హైదరాబాద్‌లో తలైవా : అన్నాత్తే సినిమా షూటింగ్

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 08:48 AM IST
హైదరాబాద్‌లో తలైవా : అన్నాత్తే సినిమా షూటింగ్

Updated On : December 14, 2020 / 8:54 AM IST

Rajinikanth’s Annathe : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌ అందుకు తగ్గట్టుగా సినిమా పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం సగం వరకు షూటింగ్‌ జరుపుకున్న అన్నాత్తే సినిమాను ఫినీష్‌ చేసే పనిలో బిజగా ఉన్నారు. తమిళ సినిమా అన్నాత్తే షూటింగ్‌లో పాల్గొనేందుకు రజనీ హైదరాబాద్‌ వచ్చారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మాణంలో డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గతేడాది ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. కరోనా ముందు వరకు చకచకా షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌ కానుకగా తీసుకురావాలని చిత్ర నిర్మాతలు భావించారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.

రెండు నెలల కిందటే సినిమా షూటింగ్స్‌కు అనుమతులు వచ్చినా.. కరోనా విజృంభన… రజనీ వయస్సు , ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే షూటింగ్‌ ప్రారంభించలేదు. ప్రస్తుతం రేపో మాపో కరోనా వ్యాక్సిన్‌ వస్తుందన్న నమ్మకం, దగ్గర పడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌ ను మొదలుపెట్టారు. దీని కోసం చైన్నై నుంచి హైదరాబాద్‌కి ప్రత్యేక ఫ్లైట్‌లో రజనీ వచ్చారు.

ఈ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జనవరిలో కొత్త పార్టీ అంటూ రజనీకాంత్‌ తెలిపినప్పటి నుంచి.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు ఇలా నడుస్తుండగానే.. మళ్లీ తలైవా సినిమాల వైపు దృష్టి పెట్టడం విశేషం. ఎన్నికలకు ముందు ఒక సినిమా రిలీజ్‌ అయితే అభిమానులకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఊపు వస్తుందని రజనీ భావిస్తున్నారు.

డిసెంబర్ 15న తిరిగి పున:ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు శివసన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కళానిధి మారన్ నిర్మాత, డి ఇమ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మేలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.