14 Movie Review : ’14’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

సస్పెన్స్ రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ గా 14 సినిమా తెరకెక్కింది.

14 Movie Review : ’14’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Noel Sean Visakha Dimin 14 Movie Review and Rating

14 Movie Review : రామ్ రతన్, విషాక ధీమాన్ జంటగా తెరకెక్కిన సినిమా ’14’. రాయల్ పిక్చర్స్ బ్యానర్ పై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చనమెట్ల నిర్మాణంలో లక్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ 14 సినిమా తెరకెక్కింది. నోయల్, పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ మహేష్, రూపా లక్ష్మీ, లోహిత్.. పలువురు ముఖ్య పాత్రలుపోషించారు. సస్పెన్స్ రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. 14 సినిమా నేడు జూన్ 5న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. రతన్(రామ్ రతన్ రెడ్డి) ముఖ్యమంత్రి(పోసాని కృష్ణ మురళి) కొడుకు. సరదాగా తిరుగుతూ లైఫ్ గడిపేస్తున్న రతన్ కి జూనియర్ డాక్టర్ నేహా(విషాక ధీమాన్)తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి రొమాంటిక్ లైఫ్ గడుపుతుంటారు. అనుకోకుండా ఓ రోజు నేహా ఫ్లాట్ లో రతన్, నేహా చనిపోయి ఉంటారు. పోలీసులు ఇది ఆత్మహత్యగా కేసు నమోదు చేస్తారు. అయితే జర్నలిస్ట్ సుబ్బు(శ్రీకాంత్ అయ్యంగార్) వీళ్లది ఆత్మహత్య కాదు హత్య అని తన మిత్రులతో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇంతకీ ఆ ఇద్దరు ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? పోలీసులు కేసు క్లోజ్ చేసినా జర్నలిస్ట్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? సీఎం తన కొడుకు చనిపోతే ఏం చేసాడు? డిటెక్టివ్ నోయల్ ఈ కేస్ లో ఏం చేసాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బాగానే నడుస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందింది. అయితే ఈ 14 సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా రొమాంటిక్ కూడా. సినిమా మొదట్లో కాసేపు బోర్ కొట్టినా కథలోకి వెళ్ళాక ఆసక్తిగా సాగుతుంది. మర్డర్ మిస్టరీతో కథ మొదలవుతుంది. హీరో – హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్ కి కథ అయిపొయింది కదా, సెకండ్ హాఫ్ లో ఇంకేమి చూపిస్తారు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో కథని ఇంకో కోణాల్లో చూపించి మరింత ఆసక్తిగా తెరకెక్కించారు.

అయితే ఈ సినిమాలో ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అప్పుడప్పుడే వయసుకు వస్తున్న యువకులు ఎలా ఉంటారు? టెక్నాలజీకి అలవాటయి ఏం చేస్తున్నారు? తల్లితండ్రులు ఇలాంటి పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అని ఓ మెసేజ్ కూడా పేరెంట్స్ కి ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా యుక్త వయసు పిల్లలు ఉన్న పేరెంట్స్ చూడాలి. ఇక సినిమాకి 14 అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్.. కొత్త హీరో రతన్ పర్వాలేదనిపించాడు. విషాక రొమాంటిక్ సన్నివేశాల్లో బాగానే నటించి అందాలు ఆరబోసింది. ఈ జంట రొమాంటిక్ సీన్స్ కి పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యారు. ఇక నోయల్ డిటెక్టివ్ పాత్రలో మెప్పించాడు. సీఎం పాత్రలో పోసాని, జర్నలిస్ట్ గా శ్రీకాంత్ అయ్యంగార్, రూపా లక్ష్మి, లోహిత్.. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ తీసేసి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ చేసి ఉండాల్సిందే. ఇది కొత్త కథే అయినా పాత కథనాన్ని సరికొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ లో చూపించారు. ఈ విషయంలో దర్శకుడు లక్ష్మి శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై చూస్తుంటే తెలుస్తుంది.

మొత్తంగా 14 సినిమా ఓ మంచి మెసేజ్ తో ఉన్న రొమాంటిక్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ నచ్చేవాళ్లు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.