Telugu Patriotic Songs : దేశ భక్తిని నింపే తెలుగు సినిమా పాటలు.. ఈ పాటలు ఎప్పుడు విన్నా రోమాలు నిక్క పొడుస్తాయి
తెలుగు సినిమాల్లో దేశ భక్తిని పెంపొందించే అద్భుతమైన పాటలు అనేకం ఉన్నాయి. ఏటా ఆగస్టు 15 రోజు కొన్ని పాటల్ని ప్రత్యేకంగా వింటూ ఉంటాం. అనేక మాధ్యమాల్లో చెవుల్లో మారుమోగుతుంటాయి. అలాంటి కొన్ని పాటలు మీకోసం.

Patriotic songs in Telugu movies
Patriotic songs in Telugu movies : ఆగస్టు 15 అనగానే తెలుగు సినిమా పాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్ పై ఎంతోమంది నటులు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో నటించారు. వారిపై చిత్రించిన పాటలతో పాటు దేశ భక్తిని రగిలించిన అనేక పాటలు ఉన్నాయి. ఓసారి వాటిని గుర్తు చేసుకుందాం.
Tricolour Food Recipes : ఆగస్టు 15 న త్రివర్ణంలో ఈ వంటకాలు ట్రై చేయండి
పాడవోయి భారతీయుడా
1961లో వచ్చిన ‘వెలుగు నీడలు’ సినిమాలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట చాలా ఫేమస్. ఈ పాటని శ్రీశ్రీ గారు రాసారు. ఘంటశాల, పి.సుశీల,మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత పాడారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ పాట ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో మారుమోగుతుంది. స్వాతంత్ర్యం రాగానే సభలు చేసి సంబరపడిపోతే సరిపోదని.. ప్రగతివైపు ముందుకు నడవమని హితబోధ చేస్తుంది ఈ పాట.
పుణ్యభూమి నా దేశం నమో నమామి
1993లో వచ్చిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట ఆగస్టు 15న వినిపిస్తుంది. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాటాన్ని, వారి తెగింపును గుర్తు చేస్తుంది ఈ పాట. జాలాది రచించిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. నందమూరి తారక రామారావు, మోహన్ బాబు తెరపై అలరించగా ఈ పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తాయి.
ఏ దేశ మేగినా ఎందు కాలిడినా
1987 లో వచ్చిన ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోని ‘ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా’ పాట చెప్పుకోదగ్గ పాట. డా.సి.నారాయణ రెడ్డి రచించిన ఈ పాటను పి.సుశీల పాడగ ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించారు. దేశాలు దాటి వెళ్లినా భారతభూమిని, భరతమాతను మర్చిపోకూడదని .. మనుష్యుల్లో కులమత విభేదాలు ఉండకూడదని ఈ పాట బోధిస్తుంది.
జయ జయ జయ ప్రియ భారత
1986 లో వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాలోని ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ’ .. దేశాన్ని తల్లిగా కీర్తిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన గీతం ఉర్రూతలూగిస్తుంది. ఎస్.జానకి పాడిన ఈ పాటకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
మతమేల గతమేల మనసున్న నాడు
1995 లో వచ్చిన ‘బొంబాయి’ సినిమాలోని ‘మతమేల గతమేల మనసున్న నాడు’ ఈ పాటను రెహ్మాన్ సంగీత సారథ్యంలో రెహ్మాన్, హరిహరన్ పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి ఈ పాట రాశారు. దేశంలో శాంతి నిలవాలని.. ప్రతి ఒక్కరూ భయంలేకుండా తలఎత్తి జీవించాలని ముందుకుసాగాలని ఈ పాట సూచిస్తుంది.
మేమే ఇండియన్స్
2002 లో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలోని ‘మేమే ఇండియన్స్’ పాట సగటు భారతీయుడి మనస్తత్వానికి అద్దం పడుతుంది. భారతీయుడి తెగువను చెబుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను హనీ పాడగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ జెండా పసిబోసి చిరునవ్వు రా
2002 లో వచ్చిన ‘బాబీ’ సినిమాలోని ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వు రా’ పాట జాతీయ జెండా గొప్పతనాన్ని చెబుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తుంది. శివశక్తి సాహిత్యానికి శంకర్ మహదేవన్ గళం అందించారు. మణిశర్మ సంగీతంలో ఈ పాట వింటుంటూ మనసులో దేశభక్తి నిండిపోతుంది.
ఓ బాపు నువ్వే రావాలి
2007 లో వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలోని ‘ఓ బాపు నువ్వే రావాలి’ అంటూ సాగే పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. దుర్మార్గాల్ని అణచడానికి బాపు నువ్వు మళ్లీ రావాలంటూ హీరో పాడే సందర్భంలోని ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
దేశమంటే
2010 లో వచ్చిన ‘ఝమ్మంది నాదం’ సినిమాలోని ‘దేశమంటే’ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం, చైత్ర అంబడిపూడి పాడారు.. దేశమంటే అసలు ఏంటనేది చెబుతూ రచయిత అద్భుతంగా దేశం గురించి చెప్తాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఇలా మరపురాని మరువలేని ఎన్నో దేశభక్తిని రగిలించే పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రతి భారతీయుడి మదిలో నిలిచిపోయాయి.