Suryakantham : సూర్యకాంతం అంత్యక్రియలకు అప్పటి సినీ పెద్దలు వెళ్లలేదా?.. గొప్ప నటికి చివరి క్షణాల్లో..

తెలుగువారంతా ఎంతో అభిమానించే నటీమణి సూర్యకాంతం. గయ్యాళి పాత్రలతో ముద్రపడినా వెన్నలాంటి మనసున్న ఆమెను అందరూ అత్తా అని పిలుచుకుంటారు. అలాంటి గొప్ప నటీమణికి చివరి క్షణాల్లో అవమానం జరిగిందని చెబుతారు. అప్పటి తెలుగు సినీ పెద్దలు ఆమెను చివరి చూపు చూడకపోవడంపై ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.

Suryakantham : సూర్యకాంతం అంత్యక్రియలకు అప్పటి సినీ పెద్దలు వెళ్లలేదా?.. గొప్ప నటికి చివరి క్షణాల్లో..

Suryakantham

Updated On : October 28, 2023 / 2:07 PM IST

Suryakantham : సూర్యకాంతం ఈ పేరు చెబితే జనం హడలిపోతారు. కాదు కాదు ఈ పేరు పెట్టుకోవాలన్నా ఆలోచిస్తారు. గయ్యాళితనం అనే పదానికి అర్ధం సూర్యకాంతం అన్నంతగా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసిన గొప్ప నటీమణి సూర్యకాంతం. తెరపై కనిపించే సూర్యకాంతం.. తెర వెనుక సూర్యకాంతం పూర్తిగా భిన్నంగా ఉండేవారట. అందరితో కలుపుగోలుతనంగా ఉండే ఆ నటీమణి చనిపోతే అప్పట్లో ఇండస్ట్రీలోని పెద్దలు వెళ్లలేదని చెబుతారు. ఆమెకు చివరి క్షణాల్లో దక్కాల్సిన గౌరవం దక్కలేదని అంటారు.

Suryakantham : తెరపై దడదడలాడించిన గుండమ్మకు.. తెర వెనుక ఎన్నో కష్టాలు.. గయ్యాళి అత్తగారికి వందేళ్లు..

సూర్యకాంతం ఆ పేరు వినగానే అందరూ భయపడతారు. నిజానికి సూర్యకాంతం చాలా సున్నిత మనస్కురాలట. తెరపై కఠినమైన పాత్రల్లో కనిపించిన ఆమెను బయట చూసిన మహిళలు దగ్గరకు వెళ్లి పలకరించడానికి కూడా భయపడేవారట. షూటింగ్‌లో పాత్ర వరకూ కఠినమైన డైలాగులు చెప్పినా ఆ తర్వాత నొచ్చుకునేవారట. తనను మన్నించమని సీనియర్ నటుల్ని అడిగేవారట. అదంతా మీ పాత్ర మీరు కాదని వారంతా నచ్చచెప్పేవారట. సూర్యకాంతం చక్కని నటి మాత్రమే కాదు..వంటల్లో సిద్ధహస్తురాలు కూడా.. షూటింగ్ లో అందరికీ భోజనాలు వండి తెచ్చి మరీ కడుపు నింపేవారట.

సూర్యకాంతం చివరి సినిమా ఎస్పీ పరశురామ్. ఆ తరువాత కూడా ఆమె నటించాలని అనుకున్నా ఆరోగ్యం సహకరించలేదట. డయాబెటీస్ తో బాధపడుతూ ఇంటికి పరిమితం అయ్యారట. అయితే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలెవరు ఆమెను పట్టించుకోలేదని చెబుతారు. చివరి క్షణాల్లో ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా అప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పెద్దలు ఆమెను పరామర్శించడానికి కూడా వెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి. చివరికి ఆమె కన్నుమూసినా చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదట. ఒక గొప్ప తెలుగు నటీమణికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిగాయని చెబుతారు.

NTR 100 Years : ఎన్టీఆర్ మహానటి సావిత్రిని ఏమని పిలిచేవారో తెలుసా?

నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సూర్యకాంతంతో హాస్యంగా ‘నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది.. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు’ అని అంటూ ఉండేవారట. గుండమ్మ కథ సినిమాను ఇప్పటితరం దర్శకులు తీయడానికి సాహసం చేయలేకపోవడానికి కూడా కారణం ఒకటుంది. ఆ సినిమాలో ఇతర నటుల్ని రీప్లేస్ చేసే నటులు ఉన్నారేమో కానీ.. గుండమ్మ పాత్రను రీప్లేస్ చేసే నటీమణి లేకపోవడంతో ధైర్యం చేయలేక ఆ సినిమా తీసే ప్రయత్నం చేయలేదని అంటారు. అదీ సూర్యకాంతం నటన గొప్పతనం. సూర్యకాంతం నటనను భర్తీ చేసే నటీమణి భవిష్యత్ తరాల్లో కూడా ఎదురుపడకపోవచ్చు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె నటన.. ఆమె అత్త పాత్ర చిరస్మరణీయం.