Pawan Kalyan : పవన్ సీరియస్.. థియేటర్ల ఆదాయం ఎంత? పన్నులు కడుతున్నారా? లెక్కలు బయటకు తీయండి.. మల్టీప్లెక్స్ లు ఎన్ని ఉన్నాయి?
ఈ నేపథ్యంలో థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ ల గురించి ప్రస్తావించారు.

Pawan Kalyan Serious on Movie Theaters and Multiplex Theaters
Pawan Kalyan : గత కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్స్ వివాదాల నేపథ్యంలో తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయినట్టు ఉన్నారు. నేడు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు, థియేటర్స్ కు సీరియస్ గా ఒక లెటర్ ని విడుదల చేసారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ఆదాయం లెక్కలు, మల్టీప్లెక్స్ ల గురించి ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన లేఖ ప్రకారం..
ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను చర్చించారు.
థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని పవన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన ప్రత్యేకంగా చర్చించారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని చెప్పారు.
అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో – సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీలు చేయించనున్నారు. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు హోమ్ శాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.
అలాగే.. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగారు. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర పెద్ద నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారించనున్నారు. మరి దీనిపై థియేటర్స్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తారో చూడాలి.