Tollywood Sankranthi : ఈ సంక్రాంతి టాలీవుడ్ విన్నర్ ఎవరు? ఏ సినిమా ఎలా ఉంది..? ఫుల్ రిపోర్ట్..
చివరి నిమిషంలో పోటీ నుంచి తమిళ్ డబ్బింగ్ సినిమాలు తప్పుకున్నా తెలుగు సినిమాలే చాలా ఉన్నాయి.(Tollywood Sankranthi)
Tollywood Sankranthi
- టాలీవుడ్ సంక్రాంతి
- బరిలో అయిదు సినిమాలు
- ఏ సినిమా ఎలా ఉంది
Tollywood Sankranthi : తెలుగు వాళ్లకు సంక్రాంతి అంటే పెద్ద పండగ. అంతే కాకుండా సినిమాల పండగ. ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి హాలిడేస్ లో కచ్చితంగా సినిమాలకు వెళ్తారు. దీంతో సంక్రాంతికి తమ సినిమాని తీసుకురావాలని స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ అనుకుంటారు. ఈ 2026 సంక్రాంతికి కూడా పెద్ద పోటీనే జరిగింది. చివరి నిమిషంలో పోటీ నుంచి తమిళ్ డబ్బింగ్ సినిమాలు తప్పుకున్నా తెలుగు సినిమాలే చాలా ఉన్నాయి.(Tollywood Sankranthi)
2026 సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్ సినిమా, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా, నవీన్ పోలిశెటీ అనగనగా ఒక రాజు సినిమా, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు.. ఇలా ఏకంగా ఎప్పుడు లేనట్టు అయిదు తెలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.
Rajasaab
మొదట జనవరి 9న రాజాసాబ్ సినిమా రిలీజయింది. ముందు నుంచి హారర్ సినిమా అని ప్రమోట్ చేసారు. కానీ సినిమా చూస్తే అది సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. పండక్కి అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో వస్తారు. అసలు రాజాసాబ్ పండగ సినిమానే కాదు కానీ పలు మార్లు వాయిదా పడటంతో సంక్రాంతికి రావాల్సి వచ్చింది. ప్రీమియర్స్ విషయంలో ఫెయిల్ అవ్వడం, ప్రమోషన్ చేసిన కంటెంట్ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదని దర్శకుడే స్వయంగా చెప్పాడు రాజాసాబ్ సినిమా గురించి. కాకపోతే ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత కామెడీ చేయడం, ప్రభాస్ స్టామినాతో ఇప్పటివరకు 200 కోట్లకు పైగా మినిమమ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇవి ప్రభాస్ రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ అయితే కావు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో సింపుల్ గా నడిపించినా సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ గేమ్ తో, ప్రభాస్ నటనతో సైకలాజికల్ థ్రిల్లర్ గా మెప్పిస్తారు.

Mana Shankara Varaprasad Garu
జనవరి 12న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చారు. అనిల్ రావిపూడి సినిమా కావడం, వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడం, కామెడీ సినిమా కావడం, పాటలు హిట్ అవ్వడం, సినిమా రిలీజ్ కి ముందే చిరంజీవి డ్యాన్స్ వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఫ్యామిలీలు అంతా సంక్రాంతికి చిరంజీవి సినిమాకు క్యూ కట్టాయి. సినిమా కూడా నవ్వించి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా ఫుల్ గా మెప్పించింది. ఇంకేముంది ఊళ్ళల్లో పండక్కి ఫ్యామిలీలు అన్ని కదిలి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల టికెట్స్ కూడా దొరకడం లేదంటే ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. చక్కగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు వింటేజ్ చిరంజీవి గుర్తొచ్చి కామెడీ, సాంగ్స్, డ్యాన్స్ అన్ని ఎంజాయ్ చేస్తాము. చివర్లో వెంకటేష్ వచ్చి ఓ 20 నిముషాలు రచ్చ చేసి సినిమాని మరింత పైకి లేపాడు.

Bhartha Mahasayulaku Wignyapthi
ఇక గత కొంతకాలంగ ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ ఈ సారి సంక్రాంతికి పండక్కి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వచ్చాడు. సినిమా అక్కడక్కడా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంత బోర్ కొట్టినా ఇంటర్వెల్ ముందు నుంచి సెకండ్ హాఫ్ వరకు భార్య, బయట ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ అదరగొట్టాడు. అయితే కామెడీ ఉన్నా అక్కర్లేకపోయినా ఆషికా రంగనాథ్ తో అందాల ఆరబోత బాగా చేయించారు. రవితేజ పాత సినిమాల ఎఫెక్ట్ దీని మీద పడిందేమో సినిమా పర్వాలేదనిపించినా, కాస్త నవ్వించినా థియేటర్స్ కి మాత్రం అనుకున్నంత జనాలు రావట్లేదు. మూవీ యూనిట్ ఇప్పటివరకు కలెక్షన్స్ ని ప్రకటించకపోవడం గమనార్హం. పండగ సీజన్ కాబట్టి కాస్తో కూస్తో కలెక్షన్స్ రావొచ్చు.

Anaganaga Oka Raju
వరుసగా మూడు హిట్స్ కొట్టిన నవీన్ పోలిశెట్టి ఈసారి పండక్కి అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదట్నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫుల్ గా నవ్వించకపోయినా అక్కడక్కడా నవ్విస్తూ చివర్లో ఎమోషన్ తో మెప్పిస్తూ మధ్యలో పాలిటిక్స్ మీద సెటైర్ వేస్తూ బాగానే మెప్పించారు. పండగ సీజన్ కాబట్టి ఈ సినిమా ఫ్యామిలీస్ కి, యూత్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే 41 కోట్లు వచ్చాయి. వరుసగా నాలుగో సినిమా కూడా హిట్ కొట్టినట్టే నవీన్ పోలిశెట్టి.

Nari Nari Naduma Murari
ఇక చివరగా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాతో వచ్చాడు. అసలు సంక్రాంతి బరిలోనే లేని సినిమా చివర్లో సడెన్ గా వచ్చి, ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే బరిలోకి దిగారు. కానీ ఎవరూ ఊహించనంతగా ఈ సినిమా అందర్నీ మొదట్నుంచి చివరి వరకు ఫుల్ గా నవ్వించింది. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి పెద్ద రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ఇన్ని సినిమాల తర్వాత రావడం, ఎక్కువ ప్రమోషన్స్ లేకపోవడం, థియేటర్స్ తక్కువగా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. జనాల్లో కూడా గ్రౌండ్ లెవల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది కాబట్టి ఇంకొన్ని థియేటర్స్ పెరిగితే నారీ నారీ నడుమ మురారి సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చేవి.

మొత్తానికి సంక్రాంతి అంటే కేవలం ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, పండగ సినిమాలే అని అంతా అదే జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక్క రాజాసాబ్ మాత్రం అనుకోకుండా వాయిదాలు పడి సంక్రాంతి బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సంక్రాంతికి కేవలం తెలుగులోనే ఈ సినిమాలతో టాలీవుడ్ కి దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.
Also See : Sridevi : కోర్ట్ శ్రీదేవి సంక్రాంతి స్పెషల్ ఫొటోలు.. పొలాల్లో ఎంజాయ్ చేస్తూ..
