35-Chinna Katha Kaadu : ’35 చిన్న కథ కాదు’ మూవీ రివ్యూ.. పిల్లలు, పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..
పిల్లల చదువుకు సంబంధించిన కథతో ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీశారు.
35-Chinna Katha Kaadu Movie Review :నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’35 చిన్న కథ కాదు’. రానా సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణంలో నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ’35 చిన్న కథ కాదు’ సినిమా రేపు సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు. పిల్లల చదువుకు సంబంధించిన కథతో ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తీశారు.
కథ విషయానికొస్తే.. తిరుపతిలో నివసించే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కథ ఇది. ప్రసాద్(విశ్వదేవ్) TTD బస్సులో కండక్టర్. అతని భార్య సరస్వతి(నివేదా థామస్)ఇల్లాలిగా ఉంటుంది. పిల్లలు అరుణ్, వరుణ్. అరుణ్ కి చిన్నప్పట్నుంచి లెక్కల్లో బోలెడు డౌట్స్ ఉంటాయి. అసలు సున్నా గురించి ఇంకా చాలా డౌట్స్. అతని డౌట్స్ ఎవరూ తీర్చకపోవడంతో లెక్కలు అంటేనే నచ్చవు. ఎలాగోలా ఐదవతరగతి దాకా చదివాకా వేరే స్కూల్ లో ఆరో తరగతిలో జాయిన్ అవుతాడు. అక్కడ మ్యాథ్స్ టీచర్ చాణక్య వర్మ(ప్రియదర్శి) పిల్లలని మార్కుల బట్టి ట్రీట్ చేస్తూ ఉంటాడు. అరుణ్ కి సున్నా అని తెలియడం, మ్యాథ్స్ లో ఎక్కడలేని డౌట్స్ అరుణ్ అడుగుతుండటంతో చాణక్యవర్మ అతనిపై కోపం పెంచుకొని అతన్ని ఒక క్లాస్ తక్కువ చేసి మళ్ళీ ఐదో తరగతికి వేస్తాడు.
ఈ విషయంలో ప్రసాద్ బాగా ఫీల్ అవుతాడు. అనుకోకుండా అరుణ్ చాణక్య వర్మ యాక్సిడెంట్ కి కారణం అవ్వడంతో స్కూల్ లో పెద్ద గొడవ అయి అరుణ్ ని సస్పెండ్ చేస్తారు. కాని తర్వాత అరుణ్ స్కూల్ లో కొనసాగాలంటే మ్యాథ్స్ లో పాస్ అవ్వాలి అనే కండిషన్ చాణక్య వర్మ పెడతాడు. ఈ విషయంలో ప్రసాద్ తో సరస్వతికి కూడా గొడవయి తన కొడుకు మ్యాథ్స్ ని పట్టుదలగా తీసుకుంటుంది. ప్రసాద్ మళ్ళీ స్కూల్ కి వచ్చాడా? మ్యాథ్స్ లో పాస్ అయ్యాడా? టెన్త్ ఫెయిల్ అయిన సరస్వతి కొడుకు మ్యాథ్స్ కోసం ఏం చేసింది? భర్తనే దైవంగా కొలిచే సరస్వతి భర్తతో ఎందుకు గొడవపెడుతుంది? తిరుపతిలో వాళ్ళ జీవితం ఎలా ఉంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Committee Kurrollu : ‘కమిటీ కుర్రోళ్ళు’ ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పట్నించి? స్ట్రీమింగ్ ఎక్కడ?
సినిమా విశ్లేషణ.. చిన్నప్పుడు చాలా మందికి లెక్కల్లో డౌట్లు, లెక్కలు అంటే భయం ఉంటుంది. దాన్ని మెయిన్ పాయింట్ గా తీసుకొని లెక్కలు అర్ధం కాని ఒక స్టూడెంట్ చుట్టూ కథని అందంగా అల్లుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అరుణ్ కుటుంబం, అరుణ్ స్కూల్ లో కామెడీ, అరుణ్ లెక్కల డౌట్లతో సరదాగానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్ గా మారుతుంది. కొడుకు కోసం తల్లి పడే తపన, లెక్కలు రాక అరుణ్ పడే బాధలు, వీళ్ళిద్దరూ కలిసి లెక్కల్ని ఎలా సాధించారు అని ఎమోషనల్ గా సాగుతుంది.
తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత్రలు అన్ని చక్కగా రాసుకున్నారు. స్కూల్స్ జరిగే సంఘటనలు, ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అంటూ బాగా చూపించారు. అయితే కథ అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. కామెడీ కూడా పిల్లలతో బాగానే చేయించి నవ్వించారు. అదే పిల్లలతో ఎమోషన్ కూడా పండించి మెప్పించారు. మొదటి బడి తల్లి ఒడే అంటూ తల్లి ఎమోషన్ ని బాగా పండించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో ముఖ్యంగా నివేదా థామస్, అరుణ్ గురించి చెప్పుకోవాలి. బ్రాహ్మణ కుటుంబంలో ఉండే మిడిల్ క్లాస్ గృహిణిగా నివేద థామస్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. కొడుకు కోసం తల్లి పడే తపన, పతిని దైవంగా చూసే భార్య పాత్రలో ప్రేక్షకులని మెప్పించింది. నివేదా తప్ప ఈ పాత్ర ఇంకెవ్వరు చేయలేరని చెప్పొచ్చు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ లెక్కలు అర్ధం కాక, తనని ఎవరు పట్టించుకోక సతమతం అయ్యే పాత్రలో మంచి ఎమోషన్ పండించాడు. కొన్ని సీన్స్ లో అరుణ్ ని చూస్తే మనం ఏడ్వాల్సిందే. ప్రియదర్శి మ్యాథ్స్ టీచర్ పాత్ర చూసిన తర్వాత కచ్చితంగా ఆ పాత్రని మనం తిట్టుకుంటాం. విశ్వదేవ్ తండ్రి పాత్రలో, కృష్ణ తేజ అరుణ్ మామగా, TTD పర్సన్ గా, గౌతమి, ప్రినిసిపాల్ గా భాగ్యరాజా, చైల్డ్ ఆర్టిస్టులు అభయ్ శంకర్, అనన్య.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ అందంగా చూపించారు. సాంప్రదాయ సంగీతంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మెప్పించారు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ లో ఇంకొంచెం కట్ చేయాల్సింది. సింపుల్ కథని, సింపుల్ స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ గా చెప్పడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు. లొకేషన్స్ పరంగా తిరుమల, తిరుపతిలోని చాలా లొకేషన్స్ ని రియల్ గా చూపించారు.
మొత్తంగా ’35 చిన్న కథ కాదు’ సినిమా చిన్న పిల్లలకు చదువు ఎలా చెప్పాలి, వారికి చదువుపై ఎలా ఆసక్తి కలిగించాలి అని ఫ్యామిలీ డ్రామాతో కామెడీ ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.