True Lover Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ.. లవ్ ఫెయిల్యూర్స్, లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

ట్రూ లవర్ సినిమా అమ్మాయి అబ్బాయి మధ్య అనుమానాలు, గొడవలు, ప్రేమలతో సాగుతుంది. లవర్స్ కి, లవ్ ఫెయిల్యూర్స్ ఈ సినిమా బాగా నచ్చుతుంది.

True Lover Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ.. లవ్ ఫెయిల్యూర్స్, లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

Manikandan Sri Gouri Priya True Lover Movie Review and Rating

Updated On : February 10, 2024 / 9:52 AM IST

True Lover Movie Review : మణికందన్(Manikandan), గౌరీప్రియ(Sri Gouri Priya) జంటగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన ‘లవర్’ సినిమాని తెలుగులో మారుతి, SKN ‘ట్రూ లవర్’ పేరుతో రిలీజ్ చేసారు. తమిళ్ లో నిన్న ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వగా తెలుగులో నేడు ఫిబ్రవరి 10న రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్స్ లోనే ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అని అర్థమైపోయింది.

కథ విషయానికొస్తే..
అరుణ్(మణికందన్), దివ్య(గౌరి ప్రియ) ఆరేళ్లుగా ప్రేమలో ఉంటారు. కాలేజీ రోజుల్లో నుంచి ప్రేమలో ఉంటారు. కానీ రాను రాను వీరిద్దరి మధ్య గొడవలు, విడిపోవడాలు, కలిసిపోవడాలు తరచూ జరుగుతుంటాయి. దివ్య ఓ కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. అరుణ్ ఓ కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే దివ్య పక్కన ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అరుణ్ కి నచ్చరు. కానీ దివ్య వాళ్ళతోనే తిరుగుతుంది. అరుణ్ కి చెప్పకుండా అబద్దాలు చెప్తూ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్తుండటంతో వీరిద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువ అవుతాయి. ఓ సారి అరుణ్ కూడా ఓ అబద్దం చెప్పి దొరికిపోతాడు. ఇక తన వాళ్ళ కాదని అరుణ్ తో బ్రేకప్ చెప్తుంది దివ్య. అరుణ్ ప్రశ్నించినా, బతిమాలినా నో చెప్తుంది. కొన్ని రోజులు వీరి మధ్య మాటలు ఉండవు.

అరుణ్ వాళ్ళ అమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిసిన తర్వాత మళ్ళీ మాములుగా మాట్లాడతారు. అరుణ్ మాత్రం ఆరేళ్ళ లవ్ వదులుకోలేను అంటాడు. అంతలో దివ్య బర్త్ డే రావడం, బర్త్ డే పార్టీకి వద్దు అనుకుంటూనే అరుణ్ ని పిలవడం, పార్టీలో గొడవ, ఆఫీస్ ఫ్రెండ్స్ తో దివ్య గోకర్ణ ట్రిప్ కి వెళ్తుందని తెలిసి తాను కూడా వెళ్తాడు అరుణ్. గోకర్ణ ట్రిప్ లో ఏం జరిగింది? దివ్య, అరుణ్ మధ్య మళ్ళీ ఎన్ని గొడవలు జరిగాయి? దివ్య ఎందుకు అరుణ్ ని వద్దంటుంది? అరుణ్ ఎందుకు దివ్యనే కావాలని అనుకుంటున్నాడు? చివరికి వీళ్లిద్దరు కలిసారా? విడిపోయారా? అరుణ్ కేఫ్ పెట్టాలన్న కల నెరవేరిందా? అరుణ్ వాళ్ళింట్లో గొడవలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
సినిమా అంతా ఒకే పాయింట్ మీద నడుస్తుంది. లవ్ లో ఉన్న ఇద్దరి మధ్య జరిగే సంగతులు, అబ్బాయి పొసెసివ్‌నెస్, అమ్మాయి చిరాకు మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి. సినిమాలో పూర్తిగా అమ్మాయే బాధపడుతున్నట్టు చూపించారు కానీ, అబ్బాయి వైపు ఉన్న పెయిన్ ని మాత్రం సరిగ్గా కన్వే చేయలేకపోయారు. సినిమా మొదటి నుంచి చివరివరకు లవర్స్ మధ్య గొడవలు, మాట్లాడుకోవడం, కలవడం, విడిపోవడం మాత్రమే ఉంటుంది. అయితే తాను ప్రేమించే అమ్మాయి వేరే అబ్బాయిలతో క్లోజ్ గా మూవీ అవుతుంటే మాత్రం అబ్బాయిలు తట్టుకోలేరు అనే పాయింట్ ని బాగా చూపించారు. హీరో ఇంట్లో అమ్మ నాన్నల రిలేషన్ కి కూడా ఒక సమస్య పెట్టి చివర్లో వీళ్ళకి దాన్ని కనెక్ట్ చేస్తాడు. అసలు రెండిటికి సంబంధం లేని కథలు అయినా ఎందుకు కనెక్ట్ చేసాడో అర్ధం కాదు. క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. 90s జనరేషన్ లవర్స్ కి, లవ్ లో ఉన్నవారికి, లవ్ ఫెయిల్యూర్స్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Also Read : Mrunal Thakur : ఆ ఇండస్ట్రీ నన్ను చాలా అవమానించింది.. మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

నటీనటుల విషయానికొస్తే..
మణికందన్, గౌరీప్రియ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. నిజమైన లవర్స్ లా అనిపించేంతలా నటిస్తారు. వీరిద్దరే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. తమిళ సినిమా కావడంతో మిగిలిన వాళ్లంతా తమిళ నటులే. అందరూ తమ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. చాలా సీన్స్ లో లైట్స్ వాడకుండా రియల్ లైటింగ్ తోనే సినిమాని తీశారు. చాలా సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా ఫస్ట్ హాఫ్ లో మాత్రం అంతగా సెట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా సాఫీగా సాగిపోతుంది. దర్శకుడిగా ప్రభురామ్ వ్యాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమా కూడా చిన్న బడ్జెట్ తోనే మంచిగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ట్రూ లవర్ సినిమా అమ్మాయి అబ్బాయి మధ్య అనుమానాలు, గొడవలు, ప్రేమలతో సాగుతుంది. లవర్స్ కి, లవ్ ఫెయిల్యూర్స్ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకు రేటింగ్ 3 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.