Swag : ‘స్వాగ్’ మూవీ రివ్యూ.. అయిదు పాత్రలతో శ్రీవిష్ణు నట విశ్వరూపం..

ఈ సినిమాలో శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో రకరకాల గెటప్పులతో నటించడం విశేషం.

Swag : ‘స్వాగ్’ మూవీ రివ్యూ.. అయిదు పాత్రలతో శ్రీవిష్ణు నట విశ్వరూపం..

Sree Vishnu Ritu Varma Swag Movie Review and Rating

Updated On : October 4, 2024 / 1:04 PM IST

Swag Movie Review : శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘స్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ హీరోయిన్‌. మీరా జాస్మిన్, సునీల్ , దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, రవిబాబు, గోపరాజు రమణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. స్వాగ్ సినిమా నేడు అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో రకరకాల గెటప్పులతో నటించడం విశేషం.

కథ విషయానికొస్తే.. పోలీసాఫీసర్ భవభూతి(శ్రీవిష్ణు) తన భార్య రేవతి(మీరా జాస్మిన్) ఓ సంఘటన వల్ల వదిలేసి వెళ్లిపోవడంతో ఆడవాళ్లు అంటే ద్వేషంగా ఉండే వ్యక్తిగా మారతాడు. అతని రిటైర్మెంట్ సమయంలో అతని పై లేడీ ఆఫీసర్ ఇతనికి రావాల్సిన పెన్షన్, PF ఆపేసిన సమయంలో ఇతనిది శ్వాగణిక వంశం అని, అతని వారసత్వ సంపద ఓ చోట భద్రంగా ఉందని లెటర్ వస్తుంది. ఇక సింగ(శ్రీవిష్ణు) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అతను ప్రేమించిన అమ్మాయి(దక్ష నగర్కర్)ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇతని తండ్రి ఎవరు అనే ప్రశ్న వస్తుంది. దీంతో ఇతనికి కూడా శ్వాగణిక వంశం, వారసత్వ సంపద గురించి లెటర్ వస్తుంది. అయితే ఆ సంపదని దక్కించుకోవాలంటే ఆ వంశం గుర్తు ఉన్న పలక ఉండాలి. అది మగాళ్లని అసహ్యంచుకునే అను(రీతూ వర్మ) దగ్గర ఉంటుంది. మరో వైపు ఆ సంపదను కాపలా కాచే వంశం దాని వారసుడు రాకపోతే సంపదని కైవసం చేసుకుందామని చూస్తూ ఉంటారు.

అసలు వీళ్లకు శ్వాగణిక వంశం, సంపద గురించి లెటర్స్ రాసింది ఎవరు? భవభూతి భార్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? సింగ నాన్న ఎవరు? ఆ సంపద కథేంటి? ఆ సంపద చివరికి ఎవరికి వెళ్ళింది? అను దగ్గరకు శ్వాగణిక వంశం పలక ఎలా వచ్చింది? అసలు శ్వాగణిక వంశం కథేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Kali Movie : ‘కలి’ మూవీ రివ్యూ.. కలిపురుషుడు వచ్చి..

సినిమా విశ్లేషణ.. ఈ కథ చాలా పెద్ద కథే, దానికి తోడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో అన్ని కథలను కలిపి అందంగా చెప్పడానికి డైరెక్టర్ హసిత్ గోలి నూరుశాతం కష్టపడ్డాడు. ఒకప్పుడు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంకి ఎలా మారారు, ఆడ, మగ సమానం అని వారితో పాటు హిజ్రాలు కూడా సమాజంలో సమానం అని చెప్పే కథ ఇది. దానికి వంశం అనే కాన్సెప్ట్, సంపద చేజిక్కించుకోవాలి అనే పాయింట్ జతచేసి ఎంటర్టైనింగ్ తో పాటు ఎమోషనల్ గా చెప్పారు. ఇందులో ఏకంగా నాలుగు కాలాల్లో జరిగే కథలను చూపించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే చాలా బలం. ప్రతి కథ, ప్రతి పాత్ర మొదలు, ముగింపు అన్ని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. సినిమాలో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఇవ్వడం కొసమెరుపు.

ఫస్ట్ పార్ట్ అంతా భవభూతి, సింగ కథలతో నడిపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో యయాతి కథ, శ్వాగణిక వంశం ఆరంభం భవభూతి రాజు కథ చూపించి ప్రీ క్లైమాక్స్ నుంచి ట్విస్టులు రివీల్ చేస్తూ సంపద కోసం నలుగురు రావడం, అక్కడ మంచి ఎమోషన్ ని రన్ చేయడం చూపించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం కాసేపు బోర్ కొట్టొచ్చు. ఇన్ని కథలని కలిపి ఇంత కష్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా కష్టమైన పనే. ఈ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకోక తప్పదు. ఈ సినిమాని శ్రీవిష్ణు తన భుజాల మీద మోశాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాతో శ్రీవిష్ణు హ్యాట్రిక్ కొట్టేస్తాడు.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాలో శ్రీ విష్ణు నటవిశ్వ రూపం చూపించాడు అని చెప్పొచ్చు. ఒక రకంగా తెలుగు కమల్ హాసన్ అన్నా తప్పులేదు. మహారాజు పాత్రలో, పోలీసాఫీసర్ పాత్రలో, యువకుడిగా, డ్యాన్సర్ గా, హిజ్రాగా ఇలా అయిదు పాత్రలతో పాటు ముసలివాడు, మిడిల్ క్లాస్ తండ్రి.. ఇలా అనేక గెటప్పులతో, ప్రతి పాత్రకు నటన, వాయిస్ వేరియేషన్స్, మేకప్ డిఫరెన్స్ తో అదరగొట్టేసాడు.

రీతూ వర్మ మహారాణిగా, ఫెమినిస్ట్ పాత్రలో బాగా నటించింది. చాలా ఏళ్ళ తర్వాత మీరా జాస్మిన్ డైరెక్ట్ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మీరా మహారాణిగా, లెక్చరర్ గా చాలా మంచి పాత్ర చేసి మెప్పించింది. రవిబాబుకు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మంచి కామెడీ పాత్ర పడింది. ఇక శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను, గోపరాజు రమణ, కిరీటి.. ఇలా అందరూ తమ పాత్రల్లో బాగా నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాకు శ్రీవిష్ణు కాకుండా స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. వివేక్ సాగర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. BGM సినిమాని చాలా చోట్ల ఎలివేట్ చేసింది. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి మూడు కాలాలలకు పాటలు డిజైన్ చేసి మెప్పించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా రాజుల కాలం సెటప్, సంపద సెటప్, వంశ వృక్షాల సెటప్ కోసం బాగా వర్క్ చేసారు. మేకప్ డిపార్ట్మెంట్ ని కూడా మెచ్చుకోవాలి. శ్రీవిష్ణుని అన్ని పాత్రల్లో పర్ఫెక్ట్ గా చూపించారు.

మంచి కథ తీసుకొని దానికి చాలా కష్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని సినిమాగా తీయడంతో డైరెక్టర్ హసిత్ గోలి 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక నిర్మాణ పరంగా ఈ సినిమాకు నిర్మాత విశ్వప్రసాద్ బాగానే ఖర్చుపెట్టారు. ఇలాంటి టిపికల్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాని బాగా ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

మొత్తంగా ‘స్వాగ్’ సినిమా సమాజంలో ఆడ, మగ, హిజ్రా అందరూ సమానమే అనే పాయింట్ ని నాలుగు కాలాల కథలతో ఎంటర్టైనింగ్ గా ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.