ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్  : టాప్ లో  ‘ది ఫేవరెట్‌’, ‘రోమా’

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 06:21 AM IST
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్  : టాప్ లో  ‘ది ఫేవరెట్‌’, ‘రోమా’

ఫిబ్రవరి 24న లాస్‌ ఏంజెలిస్‌లో ఆస్కార్‌ వేడుకలు
అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలుగా ‘ది ఫేవరేట్‌’, ‘రోమా’ 
8 నామినేషన్లతో తర్వాతి స్థానాల్లో ‘ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘వైస్‌’
ఆస్కార్‌ ఉత్తమ చిత్రం విభాగంలో తొలి సూపర్‌ హీరో చిత్రం ‘బ్లాక్‌ పాంథర్‌’

 అమెరికా :  ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల కోసం ఈ ఏడాది బరిలో నిలిచేదెవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఆస్కార్‌ అకాడమీ నామినేషన్ల తుది జాబితాను ప్రకటించింది. అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రాలుగా ‘ది ఫేవరెట్‌’, ‘రోమా’ నిలిచాయి. వాటికి ఉత్తమ చిత్రం సహా చెరో పది నామినేషన్లు దక్కాయి. తర్వాతి స్థానాల్లో ఎనిమిది నామినేషన్లతో ‘ఏ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’, ‘వైస్‌’,  ఏడు నామినేషన్లతో ‘బ్లాక్‌ పాంథర్‌’ నిలిచాయి. సూపర్‌ హీరో చిత్రం ‘బ్లాక్‌ పాంథర్‌’ చరిత్ర సృష్టించింది. ఆస్కార్‌ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ అందుకున్న తొలి సూపర్‌ హీరో చిత్రంగా ప్రత్యేకత చాటుకుంది. అదే విభాగంలో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. థియేటర్లలో కాకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే విడుదలైన ఓ చిత్రం ఈసారి బరిలో నిలిచింది… అదే నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘రోమా’. ఉత్తమ నటుడి పురస్కారం కోసం క్రిస్టియన్‌ బాలె, బ్రాడ్లీ కూపర్‌, విలియం డఫో, రమీ మలెక్‌, విగ్గొ మార్టెన్‌సెన్‌ పోటీపడనున్నారు. ఉత్తమ నటిగా యలిట్జా అపరిసియొ, గ్లెన్‌ క్లోజ్‌, ఒలివియా కొల్‌మన్‌, లేడీ గాగా, మెలిస్కా మెక్‌ కెర్తీ బరిలో నిలిచారు. 91వ ఆస్కార్‌ వేడుక ఫిబ్రవరి 24న లాస్‌ ఏంజెలిస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఆఫ్రికన్‌ అమెరికన్‌ నటుడు కెవిన్‌ హార్ట్‌ వ్యవహరించనున్నారు.