సినిమా ఫ్లాప్ అయితే నటీనటుల రెమ్యునరేషన్‌లో సగం నిర్మాతకు తిరిగివ్వాలి.. టాలీవుడ్‌లో చర్చ
ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ 4 కోట్లు, హరీశ్ శంకర్ రెండు కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్.
telugu film actors remuneration: ప్లాప్ సినిమాల నష్టాలను భరించేలా టాలీవుడ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతోందట.. లాభాలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు.. నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌ను బలి చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఐతే ఇకపై ఇలాంటి విమర్శలు వినిపించకూడదని టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో పరిశ్రమలో చర్చించి ప్రతి స్టార్ ఆ నిర్ణయాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ టాలీవుడ్‌లో చర్చకు కారణమైన ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం.
సినిమా అంటే సక్సెస్, ఫ్లాప్ రెండూ ఉంటాయి. నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లు విజయం, పరాజయం అత్యంత సహజం. ఐతే సినిమాలు విజయం సాధించినప్పుడు అందరికీ సంబరమే. నటీనటులతోపాటు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అంతా ఖుషీ అవుతుంటారు. కానీ, అదే సినిమా ఫ్లాప్ అయితే నష్టం అంతా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లే భరించాల్సివస్తోంది. ఈ కారణంతోనే చాలా మంది ఆర్థికంగా కుదేలయ్యారు. ఐతే ఇప్పుడు ఇలా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని టాలీవుడ్ పెద్దల్లో విస్తృత చర్చ జరుగుతోందని సమాచారం.
Also Read: అక్క నిర్మాణంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..
సినిమా విజయం అయితే ఎంజాయ్ చేస్తున్న నటీనటులు.. ఇకపై ఫ్లాప్ అయితే తమ రెమ్యునరేషన్‌లో సగం తిరిగి నిర్మాతలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఇదే సమయంలో డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి నిర్మాతలు బాధ్యత తీసుకోవాలని కండీషన్ కూడా పెడుతున్నారట. ఇలా చేస్తే నష్టం వచ్చినా అందరూ భరించడంతోపాటు నిర్మాత, డిస్టిబ్యూటర్‌లు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుకోవడం అవుతుందని అంటున్నారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ 4 కోట్లు, హరీశ్ శంకర్ రెండు కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్. దీంతో ఈ ప్రతిపాదనపై టాలీవుడ్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. త్వరలో నిర్మాతల మండలిలో చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.