అమ్మగా చెయ్యమన్నారు.. చెయ్యలేకపోయా: రేణూ దేశాయ్

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి సినిమాలతో కొత్తదనం ఉండే కథలను ఎంచుకుంటారు అని పేరు తెచ్చుకున్న నిర్మాత రాజ్ కందుకూరి.. తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘చూసీ చూడంగానే’.
లేడీ డైరెక్టర్ శేష సింధూ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగగా.. కార్యక్రమంలో నటి రేణుదేశాయ్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకనాటికి మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలి. ఏ ఫిమేల్ టెక్నీషియన్ అయినా హ్యాపీగా పని చేసుకోగల నైస్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు”.
“ఆయన నాకు ఈ సినిమాలో అమ్మ పాత్ర చెయ్యాలని కోరారు. ఆ పాత్ర కూడా నాకు చాలా నచ్చింది. అయితే నాకు ఒంట్లో బాగా లేకపోవడం కారణంగా చేయలేకపోయాను. తన తర్వాతి సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.