Santhana Prapthirasthu Review : ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ.. కూతురు – అల్లుడ్ని విడదీయడానికి ట్రై చేసే మామ..
సంతాన ప్రాప్తిరస్తు అనే టైటిల్ పెట్టి పిల్లలు పుట్టకపోవడం అనే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం గమనార్హం. (Santhana Prapthirasthu Review)
Santhana Prapthirasthu Review
Santhana Prapthirasthu Review : విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాణంలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నేడు నవంబర్ 14 థియేట్రికల్ గా రిలీజ్ అయింది.(Santhana Prapthirasthu Review)
కథ విషయానికొస్తే.. చైతన్య(విక్రాంత్) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఓ రోజు కళ్యాణి(చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఓ సంఘటనతో ఇద్దరూ మళ్ళీ కలవడంతో పరిచయం కాస్తా ప్రయాణంగా సాగి ప్రేమలో పడతారు. తన ప్రేమ కోసం హైదరాబాద్ – వరంగల్ ట్రిప్పులు వేస్తూ ఉంటాడు హీరో. అయితే ముందే కళ్యాణి నాన్న శంకర్ రావు(మురళీధర్ గౌడ్)తో చైతన్యకు ఓ ఇష్యూ జరుగుతుంది. వీళ్ళ ప్రేమ తెలిసిన శంకర్ రావు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు.
జాక్(తరుణ్ భాస్కర్) సలహాతో కళ్యాణి, చైతన్య లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుడితే శంకర్ రావు వస్తాడు అని భావిస్తారు. కానీ ఈ లోపే శంకర్ రావు కూతురు -అల్లుడు ఇంటికి వస్తాడు. కళ్యాణితో బాగానే ఉన్నా మిమ్మల్ని విడగొట్టి నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను అని చైతన్యకు వార్నింగ్ ఇస్తాడు శంకర్ రావు. అదే సమయంలో చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ అని తెలుస్తుంది. ఈ విషయం కళ్యాణికి చెప్పకుండా దాస్తాడు చైతన్య. మరి కూతురు – అల్లుడుని విడగొట్టడానికి శంకర్ రావు చేసిన ప్రయత్నాలు ఏంటి? చైతన్య – కళ్యాణిలకు పిల్లలు పుడతారా? అసలు చైతన్య – శంకర్ రావు మధ్య ఇష్యూ ఏంటి? వీళ్ళ లైఫ్ లో జాక్ ఎవరు? నాన్న చేసే ప్రయత్నాలు కళ్యాణికి తెలుస్తాయా? పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ అనే విషయం కల్యాణికి ఎలా తెలుస్తుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..
సినిమా విశ్లేషణ..
సంతాన ప్రాప్తిరస్తు అనే టైటిల్ పెట్టి పిల్లలు పుట్టకపోవడం అనే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం గమనార్హం. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ ప్రేమ, పెళ్లి, హీరో సాఫ్ట్ వేర్ ఆఫీస్ సీన్స్ తో సింపుల్ గా అక్కడక్కడా కొంత కామెడీ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి శంకర్ రావు కూతురు – అల్లుడిని విడగొట్టాలని ఛాలెంజ్ చేయడం, చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలియడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంది. సెకండ్ హాఫ్ ఈ పిల్లలు పుట్టారు అనే పాయింట్ నడిపిస్తునే నాన్న – భర్త మధ్యలో నలిగిపోయిన ఒక అమ్మాయి కథగా నడిపించారు.
దీంతో అసలు మెయిన్ కథ పక్కకు వెళ్ళిపోయి ఇంకో కథ నడుస్తుందేమో అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మధ్య నుంచి ఎమోషనల్ గా కథని నడిపించారు. క్లైమాక్స్ ముందు కొన్ని సీన్స్ లో కన్నీళ్లు రావడం ఖాయం. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉండే ప్రెజర్, వాటితో వచ్చే అలవాట్లతో చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని, పిల్లలు పుట్టకపోవడం సమస్యని ఫేస్ చేస్తున్నారని చెప్పాలనుకున్నారు కానీ అది సింపుల్ గా తేల్చేసారు. ప్రమోషన్స్ లో మాత్రం అదే హైలెట్ చేసారు.
పిల్లలు పుట్టకపోవడం అనే సీరియస్ పాయింట్ ని బయట జనాలు కామెడీగా ఎలా తీసుకుంటారు, దానిపై జోక్స్ వేయడం లాంటి సీన్స్ బాగానే రాసుకున్నారు. పిల్లలు పుట్టకపోవడం, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం లాంటి కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సంతాన ప్రాప్తిరస్తు కూడా అందులో ఒకటి. కాకపోతే కొత్తగా భర్త – నాన్న మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రను జతచేసారంతే. అయితే సినిమా అంతా వరంగల్, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తీయడంతో కొంతమందికి తెలంగాణ స్లాంగ్ పెట్టారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
చాలా ఫిట్ గా ఉండే విక్రాంత్ ఈ సినిమా కోసం లావుగా అవ్వడానికి, సీనియర్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా కనపడటానికి బాగానే కష్టపడ్డాడు. తన నటనతో కూడా మెప్పించాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి తన ప్రతి సినిమాకు నటిగా వ్యత్యాసం ఉండేలా చూసుకుంటుంది. ఇందులో కూడా తన నటనతో బాగానే మెప్పించింది.
మురళి ధర గౌడ్ కాస్త నెగిటివ్ షేడ్స్ తో పాటు కూతురి మీద అతి ప్రేమ ఉన్న తండ్రి పాత్రలో బాగానే మెప్పించారు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, జీవన్ కుమార్.. అక్కడక్కడా నవ్వించారు. హర్ష వర్ధన్, అనిల్ జీలా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. హీరోయిన్ రాశి సింగ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెరిపించింది.
Also Read : Love OTP Review : ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ.. వామ్మో గర్ల్ ఫ్రెండ్ టార్చర్ మాములుగా లేదుగా..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. చాలా మ్యూజిక్ ట్రాక్స్ ఎక్కడో విన్నామే, వేరే సినిమాల్లో ఉన్నాయిగా అనిపించడం ఖాయం. పాటలు యావరేజ్. ఎడిటింగ్ పరంగా కూడా కొన్ని సీన్స్ కట్ చేసి సాగదీత తగ్గిస్తే బాగుండేది. స్పెర్మ్ కౌంట్ తక్కువ, పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ అనే పాత పాయింట్ ని తీసుకొని లేచిపోయి వచ్చిన అమ్మాయి భర్త – నాన్న మధ్య పడే సంఘర్షణతో రాసుకున్నాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ మాత్రం బాగుంటాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కోసం. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
