Mass Maharaju: మినీ మల్టీస్టారర్‌గా “మాస్ మహారాజు”.. షూటింగ్ ప్రారంభం

యంగ్ హీరో రాజ్ తరుణ్, “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ కాంబినేషన్‌లో క్రేజీ మినీ మల్టీస్టారర్ పట్టాలెక్కింది.

Mass Maharaju: మినీ మల్టీస్టారర్‌గా “మాస్ మహారాజు”.. షూటింగ్ ప్రారంభం

Mass Maharaju

Updated On : October 10, 2021 / 8:36 PM IST

Mass Maharaju: యంగ్ హీరో రాజ్ తరుణ్, “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ కాంబినేషన్‌లో క్రేజీ మినీ మల్టీస్టారర్ పట్టాలెక్కింది. “మాస్ మహారాజు” అనే టైటిల్‌తో స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు(10 అక్టోబర్ 2021) రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమయ్యింది. ఎమ్. అసిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిమ్రత్ కౌర్, సంపద హీరోయిన్లుగా నటిస్తున్నారు. మినీ మల్టీస్టారర్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై దర్శకుడు వీరశంకర్ క్లాప్ కొట్టగా.. జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత సీ కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సి.హెచ్. సుధీర్ రాజు మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని, సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తుంటారో.. అలాగే సినిమాలో ఇద్దరు మిత్రులు ఒకరి కోసం ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథయని చెప్పారు. ఫ్రెండ్‌షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత ఎమ్. అసిఫ్ జానీ మాట్లాడుతూ.. ‘‘మొట్ట మొదటిగా నేను తీస్తున్న ఈ సినిమాకు అందరూ వచ్చి బ్లెస్ చేసినందుకు ధన్యవాదాలు. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. రాజా రవీంద్రగారు మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పడంతో ఈ రోజు సినిమా గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నాం. మేము తీస్తున్న ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.

హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత మంచి పవర్ ఫుల్ కథని డైరెక్టర్ సి.హెచ్. సుధీర్ రాజు చెప్పారని, కథ చాలా అద్భుతంగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పినట్లు చెప్పారు. అజయ్ విన్సెంట్ కెమెరామెన్‌గా, మణి శర్మ‌ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. మంచి టైమింగ్‌తో ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్‌లో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్‌తో తీస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత కలిసినప్పుడు సందీప్ కూడా నటిస్తున్నాడని చెప్పగానే సినిమా చాలా బాగుంటుందని సినిమాపై నమ్మకం వచ్చిందని అన్నారు. సినిమాను త్వరలో షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేసి, అంతే త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

హీరోయిన్లు సిమ్రత్ కౌర్, సంపద మాట్లాడుతూ.. ఈ సినిమాలో మాకు చాలా మంచి పాత్ర ఇచ్చారని, ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.