Mufasa : ‘ముఫాసా’ మూవీ రివ్యూ.. మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా ఎలా ఉందంటే..?
ఈ సినిమా సింబా, ది లయన్ కింగ్ సినిమాలకు ప్రీక్వెల్ గా తెరకెక్కింది.

Mahesh Babu Voice Over Walt Disney Mufasa The Lion King Movie Review
Mufasa – The Lion King Movie Review : హాలీవుడ్ సూపర్ హిట్ యానిమేటెడ్ సినిమాలు సింబా, ది లయన్ కింగ్ సినిమాలకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘ముఫాసా – ది లయన్ కింగ్’ సినిమా నేడు డిసెంబర్ 20న థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజయింది. సింబా, లయన్ కింగ్ సినిమాలకు ఇండియాలో కూడా మంచి ఆదరణ లభించడం, ముఫాసా మెయిన్ లీడ్ సింహం పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. డిస్నీ నిర్మాణంలో బ్యారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే.. ఫరూఖీ(ముసలి కొండముచ్చు – RCM రాజు వాయిస్) సింబా కూతురు(కియారా- ఆడ సింహం పిల్ల)కు ఆమె తాత ముఫాసా(సింహం) కథ చెపుతాడు. ఓ రాజ్యంలో వరదలు రావడంతో చిన్నప్పుడే తన తల్లి తండ్రుల నుంచి దూరంగా వరదల్లో కొట్టుకుపోయి అనాధగా మిగులుతాడు ముఫాసా(మహేష్ బాబు వాయిస్). అలా వరదల్లో వేరే రాజ్యానికి కొట్టుకుపోయిన ముఫాసాను టాకా(మరో సింహం – సత్యదేవ్ వాయిస్) కాపాడి తన కుటుంబంలో ఒకరిగా చేసుకుంటాడు. కానీ టాకా తండ్రి ముఫాసాను అనామకుడిగానే చూస్తాడు. తల్లి మాత్రం ముఫాసాకు అన్ని విద్యలు నేర్పుతుంది. ముఫాసా తన తల్లితండ్రులను గుర్తుచేసుకుంటూ తన తల్లి చెప్పే అందమైన మిలేలి రాజ్యానికి ఎప్పటికైనా వెళ్ళాలి అనుకుంటాడు.
ఓ రోజు ముఫాసా తన పెంపుడు తల్లితో వేటకు వెళ్లగా కొన్ని తెల్ల సింహాలు దాడి చేస్తాయి. అందులో ఓ తెల్ల సింహం(యువరాజు)ని ముఫాసా చంపేస్తుంది. దీంతో ఆ తెల్ల సింహాల రాజు(కిరోస్) తన సింహాలతో కలిసి ముఫాసా ఉన్న రాజ్యంపైకి దండెత్తడంతో ముఫాసా, టాకా రాజ్యం నుంచి దూరంగా పారిపోండి అని తల్లి తండ్రులు చెప్తారు. తెల్ల సింహాలు టాకా ఫ్యామిలీ అందర్నీ చంపేసి ముఫాసా, టాకా కోసం వెతకడం ప్రారంభిస్తాయి. ఇక ముఫాసా, టాకా మిలేలిని వెతుక్కుంటూ వెళ్తుండగా వీరికి తెల్ల సింహాల వల్ల ఫ్యామిలీని పోగొట్టుకున్న షరాబీ(ఆడ సింహం), ఆమె రక్షకుడు జుజు(పక్షి) తోడవుతారు. వీళ్లకు మిలేలికి తీసుకెళ్తా అని ఫరూఖీ(కొండముచ్చు) తోడవుతుంది. మరి వీళ్లంతా కలిసి మిలేలికి వెళ్ళారా? తెల్ల సింహాలు ముఫాసా, టాకాలను పట్టుకున్నాయా? ముఫాసా – షరాబీ ప్రేమకథ ఎలా మొదలైంది? ముఫాసా రాజు ఎలా అయ్యాడు? ముఫాసా చిన్నప్పుడు పోగొట్టుకున్న తన తల్లితండ్రులను కలిశాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Bachhala Malli : ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ ఏడిపించేశాడుగా..
సినిమా విశ్లేషణ.. హాలీవుడ్ యానిమేషన్ సినిమాలు ఎంత బాగుంటాయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా డిస్నీ సినిమాలు అయితే కథతో పాటు యానిమేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటాయి. ఈ సినిమా సింబా, ది లయన్ కింగ్ సినిమాలకు ప్రీక్వెల్ గా తెరకెక్కింది. కొత్తగా చూసేవాళ్లకు కథ కొంత అర్థంకాకపోవచ్చు. కానీ ది లయన్ కింగ్ చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రతి పాత్ర ముందే తెలుస్తుంది. ఒక అనాధగా మిగిలిపోయిన సింహం వేరే రాజ్యంలో బతుకుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకో సింహంతో పారిపోయి తర్వాత ఎలా రాజుగా మారాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. క్లైమాక్స్ లో మంచి ఎమోషన్ కూడా పండించారు. కొన్ని పాత్రలతో అక్కడక్కడా ఫుల్ గానే నవ్వించారు. కథ పరంగా ఎక్కడా బోర్ కొట్టకపోయినా మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఎందుకురా బాబు అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ లో అయితే ఆ పాటలు పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు.
ఇక డబ్బింగ్ పరంగా కూడా ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా సింక్ చేస్తూ తెలుగులో వాయిస్ లు అందించారు. తెలుగులో మహేష్ బాబు మెయిన్ లీడ్ ముఫాసా పాత్రకు పర్ఫెక్ట్ ఎమోషన్ తో డబ్బింగ్ ఇచ్చారు. టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇవ్వగా మొదట గుర్తుపట్టలేకపోయినా కాసేపటికి అది సత్యదేవ్ వాయిస్ అని అర్ధం అవుతుంది. ఫరూఖీ కొండముచ్చు పాత్రకు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు అదిరిపోయే వాయిస్ ఇచ్చారు. కియారా రక్షకులుగా ఉన్న అడవిపంది పుంబా పాత్రకు బ్రహ్మానందం, మరో జంతువు టైమన్ పాత్రకు ఆలీ వాయిస్ ఇచ్చి నవ్వించారు. వాటితో పాటు జుజు పక్షి పాత్ర కూడా నవ్విస్తుంది. తెల్ల సింహాల రాజు కిరోస్ పాత్రకు అయ్యప్ప శర్మ వాయిస్ అందించారు. మిగిలిన పాత్రలకు ఇచ్చిన వాయిస్ లు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి.
ఇక ఈ సినిమాకు సాంకేతికంగా ఎలాంటి వంక పెట్టాల్సిన పనిలేదు. ఎంతో రియలిస్టిక్ గా నిజమైన సింహాలు, అడవి జంతువుల రాజ్యంలాగే పర్ఫెక్ట్ యానిమేషన్స్ తో అందమైన రాజ్యం సృష్టించారు. సింబా, ది లయన్ కింగ్ సినిమాలకు మంచి రీచ్ వచ్చి హిట్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా కూడా అదే బాటలో హిట్ అవ్వడం పక్కా. ఈ సినిమాను పిల్లలే కాదు పిల్లలతో కలిసి పెద్దలు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.