They Call Him OG : ‘ఓజి’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రివ్యూ.. ఫ్యాన్స్ కి పండగే..(They Call Him OG)

They Call Him OG : ‘ఓజి’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..

They Call Him OG

Updated On : September 25, 2025 / 2:36 AM IST

They Call Him OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘దే కాల్ హిమ్ ఓజి'(They Call Him OG). DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మాణం సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్, తేజ్ సప్రూ, శుభలేఖ సుధాకర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలు ఉన్న OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు.(They Call Him OG)

కథ విషయానికొస్తే.. జపాన్ లో సమురాయ్ లకు, యుజికిలకు ఎప్పట్నుంచో గొడవలు ఉంటాయి. 1970లో యుజికిలు సమురాయ్ లందర్నీ అంతం చేస్తారు. కానీ అందులో ఒక పిల్లాడు గంభీర మాత్రం తప్పించుకొని సత్య దాదా(ప్రకాష్ రాజ్)తో ఇండియాకు వస్తాడు. గంభీర జపాన్ వాళ్ళ నుంచి సత్యదాదాని కాపాడి అతనికి రక్షగా ఉంటాడు. సత్య దాదా ముంబైలో పోర్ట్ కట్టి మంచి గ్యాంగ్ స్టర్ అవుతాడు. కానీ అనుకోకుండా గంభీర(పవన్ కళ్యాణ్) సత్య దాదాని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు.

1993లో ఓ RDX కంటైనర్ కోసం జిమ్మీ(సుదేవ్ నాయర్) సత్య దాదా రెండో కొడుకు(వెంకట్)ని చంపేయడంతో మళ్ళీ గొడవలు మొదలవుతాయి. జిమ్మీ తండ్రి ఎప్పట్నుంచో ఆ పోర్ట్ ని దక్కించుకోవాలని చూస్తాడు. జిమ్మీ అన్న ఒమీ బావు(ఇమ్రాన్ హష్మీ) డైరెక్ట్ గా ఆ RDX కోసం రంగంలోకి దిగడంతో సత్యదాదా, అతని మనుషులను భయపెట్టి చంపాలని చూస్తాడు. కానీ సత్యదాదా గంభీరని వెతుక్కుంటూ వెళ్తాడు. గంభీర అన్ని వదిలేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటాడు. మరి గంభీరా మళ్ళీ సత్యదాదా కోసం, ముంబై మంచి కోసం ముంబైకి తిరిగొస్తాడా? ముంబైలో గంభీరా అంటే ఎందుకు అందరికి భయం? గంభీరా ఎందుకు సత్యదాదాని వదిలేసి వెళ్ళాడు? సత్యదాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఎందుకు గంభీరాని చంపాలనుకుంటాడు? ఆ RDX కథేంటి? గంభీరా జపాన్ యుజికిలపై ప్రతీకారం తీర్చుకున్నాడా? గంభీర – కన్మణి ప్రేమ కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : OG Record : నార్త్ అమెరికాలో OG సరికొత్త రికార్డ్.. దేవర, పుష్ప 2 రికార్డులు బీట్ చేసి..

సినిమా విశ్లేషణ..

OG సినిమాకు భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ళ తర్వాత పవన్ ఫ్యాన్స్ రిలీజ్ కి ముందే ఆనందంలో ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కథలోకి డైరెక్ట్ గా గంభీరా రాకుండానే అందరూ గంభీరా గురించి చెప్తారు. ఆ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. మొదట జపాన్ సమురాయ్ ల కథతో సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, టైటిల్ కార్డు పవర్ ఫుల్ గా చూపించారు. పవన్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని అదిరిపోతాయి. సీన్ లో గంభీరా లేకపోయినా డైలాగ్స్ తోనే ఇచ్చే ఎలివేషన్స్ అదిరిపోతాయి. ఇంటర్వెల్ ముందు గంభీరా కథలోకి డైరెక్ట్ గా వస్తాడు. ఇంట్రో ఫైట్ ఓ రేంజ్ అనుకుంటే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ దానికి మించి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే ప్రేమ కథని సింపుల్ గా అందంగా చూపించారు.

గంభీరా ముంబై వస్తాడా? అసలు ఎందుకు వదిలేసి వెళ్ళాడు అని ప్రశ్నతో ఇంటర్వెల్ ఇస్తారు. ఫ్లాష్ బ్యాక్ సింపుల్ గానే ఉంటుంది. ఇక ముంబై తిరిగొచ్చాక గంభీరా యాక్షన్స్, ఎలివేషన్స్ అన్ని అదిరిపోతాయి. మధ్యలో కొన్నాళ్ళు జపాన్ లో ఏం చేసాడు అనేది వేరే లెవల్. అది చాలా స్టైలిష్ గా క్లైమాక్స్ లో చూపించి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోతే ఫాదర్ ఎమోషన్ కూడా మెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ మొదటి సారి తండ్రి పాత్రలో మంచి ఎమోషన్ పండించాడు. అందరూ ఊహించినట్టే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సాహో సినిమాకి లింక్ చేయడం బాగుంటుంది. పవన్ కి ఇచ్చే ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ కే ఫ్యాన్స్ కి కడుపు నిండిపోతుంది. సెకండ్ హాఫ్ బోనస్. జానీ, తమ్ముడు సినిమాల రిఫరెన్స్ ఫ్యాన్స్ కి పండగే.

అయితే అందరూ ముందే అనుకున్నట్టే కన్మణి పాత్ర చనిపోవడం రొటీన్. పవన్ రాజకీయాల బిజీ వల్ల డేట్స్ తనకు కుదిరినప్పుడు ఇవ్వడంతో కొన్ని సీన్స్ లో లుక్స్ వేరియేషన్స్ కనిపిస్తాయి. హరిహర వీరమల్లులో ఇది బాగా కనిపిస్తుంది కానీ ఇందులో సుజీత్ కవర్ చేయడానికి బాగా కష్టపడ్డాడు. తండ్రి ఎమోషన్ ఇంకాస్త పండితే బాగుండు అనిపిస్తుంది.

OG Review

నటీనటుల పర్ఫార్మెన్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాన్నాళ్ల తర్వాత తన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఫ్యాన్స్ అయితే మా పవన్ కళ్యాణ్ ని ఇలా కదా చూడాలి అనుకున్నది అని అనుకోవడం ఖాయం. 80s బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు పవన్. ప్రియాంక మోహన్ కనిపించింది కాసేపే అయినా క్యూట్ గా సింపుల్ లుక్స్ తో భార్య పాత్రలో చక్కగా అలరించింది. ప్రకాష్ రాజ్ మంచి దాదా పాత్రలో ఒదిగిపోయారు.

శ్రియరెడ్డి పాత్ర నిడివి తక్కువైనా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ షేడ్స్ లో స్టైలిష్ లుక్స్ తో అలరిస్తాడు. గంభీరా చిన్నప్పటి పాత్ర చేసిన అబ్బాయి కూడా బాగా నటించాడు. సుదేవ్ నాయర్ నెగిటివ్ పాత్రలో బాగా మెప్పించాడు. అర్జున్ దాస్ రెండు వేరియేషన్స్ లో బాగానే అలరించాడు. హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, తేజ్ సప్రూ, అభిమన్యు సింగ్, సౌరవ్ లోకేష్, శుభలేఖ సుధాకర్.. పలువురు కీలక పాత్రల్లో మెప్పించారు. సుహాస్, శుభశ్రీ, ఒకప్పటి హీరో వెంకట్.. గెస్ట్ పాత్రల్లో బాగానే సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులు అందరూ వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.(They Call Him OG)

Also See : OG Movie Stills : పవన్ కళ్యాణ్ OG సినిమా HD పోస్టర్స్ మీ కోసం..

సాంకేతిక అంశాలు..

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా చెక్కారు. ముఖ్యంగా రాత్రి పూట జరిగే సీన్స్ పర్ఫెక్ట్ లైటింగ్స్ తో విజువల్ గా చాలా బాగా చూపించారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. ప్రతి సీన్ ని తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. థియేటర్స్ లో ఆ మ్యూజిక్ కి ఫ్యాన్స్ కి పూనకాలే. పాటలు కూడా బాగున్నాయి. సినిమా అంతా డార్క్ మోడ్ లో పర్ఫెక్ట్ లైటింగ్ సెట్ చేసారు.

ఎడిటింగ్ అయితే అదిరిపోయింది, కొత్తగా అనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిజైనర్స్ ని ప్రత్యేకంగా మెచ్చుకోవలసిందే. 1990 ల్లో ముంబై అలాగే ఉండేదేమో అన్నట్టు రియాల్టీగా చూపించారు ఆర్ట్ డిపార్ట్మెంట్. ఇక పవన్, ఇమ్రాన్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్స్ గా సరికొత్త కాస్ట్యూమ్స్ లో చాలా బాగా చూపించారు. బేసిక్ కథ మూలం భాష స్టైల్ పాతదే అయినా కొత్త అంశాలు జోడించి కొత్త ట్రీట్మెంట్ తో సరికొత్త స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు సుజీత్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.

మొత్తంగా ‘ఓజి’ సినిమా జపాన్, ముంబై బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ ఎమోషన్ తో కూడిన ఓ గ్యాంగ్ స్టర్ కథ. పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..