సందీప్ వంగాపై అతడు ఇటువంటి కామెంట్ ఎందుకు చేశాడు? ఎందుకింత కోపం?
ఆ ఒక్క పదం వాడడం వెనుక ఉన్న అసలు కారణాన్ని, వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వివరాలను తెలుసుకోండి...

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్‌ను ఎంతలా షేక్ చేసిందో, అంతకంటే ఎక్కువగా విమర్శలు, చర్చలను రేకెత్తించింది. ఈ వివాదంలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ సంఘటన. ఇండస్ట్రీలోని ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఒక చిన్న “సోషల్ మీడియా వార్” ఇది.
ఆ ఇద్దరు దిగ్గజాల్లో ఒకరు సంచలన దర్శకుడు అనురాగ్ కశ్యప్, మరొకరు విలక్షణ రచయిత వరుణ్ గ్రోవర్. అప్పట్లో అసలేం జరిగింది? ఆ ఒక్క “No” వెనుక ఉన్న కథేంటి? ఈ వివరాలను తాజాగా వరుణ్ గ్రోవర్ స్వయంగా వెల్లడించారు.
అగ్గి రాజేసిన అనురాగ్ పోస్ట్
‘యానిమల్’ విడుదలయ్యాక అనురాగ్ కశ్యప్.. సందీప్ వంగాతో దిగిన ఒక ఫొటోను షేర్ చేస్తూ.. “అతను చాలా నిజాయితీపరుడు” అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ పోస్ట్‌పై చాలా మంది సానుకూలంగా స్పందించగా, ప్రముఖ రచయిత వరుణ్ గ్రోవర్ మాత్రం కేవలం ఒక్క పదంతో కామెంట్ చేశారు. అ పదమే “No”. ఆ చిన్న పదం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. వరుణ్ ఎందుకు అలా స్పందించారు? అనురాగ్ కశ్యప్‌తో ఆయనకు విభేదాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
వరుణ్ గ్రోవర్ ఏమన్నాడు?
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వరుణ్ గ్రోవర్ తాను “No” అని కామెంట్ చేయడం వెనక ఉన్న కారణాన్ని విడమరిచి చెప్పాడు. “ఒక కళను (సినిమాను) సమర్థించడం వేరు, ఆ కళాకారుడి (దర్శకుడి) వ్యక్తిత్వాన్ని సమర్థించడం వేరు. అనురాగ్ కశ్యప్ పెట్టిన పోస్ట్ ‘యానిమల్’ సినిమా గురించి కాదు, పూర్తిగా సందీప్ వంగా వ్యక్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలా ఉంది. అందుకే నేను ‘No’ అన్నాను” అని చెప్పాడు.
“దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ గురించి కూడా సందీప్ వంగా అహంకారంగా మాట్లాడారు. ఆయనకు రాయడం రాదని, ఫీల్ లేదని విమర్శించారు” అని చెప్పాడు. సోషల్ మీడియాలో విమర్శించిన వారిపై వంగా వ్యక్తిగత దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని వరుణ్ అభిప్రాయపడ్డాడు.
“అనురాగ్ కేవలం సినిమా గురించి పోస్ట్ పెట్టి ఉంటే, నేను ఎప్పటికీ జోక్యం చేసుకునేవాడిని కాదు. కానీ ఆయన దర్శకుడి వ్యక్తిగత ప్రవర్తనను సమర్థిస్తున్నారని నాకు అనిపించింది” అని వరుణ్ స్పష్టం చేశాడు.
ఆ కామెంట్ చేసిన తర్వాత ఏం జరిగింది?
ఈ వివాదం వారి మధ్య స్నేహాన్ని దెబ్బతీయలేదు. వరుణ్ చెప్పిన దాని ప్రకారం.. అనురాగ్ కశ్యప్ చాలా మంచి మనసుతో స్పందించారు. “నేను కామెంట్ పెట్టిన అరగంటలోనే అనురాగ్ నాకు ఫోన్ చేశారు. ‘ఏమైంది వరుణ్? నీ ఉద్దేశం ఏంటి?’ అని ఎంతో ఓపికగా అడిగారు. మేమిద్దరం మా అభిప్రాయాలను పంచుకున్నాం. ఆయన ఎప్పుడూ తనను తాను గొప్పగా భావించరు, ఎదుటివారి అభిప్రాయానికి విలువ ఇస్తారు” అంటూ అనురాగ్‌పై ప్రశంసలు కురిపించారు.
ఈ సంఘటన కేవలం ఒక వివాదానికి సంబంధించినది మాత్రమే కాదు. ఒక సినిమాను, దానిని తీసిన వ్యక్తిని వేర్వేరుగా చూడాలా? లేదా కలిపి చూడాలా? అనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఏదేమైనా, ఆరోగ్యకరమైన చర్చకు ఎప్పుడూ చోటుంటుందని ఈ ఇద్దరు క్రియేటర్లు నిరూపించారు.