Re Release Movies : కొత్త సినిమాలను తొక్కేస్తున్న రీ రిలీజ్ సినిమాలు.. డైరెక్ట్ గానే చెప్తున్న నిర్మాతలు..

అసలే థియేటర్లకి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ భావిస్తుంది.

Re Release Movies : కొత్త సినిమాలను తొక్కేస్తున్న రీ రిలీజ్ సినిమాలు.. డైరెక్ట్ గానే చెప్తున్న నిర్మాతలు..

Tollywood Producers Disappointing on Re Release Movies Effects on New Movies

Updated On : June 1, 2025 / 5:03 PM IST

Re Release Movies : రీ రిలీజ్ ఫిలిమ్స్ కొత్త సినిమాలను తొక్కేస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఒకప్పుడు హిట్ అయిన పాత సినిమాలు హీరోల పుట్టినరోజులకు, ఆ సినిమా రిలీజ్ అయి ఇన్ని సంవత్సరాలయింది అని చెప్పడానికో రిలీజ్ చేసేవాళ్ళు. ఫాన్స్ తమ హీరోల సినిమాలను థియేటర్లో మళ్ళీ చూసేందుకు ఎగబడడంతో దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది రెగ్యులర్ గా పాత సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు రీ రిలీజ్ కేవలం నిర్మాతలు తాము నిర్మించిన సినిమాలను చేసేవారు. కానీ ఇప్పుడు మధ్యలో థర్డ్ పార్టీ ఉండి పాత సినిమాలను కొంత డబ్బు పెట్టి కొనుక్కొని ఫాన్స్ కోసం రిలీజ్ అంటూ ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ చేసి రీ రిలీజ్ వాల్యూ పోగొడుతున్నారు.

ఏకంగా ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చేసారు. మాకు డబ్బులు అవసరం అయినప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తామని స్వయంగా ఓ అగ్ర నిర్మాత మీడియా ముందు అన్నారు. దీంతో ఫాన్స్ బలహీనతను క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి సినిమాలు లేని సమయంలో రీ రిలీజ్ చేస్తే, ఏదైనా స్పెషల్ డేస్ లో చేస్తే తప్పులేదు కానీ ఇటీవల ప్రతి శుక్రవారం ఒక రీ రిలీజ్ సినిమా ఉంటుంది. దీంతో వస్తున్న కొత్త సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది.

Also Read : Dil Raju : శతమానం భవతి సీక్వెల్, ఆర్య 3.. రెండు సినిమాలు ఆ హీరోతోనే చేయనున్న దిల్ రాజు..?

అసలే థియేటర్లకి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ భావిస్తుంది. జనాలు కూడా ఓటీటీలకు, పైరసీకి అలవాటు పడి, టికెట్ రేట్లు పెరగడంతో థియేటర్లకు తగ్గించేశారు. స్టార్ హీరోల సినిమాలైతే తప్ప లేదా సినిమా సూపర్ ఉంది అనే టాక్ వస్తే తప్ప థియేటర్స్ కి వెళ్లట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాలు రిలీజ్ ఉన్న రోజే పాత సినిమాలు రిలీజ్ చేసి కొత్త సినిమాలు చంపేస్తున్నారు అని అంటున్నారు.

ఇటీవల భైరవం సినిమా రిలీజ్ అయింది. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది కానీ అదే రోజు మహేష్ బాబు ఖలేజా సినిమాని రీ రిలీజ్ చేశారు దీంతో భైరవం సినిమాకు ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. మంచు మనోజ్ డైరెక్ట్ గా దీనిపై స్పందిస్తూ రీ రిలీజ్ లు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కాకుండా వీక్ డేస్ లో పెట్టుకోవాలని, అలా అయితేనే బాగుంటుందని అన్నారు. మన టాలీవుడ్ పాత సినిమాలు రిలీజ్ చేసి మన కొత్త సినిమాలనే తొక్కేస్తున్నారు అని అన్నారు. ఆ సినిమా నిర్మాత కూడా ఖలేజా సినిమా వల్లే మా సినిమాకి ఎఫెక్ట్ అయిందని అన్నారు.

Also Read : Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..

అది కూడా ఒకరకంగా నిజమేనేమో. ఖలేజా సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. రీ రిలీజ్ లో ఖలేజా సినిమా మొదటి రోజే ఎనిమిది కోట్లు సంపాదించింది. ఒకవేళ ఖలేజా సినిమా లేకుంటే భైరవం సినిమాకు అంత మంది వెళ్లకపోయినా అందులో ఒక పది శాతం అయినా వెళ్లే వాళ్ళని అంచనా వేస్తున్నారు. ఇలాగే ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నప్పుడు పాత సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్స్ దొరక్క ఒక వైపు, మరో వైపు జనాలు కొత్త సినిమాలు కి రాక టాలీవుడ్ ని ఇంకా అగాధంలోకి నెట్టేసి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనిపై కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తే మంచిది అని అంటున్నారు. ఇవాళ భైరవం సినిమా యూనిట్ డైరెక్ట్ గా చెప్పారు, అంతకు ముందు కూడా కొన్ని చిన్న సినిమా వాళ్ళు రీ రిలీజ్ ల వల్ల మాకు ఎఫెక్ట్ అయిందని మీడియా ముందు అన్నారు. థియేటర్స్ కి జనాలు రాకపోవడానికి కారణమైన రీ రిలీజ్ లపై కూడా ఫిలిం ఛాంబర్ ఫోకస్ చేస్తుందేమో చూడాలి.