మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది.. సినీగేయ రచయిత వెన్నెలకంటి ఇకలేరు!

Tollywood lyricist Vennelakanti Rajeswara Prasad Passes away : మహార్షి మూవీలో మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది నుంచి అల్లరి ప్రియుడులో ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా.. ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా.. అప్పటి బృందావనం మూవీలో ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని.. చెట్టు కింద ప్లీడర్ లో అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కధలా రావే.. మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే.. ఇలా అనేక సూపర్ డూపర్ హిట్ పాటలు. ఇలా ఏ పాట విన్న ఎంతో హాయిని కలిగించే మధురమైన పాటలివి.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండే ఈ పాటలన్నీ వెన్నెలకంటి కలం నుంచి జాలువారినవే.. ఎన్నో పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడిక లేరు.
చెన్నైలో మంగళవారం ఆయన హఠాన్మరణం చెందారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో వెన్నెలకంటి తుదిశ్వాస విడిచారు. వెన్నెల కంటి పూర్తి పేరు.. వెన్నెలకంటి రాజేంద్ర ప్రసాద్.. 11 ఏళ్ల వయస్సులోనే ‘భక్త దు:ఖనాశ పార్వతీశ’ మకుటంత శతకం రాశారు. శ్రీరామచంద్రుడు మూవీతో ఆయన గీత రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాయడంలోనూ డైలాగ్ రైటర్ గా వెన్నెలకంటి ప్రసిద్ధి చెందారు.
దాదాపు 2000 పాటలు రాసి సినీ అభిమానుల్ని అలరించారు. నెల్లూరుకి చెందిన వెన్నెలకంటి సినీ ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి.. ఈయన కూడా సినీ రచయిత కాగా.. రెండవ కుమారుడు రాకెందు మౌళి. వెన్నెల కంటి మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి.
వెన్నెల కంటి మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశారు. బాల సుబ్రమణ్యం, కమల్ హాసన్ తో వెన్నెలకంటికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2020లో విడుదలైన కీర్తి సురేశ్ పెంగ్విన్ మూవీలో ప్రాణమే.. నా ప్రాణమే పాట కూడా వెన్నెల కంటి రాశారు.