MAA Elections: ‘మా’ ఎన్నికలు.. రేపే పోలింగ్.. రేపే కౌంటింగ్.. 8గంటల్లోపు విజేత ప్రకటన!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై జరగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Maa Elections
MAA Elections: గత నాలుగైదు నెలలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై జరగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తరంగా మారిన ‘మా’ ఎన్నికలు కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తుండగా.. రెండు ప్యానెల్స్‌లో ఆర్టిస్టులు హోరాహోరీగా ప్రచారం సాగించారు.
ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. లేటెస్ట్‌గా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ‘మా’ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు “మా” ఎన్నికల సహాయాధికారి నారాయణరావు. పోటీలో ఉన్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌కు పోలింగ్ ఏర్పాట్లను ఈ సంధర్భంగా వివరించారు మా ఎన్నికల సహాయాధికారి నారాయణరావు.
రేపు(10 అక్టోబర్ 2021) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘మా’ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మా ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగనుంది. సాయంత్రం 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా నారాయణరావు ప్రకటించారు.