ల ప్రయాణం.. నమస్కరిస్తున్నా.. ఎమోషనల్ అయిన లేడీ సూపర్‌స్టార్..

  • Published By: sekhar ,Published On : September 12, 2020 / 06:31 PM IST
40 ఏళ్ల ప్రయాణం.. నమస్కరిస్తున్నా.. ఎమోషనల్ అయిన లేడీ సూపర్‌స్టార్..

Updated On : September 12, 2020 / 6:51 PM IST

Vijayashanthi Successfully Completed 40 Years: లేడీ అమితాబ్‌, లేడీ సూపర్‌ స్టార్‌, రాములమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి విజయశాంతి. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం ‘కిలాడి కృష్ణుడు’ విడుదలై నేటికి(సెప్టెంబర్‌ 12) 40 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆమె ఇన్ని సంవత్సరాల పాటు తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.


అంతేకాదు తనని తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయనిర్మలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘కిలాడి కృష్ణుడు’ చిత్రంలో తెలుగులో మొదలైన విజయశాంతి ప్రస్థానం.. ఏ విధంగా మలుపు తిరిగిందో అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా మొదలై.. ‘మగరాయుడు’గా మారి, లేడి అమితాబ్‌గా పిలిపించుకుని తన క్యారెక్టర్‌ పేరు మీదే సినిమాలు రూపొందించే స్థాయిని ఆమె సొంతం చేసుకున్నారు.


ఈ 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆమె ఎన్నో సక్సెస్‌లు, అవార్డులు అందుకున్నారు. రాజకీయాలంటూ కొంతకాలం పాటు సినిమాలకి దూరమైనప్పటికీ, ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇచ్చి.. మరోసారి తన నటనతో అందరినీ మెప్పించడమే కాకుండా.. ఆ సినిమా సక్సెస్‌లో తన వంతు కీలక పాత్ర పోషించారు.


విజయశాంతి కృష్ణతో తెలుగు సినిమా రంగానికి పరిచయం కావడం, మహేష్ బాబుతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో నటిగా సమున్నతమైన స్థానం తనకి దక్కినందుకు ఆనందిస్తూ.. ఆ స్థానం కల్పించిన కళామతల్లికి అలాగే ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలుపుతూ.. విజయశాంతి ఉద్వేగభరితమయ్యారు.


‘‘నా మొదటి తెలుగు సినిమా ‘కిలాడి కృష్ణుడు’ విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల పయనంలో సహృదయతతో ఆదరించి, అనేకమైన అద్భుత విజయాలను, సమున్నతమైన స్థానాన్ని అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందించారు. నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్న సందర్భం ఇది. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలతో..’’ అని తెలుపుతూ ‘కిలాడి కృష్ణుడు’ చిత్ర పోస్టర్‌ని పోస్ట్ చేశారు విజయశాంతి.
తన 14వ ఏట సినీరంగ ప్రవేశం చేసిన విజయశాంతి ఇన్నేళ్ల కెరీర్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ నటించి మెప్పించారు.